Share News

High Court Judge: జస్టిస్‌ మానవేంద్రనాథ్‌ రాయ్‌ ప్రమాణ స్వీకారం

ABN , Publish Date - Oct 28 , 2025 | 04:15 AM

రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ చీకటి మానవేంద్రనాథ్‌ రాయ్‌ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు.

High Court Judge: జస్టిస్‌ మానవేంద్రనాథ్‌ రాయ్‌ ప్రమాణ స్వీకారం

  • ప్రమాణం చేయించిన హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఠాకూర్‌

అమరావతి, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ చీకటి మానవేంద్రనాథ్‌ రాయ్‌ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టులోని మొదటి కోర్టు హాల్‌లో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌ ఆయనతో ప్రమాణం చేయించారు. తొలుత రాష్ట్రానికి జస్టిస్‌ రాయ్‌ బదిలీకి సంబంధించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ వైవీఎ్‌సబీజీ పార్థసారథి చదివి వినిపించారు. 2019 జూన్‌లో రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన ఆయన.. 2023 నవంబరులో గుజరాత్‌ హైకోర్టుకు బదిలీ అయ్యారు. ఈ ఏడాది ఆగస్టు 24న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ నేతృత్వంలోని కొలీజియం సమావేశమై ఆయన్ను తిరిగి ఏపీ హైకోర్టుకు బదిలీ చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేయడం.. రాష్ట్రపతి ఆమోదముద్ర వేసి ఉత్తర్వులివ్వడం తెలిసిందే. సోమవారం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి జస్టిస్‌ రాయ్‌ కుటుంబ సభ్యులు, అడ్వకేట్‌ జనరల్‌ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్‌, అదనపు ఏజీ సాంబశివ ప్రతాప్‌, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ మెండ లక్ష్మీనారాయణ, అదనపు సొలిసిటర్‌ జనరల్‌ చల్లా ధనుంజయ, రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడు ద్వారకానాథరెడ్డి, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కె.చిదంబరం, రిజిస్ట్రార్లు, హైకోర్టు న్యాయవాదులు, కోర్టు సిబ్బంది తదితరులు హాజరయ్యారు.

Updated Date - Oct 28 , 2025 | 04:18 AM