Garment Industry: కడప గడపన గార్మెంట్స్ పరిశ్రమ
ABN , Publish Date - Sep 07 , 2025 | 03:32 AM
అది... కడప నగర శివారు ఉన్న కొప్పర్తి ఇండస్ర్టియల్ హబ్. ఇందులో ఇటీవల ఏర్పాటైన టెక్సోనా రెడీమేడ్ దుస్తుల పరిశ్రమకు వెళ్తే.. సెక్యూరిటీ గార్డులు, ఎలక్ట్రీషియన్లతో పాటు అతి కొద్దిమంది ఉద్యోగులు...
600 మందికి ఉపాధి
97 శాతం మంది మహిళలే
అందరూ స్థానికులే
మరో 1500 మందికి అవకాశాలు
రెడీమేడ్ దుస్తుల తయారీ
యూరప్, అమెరికా, జపాన్‌కు ఎగుమతి
అది... కడప నగర శివారులో ఉన్న కొప్పర్తి ఇండస్ర్టియల్ హబ్. ఇందులో ఇటీవల ఏర్పాటైన టెక్సోనా రెడీమేడ్ దుస్తుల పరిశ్రమకు వెళ్తే.. సెక్యూరిటీ గార్డులు, ఎలక్ట్రీషియన్లతో పాటు అతి కొద్దిమంది ఉద్యోగులు మినహా అంతా మహిళలే కనిపిస్తారు. ఈ పరిశ్రమలో ప్రస్తుతం 600 మంది పనిచేస్తుండగా.. వారిలో 97 శాతం మహిళలు ఉన్నారు. ప్రాంగణమంతా మహిళలతో కిటకిట లాడుతోంది. అందరూ స్థానికులే. వారు కుట్టిన దుస్తులు యూరప్, అమెరికా, జపాన్ దేశాలకు ఎగుమతి అవుతున్నాయి.
(కడప-ఆంధ్రజ్యోతి)
అది... కడప నగర శివారు ఉన్న కొప్పర్తి ఇండస్ర్టియల్ హబ్. ఇందులో ఇటీవల ఏర్పాటైన టెక్సోనా రెడీమేడ్ దుస్తుల పరిశ్రమకు వెళ్తే.. సెక్యూరిటీ గార్డులు, ఎలక్ట్రీషియన్లతో పాటు అతి కొద్దిమంది ఉద్యోగులు మినహా అక్కడంతా మహిళలే కనిపిస్తారు. ఈ పరిశ్రమలో ప్రస్తుతం 600 మంది పనిచేస్తుండగా.. వారిలో 97 శాతం మహిళలు ఉన్నారు. ప్రాంగణమంతా మహిళలతో కిటకిట లాడుతోంది. అందరూ స్థానికులే. వారు కుట్టిన దుస్తులు యూరప్, అమెరికా, జపాన్ దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. సుమారు 17.50 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన టెక్సోనా మొదటి ఫేజ్‌ను ఈ నెల 2న మంత్రి లోకేశ్ ప్రారంభించారు. ఈ పరిశ్రమ మొత్తం 2100 మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. ఇంకా 1500 మంది మహిళలకు ఉపాధి అవకాశాలున్నాయి. పనిచేయడానికి ఆసక్తి గల మహిళలు పరిశ్రమ పనివేళల్లో వచ్చి సంప్రదించవచ్చునని టెక్సోనా ప్రతినిధులు తెలిపారు. ఈ గార్మెంట్ పరిశ్రమ గురించి ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం..
స్థానికులకే ఉపాధి
కొన్ని పరిశ్రమలు ఏర్పాటయ్యాక చిన్న చిన్న ఉద్యోగాలు మినహాయిస్తే ఎక్కువగా ఉత్తరాది వాళ్లకే ఇచ్చేవారు. కొప్పర్తి టెక్సోనాలో మాత్రం అంతా స్థానికులే. కడప నుంచి చుట్టూ 45 కి.మీ. దూరంలో ఉన్న మహిళలకు ఉపాధి కల్పిస్తున్నారు. కడప, కమలాపురం, పులివెందుల, మైదుకూరు, రాజంపేట నియోజకవర్గాలకు చెందినవారు పనిచేస్తున్నారు. రోజూ కమలాపురం, వేంపల్లె, మైదుకూరు, ఖాజీపేట, జీవీ సత్రం, సిద్దవటం, ఒంటిమిట్ట తదితర మండలాలకు చెందిన మహిళలు వస్తున్నారు. ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తారు. వీరికి ఉచిత బస్సు సౌకర్యం కల్పించారు. ఆదివారంతో పాటు ప్రభుత్వ సెలవు దినాలన్నీ వర్తిస్తాయి. టైలరింగ్ చేసే మహిళలకు నెలకు రూ.10 వేలు, నాన్ టైలరింగ్ అంటే.. వాషింగ్, చెకింగ్ ఇతర పనులకు రూ.9,600 వేతనం ఇస్తారు. ఇంపోర్టెడ్ కంపెనీల వారిచ్చిన దుస్తులను వారు సూచించిన డిజైన్‌ల ప్రకారం కుట్టాలి. దీనికోసం 45 రోజుల పాటు బెంగళూరు, చెన్నైకి చెందిన నిపుణులతో ఇక్కడే శిక్షణ ఇప్పిస్తారు. శిక్షణ సమయంలో రూ.2,500 స్టైఫండ్ ఇస్తారు. శిక్షణ పూర్తయిన తరువాత వేతనం అమలవుతుంది. ఈఎ్‌సఐ, పీఎఫ్ ఇతర సదుపాయాలు ఉంటాయి. ఇక ఏటా జీతం పెంపు, దీపావళికి బోనస్ ఉంటాయి.
