Justice Sudhanshu: ఏపీ, కర్ణాటక సరిహద్దుకు జస్టిస్ సుధాన్షు
ABN , Publish Date - Dec 11 , 2025 | 04:05 AM
ఏపీ, కర్ణాటక సరిహద్దులోని వివాదాస్పద ఇనుప గనుల ప్రాంతాన్ని సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుధాన్షు ధూలియా పరిశీలించారు....
వివాదాస్పద మైనింగ్ ప్రాంతం పరిశీలన
సరిహద్దులు, అక్రమ తవ్వకాలపై ఆరా
డీ.హీరేహాళ్, డిసెంబరు10(ఆంధ్రజ్యోతి): ఏపీ, కర్ణాటక సరిహద్దులోని వివాదాస్పద ఇనుప గనుల ప్రాంతాన్ని సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుధాన్షు ధూలియా పరిశీలించారు. అంతర్రాష్ట్ర సరిహద్దు వివాదం, గనుల అక్రమ తవ్వకాలు, అటవీ ప్రాంతంలో గనుల తవ్వకాలను నిర్ధారించేందుకు సుప్రీంకోర్టు ఈ ఏడాది సెప్టెంబరులో జస్టిస్ సుధాన్షు కమిటీని ఏర్పాటు చేసింది. దీంతో బుధవారం అనంతపురం జిల్లా డి.హీరేహాళ్ మండలానికి జస్టిస్ సుధాన్షు విచ్చేశారు. మండలంలోని ఆరు మైనింగ్ ప్రాంతాలను పరిశీలించారు. కమిటీ ఈ నెల 19వ తేదీన సుప్రీంకోర్టుకు నివేదికను సమర్పించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో 20 రోజులకుపైగా రెవెన్యూ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్, అటవీ, మైన్స్ అండ్ జియాలజీ తదితర శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో చేస్తున్న సర్వే ఎంతవరకు వచ్చింది? ఇప్పటిదాకా గుర్తించిన అంశాలు ఏమిటని జస్టిస్ సుధాన్షు అధికారులను అడిగి తెలుసుకున్నారు. అంతకు ముందు ఆయన ఏపీ, కర్ణాటక అధికారులతో బళ్లారిలో సమావేశం నిర్వహించారు. గతంలో జరిగిన మైనింగ్, వివాదాల గురించి చర్చించారు. అనంతరం రాష్ట్ర, జిల్లాస్థాయి అధికారులతో కలిసి ఆరు మైనిం గ్ ప్రాంతాలను పరిశీలించారు. ప్రభుత్వం నిర్దేశించిన సరిహద్దుల మేరకే మైనింగ్ తవ్వకాలు జరిగాయా, హద్దులు మీరారా అని పరిశీలించారు. ఆయన వెంట డైరెక్టర్ ఆఫ్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ కూర్మనాథ్, ఆర్‌జేడీ నిత్యానంద్, సర్వే ఆఫ్ ఇండియా ప్రతినిధి శ్రీనివాస్ చౌదరి, తహసీల్దార్ శ్రీనివాసులు, సర్వేయర్ రవితేజ తదితరులున్నారు.