Share News

AP Govt: రామాయపట్నం అనుబంధంగా జేఎస్‌డబ్ల్యూ ఉక్కు

ABN , Publish Date - Jul 15 , 2025 | 03:39 AM

నెల్లూరు జిల్లాలోని రామాయపట్నం పోర్టుకు అనుబంధంగా మరో భారీ పరిశ్రమ ఏర్పాటు కానుంది. ప్రఖ్యాత జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌ ఇక్కడ ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయనుంది.

AP Govt: రామాయపట్నం అనుబంధంగా జేఎస్‌డబ్ల్యూ ఉక్కు

  • స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు దిశగా అడుగులు

  • లింగసముద్రంలో ఐరన్‌ ఓర్‌ కేటాయింపునకు ఎన్‌వోసీ

కందుకూరు, జూలై 14 (ఆంధ్రజ్యోతి): నెల్లూరు జిల్లాలోని రామాయపట్నం పోర్టుకు అనుబంధంగా మరో భారీ పరిశ్రమ ఏర్పాటు కానుంది. ప్రఖ్యాత జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌ ఇక్కడ ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయనుంది. దీని కోసం రామాయపట్నం పరిసరాల్లో భూ కేటాయింపులు చేయాలని గత ప్రభుత్వంలోనే దరఖాస్తు చేసుకోగా..ప్రస్తుతం ఆ దిశగా చకచకా అడుగులు పడుతున్నాయి. ఉక్కు రంగంలో జేఎస్‌డబ్ల్యూకు మంచి పేరు ఉండడంతో ఈ పరిశ్రమ ఏర్పాటుకు అవసరమైన తోడ్పాటు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తంచేసి..అవసరమైన అనుమతుల మంజూరుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటోంది. పోర్టు సమీపంలో భూ కేటాయింపునకు అంగీకరించడంతోపాటు లింగసముద్రం, వలేటివారిపాలెం మండలాల్లో ఇనుప ఖనిజ నిక్షేపాలున్న కొండలు, ఇతర ప్రభుత్వ భూములు కూడా ఆ సంస్థకు కేటాయించాలని నిర్ణయించింది. ఈ మేరకు లింగసముద్రం మండలంలో ఐరన్‌ ఓర్‌ నిక్షేపాలున్న పలు గ్రామాల పరిధిలోని ప్రభుత్వ భూములు, కొండలను 726 ఎకరాల విస్తీర్ణం మేర జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌నకు మైనింగ్‌ కోసం అప్పగించేందుకు ఎన్‌వోసీ ఇస్తూ లింగసముద్రం తహసీల్దారు సీతామహాలక్ష్మి ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపారు. ఈ ఎన్‌వోసీ సమర్పించి ఐదు నెలలు గడవగా తాజాగా విషయం వెలుగులోకి వచ్చింది. ప్రకాశం,నెల్లూరు జిల్లాల సరిహద్దు మండలాల్లో 9.14 చదరపు కిలోమీటర్లు విస్తీర్ణంలో ఐరన్‌ ఓర్‌ నిక్షేపాలున్నట్లు జియోగ్రాఫికల్‌ సర్వే అధికారులు గతంలోనే నిర్ధారించారు.


ఈ క్రమంలో లింగసముద్రం మండలంలోని నాలుగు గ్రామాల్లో భూకేటాయింపులకు ఎన్‌వోసీ జారీచేశారు. మండల కేంద్రమైన లింగసముద్రంలో 19.78 ఎకరాలు, తిమ్మారెడ్డిపాలెంలో 150.76 ఎకరాలు, ఆర్‌ఆర్‌ పాలెంలో 21 ఎకరాలు, జంగంరెడ్డికండ్రికలో వివిధ సర్వే నంబర్లలో ఉన్న 423.33 ఎకరాల ప్రభుత్వ భూమితోపాటు, రైతులకు సంబంధించిన 111 ఎకరాల పట్టాభూములను, ఎర్రారెడ్డిపాలెంలో 3.46 ఎకరాలను జేఎ్‌సడబ్ల్యూ ఐరన్‌ఓర్‌ మైనింగ్‌కు అప్పగించేందుకు ఎన్‌వోసీ జారీచేశారు.

Updated Date - Jul 15 , 2025 | 03:40 AM