రోజుకు 15 వేల పీస్‌ల తయారీ
టెక్సోనాలో అత్యాధునికమైన కుట్టుమిషన్లు, వాషింగ్ మిషన్లు, డ్రయర్స్ ఉన్నాయి. ఒక్కోటి సుమారు రూ.25 లక్షలు విలువ చేసే కుట్టుమిషన్లు ఉన్నాయి. పరిశ్రమలో రోజూ 15 వేల పీస్‌లు కుట్టేలా అత్యాధునిక మిషనరీ ఉంది. అలాగే 25 వేల పీస్‌లు వాషింగ్, డ్రయింగ్ చేసే అత్యాధునిక మిషన్లు ఉన్నాయి. ప్రస్తుతం ఇక్కడ రిలయన్స్‌కు సంబంధించి ప్యాంట్లు తయారు చేస్తున్నారు. త్వరలో జాకెట్లు కూడా ఇక్కడే తయారు కానున్నాయి. కంపెనీ ప్రతినిధులు సూచించిన డిజైన్ల మేరకు దుస్తులను కొలతల ప్రకారం కుట్టిన తర్వాత ఉతికి ఆరబెట్టి చివరగా ఐరన్ చేసి ప్యాక్ చేస్తారు. వీటన్నింటినీ బెంగళూరులోని ప్రధాన కేంద్రానికి సరఫరా చేస్తారు. అక్కడి నుంచి ఆర్డర్ల ప్రకారం విదేశాలలోని కంపెనీలకు ఎగుమతి చేస్తారు.
మహిళల కోసం సదుపాయాలు
పరిశ్రమలో పనిచేసే మహిళల కోసం కంపెనీ మౌలిక సదుపాయాలు కల్పించింది. ఐదేళ్ల లోపు చిన్నపిల్లలను వెంట తీసుకెళ్లవచ్చు. వారికి ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేశారు. అక్కడ ఆయా, టీచరు ఉంటారు. మహిళలకు అనారోగ్య సమస్యలు తలెత్తితే ప్రాంగణంలోనే వైద్యశాల అందుబాటులో ఉంది. డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది ఉన్నారు. ఇది గ్రీన్‌పార్కు పరిశ్రమ కావడంతో ఇటీవల 300 మొక్కలను పచ్చదనం కోసం నాటారు.
విద్యార్హత అవసరం లేదు
కొప్పర్తి పరిశ్రమలో 45 నుంచి 50 కి.మీ. దూరంలో ఉన్న స్థానిక మహిళలకు ఉపాధి కల్పిస్తున్నాం. పనిచేయడానికి ఆసక్తి ఉన్న మహిళలు పరిశ్రమ పని వేళల్లో వచ్చి నేరుగా సంప్రదించవచ్చు. విద్యార్హత అవసరం లేదు. ఉన్నత చదువులు చదివిన వారికి ఉన్నత పదవుల్లో అవకాశాలు ఉంటాయి. ఇక్కడ మహిళలకు అన్ని వసతులూ ఏర్పాటు చేశాం. ఇది ఉత్తమ పరిశ్రమ.
- విక్టర్, టెక్సోనా కడప ప్లాంటు హెడ్
వసతులు బాగున్నాయి
టెక్సోనా పరిశ్రమలో వసతులు బాగున్నాయి. టైలరింగ్‌లో ప్రతిభ కనబరచడంతో ఆపరేషన్స్ ఇన్‌చార్జ్‌గా పనిచేస్తున్నాను. ఇక్కడంతా మహిళలమే పనిచేస్తున్నాం. ఉచిత రవాణా కూడా ఉంది.
- బి.విజయనిర్మల, ఖాజీపేట
వంద మంది వస్తున్నాం
తొలుత నేను ఒక్కదానినే టైలరింగ్‌కు వచ్చాను. అన్ని వసతులు బాగుండడంతో మా ఊరి నుంచే సుమారు వంద మంది దాకా వస్తున్నాం. సాయంత్రం 5 గంటలకు ఇంటికి వెళుతున్నాం.
- అఖిల, ఖాజీపేట
భద్రత బాగుంది
కంపెనీలో మహిళలకు భద్రత బాగుంది. పగటి పూటనే పని. అనారోగ్యం కలిగితే ఆసుపత్రి అందుబాటులో ఉంది. ఇక్కడ అన్ని వసతులు ఉన్నాయి.
- లావణ్య, కడప