Share News

Krishna Water Dispute: ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు న్యాయమే జరిగింది

ABN , Publish Date - Dec 18 , 2025 | 03:57 AM

ట్రైబ్యునళ్లు, న్యాయస్థానాలూ రాజకీయ ప్రాతిపదికన నదీ జలాలను కేటాయించవని ఆంధ్రప్రదేశ్‌ స్పష్టంచేసింది.

Krishna Water Dispute: ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు న్యాయమే జరిగింది

  • రాజకీయ ప్రాతిపదికన నీటి పంపకాలు ఉండవు: ఏపీ

  • బ్రిజేశ్‌ ట్రైబ్యునల్‌ ముందు సీనియర్‌ న్యాయవాది జైదీప్‌ గుప్తా పటిష్ఠ వాదనలు

  • సమన్యాయం కోసమే ఎస్‌ఎల్‌బీసీ, ఎస్‌ఆర్‌బీసీకి ఒకేసారి అనుమతులు

  • విభజన జరిగి 11 ఏళ్లయినా ఎస్‌ఎల్‌బీసీని తెలంగాణ పూర్తి చేసుకోలేదు

  • ఎస్‌ఆర్‌బీసీని ఏపీ పూర్తిచేయడాన్ని ఎలా తప్పుబడతారు?: గుప్తా

అమరావతి, డిసెంబరు 17 (ఆంధ్రజ్యోతి): ట్రైబ్యునళ్లు, న్యాయస్థానాలూ రాజకీయ ప్రాతిపదికన నదీ జలాలను కేటాయించవని ఆంధ్రప్రదేశ్‌ స్పష్టంచేసింది. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు న్యాయమే జరిగిందని తేల్చిచెప్పింది. కొత్త రాష్ట్రంగా పేర్కొంటూ అన్ని హక్కులూ తమవేనంటే.. నీటి కేటాయింపులు జరిగిపోవని.. రాజకీయ వాదనలతో జరిగేది నీటియుద్ధాలే తప్ప.. కేటాయింపులు కాదని పేర్కొంది. కృష్ణా ట్రైబ్యునల్‌-1, రాష్ట్ర విభజన చట్టం(2014)లోని సెక్షన్‌ 85లో నీటి కేటాయింపులపై స్పష్టంగా పేర్కొన్నారని గుర్తుచేసింది. కృష్ణా జలాల పునఃపంపిణీపై జస్టిస్‌ బ్రిజేశ్‌కుమార్‌ సారథ్యంలోని కృష్ణా జలవివాదాల ట్రైబ్యునల్‌-2 ఎదుట ఏపీ తరఫు సీనియర్‌ న్యాయవాది జైదీప్‌ గుప్తా బుధవారం కూడా తన వాదనలు బలంగా వినిపించారు. ఉమ్మడి రాష్ట్రంలో సమన్యాయం కోసమే ఎస్‌ఎల్‌బీసీ, ఎస్‌ఆర్‌బీసీకి ఒకేసారి అనుమతులు తీసుకున్నామని తెలిపారు. అన్నీ సానుకూలంగా ఉన్నా.. రాష్ట్ర విభజన జరిగి 11 ఏళ్లు పూర్తయినా శ్రీశైలం లెఫ్ట్‌ బ్యాంక్‌ కెనాల్‌ (ఎస్‌ఎల్‌బీసీ)ని తెలంగాణ పూర్తి చేయలేకపోయిందన్నారు. ‘ఎస్‌ఆర్‌ఎ్‌సపీని ఏపీ పూర్తి చేయడాన్ని తెలంగాణ ఎలా తప్పుబడుతుంది? ఎస్‌ఎల్‌బీసీని పూర్తి చేయకుండా దానిని ఎవరడ్డుకున్నారు? ఎలిమినేటి మాధవరెడ్డి ఎడమ కాలువ పనులను ఉమ్మడి రాష్ట్రంలోనే పూర్తి చేశాం. ఇది సమన్యాయం కాదా’ అని ప్రశ్నించారు. 1954లో నందికొండ ప్రాజెక్టు (ప్రస్తుతం నాగార్జునసాగర్‌) కట్టేముందే హైదరాబాద్‌, మద్రాసు రాష్ట్రాల మధ్య ఒప్పందం జరిగిందని.. పరివాహక ప్రాంతం ఆవల కూడా నీటి కేటాయింపులు జరపాలని నాడు నిర్ణయించారని.. ఈ ఒప్పందం గురించి తమకు తెలియదంటూ తెలంగాణ ఇప్పుడు అభ్యంతరం వ్యక్తం చేయడం ఏమిటని నిలదీశారు.


అలాగే 1944 ఒప్పందంలో మద్రాసు, హైదరాబాద్‌ రాష్ట్రాలు చెరో 65 టీఎంసీలు వాడుకోవాలని ఉన్నట్లు తెలంగాణ చెబుతోందని.. అందుచేత కృష్ణా జలాలను ఇప్పుడు సమంగా వాడుకోవాలని వాదించడం అర్థరహితమన్నారు. అసలీ ఒప్పందం అమల్లోకే రాలేదని.. దీని ఆధారంగా నీటి కేటాయింపులు చేయలేరని తేల్చిచెప్పారు. ‘1972లో కృష్ణా ట్రైబ్యునల్‌-1 స్పష్టమైన ఆదేశాలిచ్చింది. సమాన వినియోగం వర్తించదని.. ప్రాజెక్టుల వారీగానే కేటాయింపులు ఉంటాయని స్పష్టంగా పేర్కొంది. తుంగభద్ర ప్రాజెక్టు తెలంగాణ పరిధిలోకే రాదు. ఆ రాష్ట్రం వాదనలేవీ సరికాదు. 1956లో హైదరాబాద్‌ను మినహాయిస్తూ ఒప్పందం జరిగిందనడమూ చెల్లదు. న్యాయపరమైన వాదనలు వినిపించలేక.. చారిత్రక ఘట్టాలంటూ తెలంగాణ రాజకీయ వాదనలకు దిగుతోంది’ అని తెలిపారు. కేసీ కెనాల్‌, ఆర్‌డీఎ్‌సలకు నీటి అవసరాల దృష్ట్యా ఇండెంట్‌ పెట్టడమే తప్ప కేటాయింపుల్లేవని గుప్తా స్పష్టంచేశారు. ట్రైబ్యునల్‌ విచారణ గురువారం కూడా కొనసాగనుంది.

Updated Date - Dec 18 , 2025 | 03:58 AM