Tadepalligudem Market: కడప ఉల్లి ధర ఢమాల్
ABN , Publish Date - Oct 13 , 2025 | 05:14 AM
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మార్కెట్‌కు ఉమ్మడి కడప జిల్లాల్లో సాగైన ఉల్లి పంట వస్తోంది. అయితే ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిని...
తాడేపల్లిగూడెం మార్కెట్‌లో కిలో రూ.5 నుంచి 10 మధ్యనే..
గిట్టుబాటు ధర లేక రైతు విలవిల
తాడేపల్లిగూడెం, అక్టోబరు 12(ఆంధ్రజ్యోతి): పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మార్కెట్‌కు ఉమ్మడి కడప జిల్లాల్లో సాగైన ఉల్లి పంట వస్తోంది. అయితే ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిని, నాణ్యత లేకపోవడంతో మంచి ధర పలకడం లేదు. కిలో ఉల్లిని రూ.5-10 మధ్యనే వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. గతంలో ఇక్కడి మార్కెట్‌కు కర్నూలు, మహారాష్ట్ర నుంచి మాత్రమే ఉల్లి వచ్చేది. ఉమ్మడి కడపలోని రాయచోటి, ప్రొద్దుటూరు, కొమ్మర్తి, జమ్మలమడుగు పరసర ప్రాంతాల్లో విస్తారంగా ఉల్లి సాగు చేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు పంట దెబ్బతిని నాణ్యత లోపించింది. ఆదివారం ఆరు లారీల్లో సుమారు 95 టన్నుల ఉల్లి తాడేపల్లిగూడెం రాగా.. నాణ్యత లేక కొనుగోలుకు వ్యాపారులు ఆసక్తి చూపలేదు. క్వింటాల్ రూ.500 నుంచి రూ.1000 మధ్య మాత్రమే పలికింది. గిట్టుబాటుకాక రైతులు విలవిలలాడుతున్నారు. నాణ్యత లేకపోవడంతోనే మంచి ధర పలకడం లేదని వ్యాపారులు చెబుతున్నారు. మహారాష్ట్ర నుంచి వచ్చిన ఉల్లి క్వింటాల్ రూ.1200-1800 మధ్య హోల్‌సేల్‌గా కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. ఆగస్టు, సెప్టెంబరు మాసాల్లో కురిసిన వర్షాలకు కర్నూలు ఉల్లి పాడైపోవడంతో అక్కడి రైతులను ఆదుకునేందుకు మార్క్‌ఫెడ్ క్వింటాల్ రూ.1200కు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. వాటిని రైతుబజార్లు, చౌకదుకాణాల్లోనూ, హాస్టళ్లకు విక్రయించారు.