Minister Farooq: ప్రజలకు మరింత చేరువగా న్యాయ సేవలు
ABN , Publish Date - Jun 14 , 2025 | 04:56 AM
రాష్ట్రంలో న్యాయశాఖ సేవలను ప్రజలకు మరింత చేరవ చేసేందుకు అవసరమైన అన్ని చర్యలను చేపట్టామని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ తెలిపారు.
గ్రామ న్యాయాలయాల ప్రారంభానికి చర్యలు: మంత్రి ఫరూక్
అమరావతి, జూన్ 13(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో న్యాయశాఖ సేవలను ప్రజలకు మరింత చేరవ చేసేందుకు అవసరమైన అన్ని చర్యలను చేపట్టామని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ తెలిపారు. శుక్రవారం అమరావతి సచివాలయంలో న్యాయశాఖ కార్యదర్శి ప్రతిభాదేవి, ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించారు. నూతన కోర్టుల భవనాలకు, గృహ సముదాయాల నిర్మాణాలకు వినతులు వస్తున్నాయన్నారు. క్షేత్రస్థాయిలో అవసరాలు, డిమాండ్లను బట్టి ప్రతిపాదనలను సిద్ధం చేసి కేంద్ర న్యాయశాఖకు నివేదించాలని అధికారులకు మంత్రి సూచించారు. రాష్ట్రంలో గ్రామ న్యాయాలయాలను ప్రారంభించేందుకు న్యాయశాఖ తరఫున అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
మైనార్టీల ఖాతాల్లో రూ. 718.95 కోట్లు జమ
తల్లికి వందనం పథకం మైనార్టీ కుటుంబాలకు ఎంతో బాసటగా నిలిచిందని మంత్రి ఫరూక్ ఓ ప్రకటనలో చెప్పారు. గత ప్రభుత్వం కంటే 54 శాతం ఎక్కువగా మైనార్టీలకు లబ్ధి చేకూరిందన్నారు. రాష్ట్రంలో 4.81 లక్షల మంది ముస్లిం (దూదేకుల, నూర్ బాషాల కులాలకు మినహాయించి), క్రిస్టియన్ మైనార్టీ విద్యార్థులకు సంబంధించిన తల్లుల ఖాతాల్లో తల్లికి వందనం పథకం ద్వారా రూ.718.95 కోట్లు ప్రభుత్వం జమ చేసిందన్నారు. గత ప్రభుత్వంలో 2023-24లో నాటి ప్రభుత్వం కేవలం 3.12 లక్షల మంది విద్యార్థులకు రూ.468 కోట్లు మాత్రమే ఇచ్చిందన్నారు.