Share News

AP High Court: ఆ ఇద్దరు జడ్జీలు వెనక్కి

ABN , Publish Date - Oct 15 , 2025 | 04:27 AM

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు నుంచి గతంలో బదిలీ అయిన న్యాయమూర్తులు జస్టిస్‌ మానవేంద్రనాథ్‌రాయ్‌, జస్టిస్‌ డి.రమేశ్‌ తిరిగి రాష్ట్ర హైకోర్టుకు వస్తున్నారు.

AP High Court: ఆ ఇద్దరు జడ్జీలు వెనక్కి

  • జస్టిస్‌ మానవేంద్రనాథ్‌రాయ్‌, జస్టిస్‌ డి.రమేశ్‌ తిరిగి ఏపీ హైకోర్టుకు బదిలీ

  • కలకత్తా హైకోర్టు నుంచి జస్టిస్‌ సుభేందు కూడా..

  • కొలీజియం సిఫారసుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం

  • కేంద్ర న్యాయ శాఖ నోటిఫికేషన్‌ జారీ

అమరావతి, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు నుంచి గతంలో బదిలీ అయిన న్యాయమూర్తులు జస్టిస్‌ మానవేంద్రనాథ్‌రాయ్‌, జస్టిస్‌ డి.రమేశ్‌ తిరిగి రాష్ట్ర హైకోర్టుకు వస్తున్నారు. ప్రస్తుతం గుజరాత్‌ హైకోర్టులో ఉన్న జస్టిస్‌ మానవేంద్రనాథ్‌రాయ్‌ను, అలహాబాద్‌ హైకోర్టులో ఉన్న జస్టిస్‌ రమేశ్‌ను మాతృ హైకోర్టుకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం ఈ ఏడాది ఆగస్టు 24న కేంద్రప్రభుత్వానికి చేసిన సిఫారసుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేశారు. దీంతో ఇందుకు సంబంధించి కేంద్ర న్యాయ శాఖ మంగళవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. అలాగే ప్రస్తుతం కలకత్తా హైకోర్టు న్యాయమూర్తిగా సేవలందిస్తున్న జస్టిస్‌ సుభేందు సమంతను కూడా ఏపీ హైకోర్టుకు బదిలీ చేశారు. జస్టిస్‌ మానవేంద్రనాథ్‌రాయ్‌ 2019 జూన్‌ 20న, జస్టిస్‌ రమేశ్‌ 2020 జనవరి 13న ఏపీ హైకోర్టు న్యాయమూర్తులుగా బాధ్యతలు చేపట్టారు. బదిలీపై జస్టిస్‌ రమేశ్‌ 2023 జూలై 24న అలహాబాద్‌ హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టగా.. జస్టిస్‌ మానవేంద్రనాథ్‌రాయ్‌ 2023 నవంబరు 2న గుజరాత్‌ హైకోర్టు న్యాయమూర్తిగా వెళ్లారు. ఏపీ హైకోర్టులో మొత్తం 37 మంది న్యాయమూర్తుల నియామకానికి ఆమోదం ఉంది. అదనపు న్యాయమూర్తులతో కలిపి ప్రస్తుతం 30 మంది ఉన్నారు. పై ముగ్గురి రాకతో జడ్జీల సంఖ్య 33కి చేరనుంది.


జస్టిస్‌ రాయ్‌.. ఏపీ హైకోర్టుకు తొలి న్యాయమూర్తి

జస్టిస్‌ మానవేంద్రనాథ్‌ రాయ్‌ స్వగ్రామం విజయనగరం జిల్లా పార్వతీపురం. ఆయన 1964 మే 21న చీకటి నరహరిరావు, విజయలక్ష్మి దంపతులకు జన్మించారు. సంప్రదాయ వ్యవసాయ కుటుంబానికి చెందిన ఆయన విశాఖపట్నంలోని ఎంవీపీ లా కళాశాలలో న్యాయశాస్త్రం అభ్యసించారు. 1988 జూలైలో ఏపీ బార్‌ కౌన్సిల్‌లో న్యాయవాదిగా ఎన్‌రోల్‌ అయ్యారు. 1988 నుంచి 2002 వరకు పార్వతీపురం, విజయనగరంలో ప్రాక్టీసు చేశారు. 2002లో రాష్ట్ర ఉన్నత న్యాయ సర్వీసులో జిల్లా సెషన్స్‌ జడ్జి(గ్రేడ్‌-2)గా ఎంపికయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ కోర్టుల్లో న్యాయాధికారిగా, జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా సేవలు అందించారు. అమరావతిలో ఏపీ హైకోర్టును నెలకొల్పాక 2019 జనవరి 1 నుంచి జూన్‌ 20న హైకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందే వరకు ఏపీ హైకోర్టు మొదటి రిజిస్ట్రార్‌ జనరల్‌గా సేవలు అందించారు. ఏపీ హైకోర్టు ఏర్పాటైన తర్వాత నియమితులైన మొదటి న్యాయమూర్తి జస్టిస్‌ మానవేంద్రనాథ్‌రాయ్‌.


జస్టిస్‌ రమేశ్‌.. ప్రభుత్వ న్యాయవాదిగా..

జస్టిస్‌ డి.రమేశ్‌ ఉమ్మడి చిత్తూరు జిల్లా మదనపల్లె సమీపంలోని కమ్మపల్లి గ్రామంలో 1965 జూన్‌ 27న డీవీ నారాయణనాయుడు, అన్నపూర్ణమ్మ దంపతులకు జన్మించారు. నెల్లూరు వీఆర్‌ లా కళాశాలలో న్యాయశాస్త్రం అభ్యసించారు. 1990లో న్యాయవాదిగా ఎన్‌రోల్‌ అయ్యారు. ఉమ్మడి హైకోర్టులో ప్రాక్టీస్‌ ప్రారంభించారు. 2000-2004 నడుమ ప్రభుత్వ న్యాయవాదిగా.. 2007లో ఏపీ సర్వశిక్ష అభియాన్‌కు స్టాండింగ్‌ కౌన్సిల్‌గా నియమితులయ్యారు. 2020 జనవరి 13న ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. 2023 జూలై 24న అలహాబాద్‌ హైకోర్టుకు బదిలీ అయ్యారు. ఇప్పుడు తిరిగి మాతృ హైకోర్టుకు వస్తున్నారు.


జస్టిస్‌ సుభేందు.. దీర్ఘకాలం జిల్లా న్యాయాధికారిగా..

జస్టిస్‌ సుభేందు సమంత 1971 నవంబరు 25న జన్మించారు. కలకత్తా యూనివర్సిటీ హజ్రా క్యాంప్‌సలో న్యాయశాస్త్రాన్ని అభ్యసించారు. తమ్లుక్‌ జిల్లా కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్‌ ప్రారంభించారు. అనంతరం న్యాయాధికారిగా ఎంపికయ్యారు. పశ్చిమ మిడ్నపూర్‌లో అదనపు జిల్లా-సెషన్స్‌ జడ్జిగా, కలకత్తా సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం జడ్జిగా, బీర్‌భూం, నదియా జిల్లాలకు జిల్లా-సెషన్స్‌ జడ్జిగా పనిచేశారు. కలకత్తా సిటీ సెషన్స్‌ కోర్టు చీఫ్‌ జడ్జిగా పనిచేశారు. అండమాన్‌ నికోబార్‌లో జిల్లా సెషన్స్‌ జడ్జిగానూ సేవలు అందించారు. 2022 మే 18న కలకత్తా హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా, ఈ ఏడాది ఏప్రిల్‌ 28న శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు.

Updated Date - Oct 15 , 2025 | 04:29 AM