Kadapa Mayor Removal: కడప మేయర్ సురేశ్‌బాబు తొలగింపు
ABN , Publish Date - Sep 26 , 2025 | 04:56 AM
కడప మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవి నుంచి కె.సురేష్ బాబును ప్రభుత్వం తొలగించింది. ఈ మేరకు పట్టణాభివృద్ధి, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేశ్‌కుమార్...
డిప్యూటీ మేయర్ ముంతాజ్ బేగంకు ఇన్‌చార్జి బాధ్యతలు
ఉత్తర్వులు రద్దుకు హైకోర్టును ఆశ్రయించిన మాజీ మేయర్
కౌంటర్ దాఖలుకు ఆదేశం, విచారణ 7కి వాయిదా
కడప ఎర్రముక్కపల్లె/అమరావతి, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): కడప మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవి నుంచి కె.సురేష్ బాబును ప్రభుత్వం తొలగించింది. ఈ మేరకు పట్టణాభివృద్ధి, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేశ్‌కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. కొత్త మేయర్ బాధ్యతలు చేపట్టే వరకు డిప్యూటీ మేయర్ ఎస్.ముంతాజ్ బేగం ఇన్‌చార్జి మేయర్‌గా వ్యవహరించాలని ప్రభుత్వం గురువారం ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు.. తనను మేయర్ బాధ్యతల నుంచి తొలగిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ మాజీ మేయర్ సురేశ్‌బాబు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు గురువారం విచారణ జరిపింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని వ్యాజ్యంలో ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. వ్యాజ్యంపై తదుపరి విచారణను అక్టోబర్ 7వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.హరినాథ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.