MLA Kamineni Srinivas: నా వ్యాఖ్యలు అపార్థానికి దారితీశాయి
ABN , Publish Date - Sep 28 , 2025 | 05:20 AM
ఇటీవల తాను శాసనసభలో చేసిన వ్యాఖ్యలు అపార్థానికి దారితీశాయని, అందువల్ల వాటిని రికార్డుల నుంచి తొలగించాలని కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ శనివారం అసెంబ్లీ స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు.
అసెంబ్లీ రికార్డుల నుంచి తొలగించండి
స్పీకర్‌కు కామినేని శ్రీనివాస్ విజ్ఞప్తి
బాలకృష్ణ వ్యాఖ్యల తొలగింపునకూ నిర్ణయం!
అమరావతి, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): ఇటీవల తాను శాసనసభలో చేసిన వ్యాఖ్యలు అపార్థానికి దారితీశాయని, అందువల్ల వాటిని రికార్డుల నుంచి తొలగించాలని కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ శనివారం అసెంబ్లీ స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ అంశాన్ని స్పీకర్‌కు తెలుపుతామని ఆ సమయంలో సభాస్థానంలో ఉన్న ఉపసభాపతి రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. ఈనెల 25న కామినేని మాట్లాడిన ఒక అంశంపై తీవ్ర వివాదం రేగిన విషయం తెలిసిందే. గత ప్రభుత్వ హయాంలో తనను కలిసేందుకు వచ్చిన సినీ ప్రముఖులను అప్పటి సీఎం జగన్ అవమానించారని, దీనిపై చిరంజీవి గట్టిగా అడిగారని కామినేని పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలపై హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ స్పందిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇది కూటమిలో అంతర్గత చర్చకు దారితీయడంతో, తన వ్యాఖ్యలను రికార్డులను తొలగించాలని కామినేని కోరారు. కాగా, కామినేని శ్రీనివాస్ వ్యాఖ్యలను అసెంబ్లీ రికార్డుల నుంచి తొలగించనున్న నేపథ్యంలో.. ఆయన వ్యాఖ్యలకు స్పందిస్తూ ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలనూ రికార్డుల్లో ఉంచాల్సిన అవసరం లేదని, వాటినీ తొలగించాలని నిర్ణయించారు. తన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని ఎమ్మెల్యే కామినేని కోరడాన్ని జనసేన పార్టీ తరఫున స్వాగతిస్తున్నట్లు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, యలమంచలి ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ శనివారం తెలిపారు.