Share News

Fake Liquor Scam: జోగికి బిగుస్తున్న నకిలీ మద్యం ఉచ్చు

ABN , Publish Date - Oct 31 , 2025 | 04:25 AM

మాజీ మంత్రి జోగి రమేశ్‌ చుట్టూ నకిలీ మద్యం కేసు ఉచ్చు బిగుస్తుందా... త్వరలో సిట్‌ అధికారులు ఆయనను ప్రశ్నించడానికి రంగం సిద్ధం చేశారా..

Fake Liquor Scam: జోగికి బిగుస్తున్న నకిలీ మద్యం ఉచ్చు

  • త్వరలోనే ఆయనను విచారణకు పిలిచే అవకాశం

  • ఇప్పటికే జోగి పేరు వెల్లడించిన ‘అద్దేపల్లి’ సోదరులు

  • సిట్‌ విచారణలో అదే వాంగ్మూలం

విజయవాడ, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి జోగి రమేశ్‌ చుట్టూ నకిలీ మద్యం కేసు ఉచ్చు బిగుస్తుందా...? త్వరలో సిట్‌ అధికారులు ఆయనను ప్రశ్నించడానికి రంగం సిద్ధం చేశారా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. నకిలీ మద్యం తయారీ కేసులో ఇప్పటికే జోగి రమేశ్‌ పేరును ప్రధాన నిందితులు అద్దేపల్లి జనార్దనరావు వెల్లడించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియోను ఆయన విడుదల చేశాడు. ఈ కేసులో అద్దేపల్లి సోదరులు రిమాండ్‌ ఖైదీలుగా ఉన్నారు. జనార్దనరావు నెల్లూరులోని కేంద్ర కారాగారంలో ఉండగా.. ఆయన సోదరుడు జగన్మోహనరావు విజయవాడ జిల్లా జైల్లో ఉన్నాడు. అటు సిట్‌ అధికారులు, ఇటు ఎక్సైజ్‌ ఉన్నతాధికారులు ఈ ఇద్దరినీ వేర్వేరు గదుల్లో వీడియో రికార్డింగ్‌ మధ్య విచారించినప్పుడు వారు జోగి రవేశ్‌ పేరును వెల్లడించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఇబ్రహీంపట్నం, ములకలచెరువులో 2022 నుంచి నకిలీ మద్యం తయారీని మొదలుపెట్టాడు. ఇదంతా నాటి వైసీపీ ప్రభుత్వంలో ఉన్న జోగి రమేశ్‌ ప్రోద్బలంతోనే సాగినట్టు వెల్లడించినట్టు తెలిసింది. వారి నుంచి తీసుకున్న వాంగ్మూలంలోనూ ఈ పేరును ప్రస్తావించారు. దీనికి సంబంధించిన కొన్ని ఆధారాలను అద్దేపల్లి సోదరులు సిట్‌ అధికారులకు ఇచ్చినట్టు సమాచారం. ఇబ్రహీంపట్నంలోని నకిలీ మద్యం తయారీ కేంద్రాన్ని వాస్తవానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూసివేయాలని నిర్ణయించుకున్నట్టు వెల్లడించారు. ఇదే విషయాన్ని జోగి రమేశ్‌ వద్ద జనార్దనరావు ప్రస్తావించగా... అంతా తాను చూసుకుంటానని మాజీ మంత్రి అభయమిచ్చినట్టు వారు వివరించారు.


జోగి ఇచ్చిన భరోసాతోనే బెంగళూరు నుంచి మద్యం తయారీకి అవసరమైన స్పిరిట్‌, కార్మెల్‌, ఇతర రసాయనాల ముడిసరులను భారీగా రప్పించామని అన్నదమ్ములు పూసగుచ్చినట్టు చెప్పారు. ఇబ్రహీంపట్నంలో ఈ నకిలీ మద్యం తయారు చేస్తున్నప్పటి నుంచి జోగి రమేశ్‌తో తమకు సత్సంబంధాలు ఉన్నట్టు స్పష్టం చేసినట్టు తెలిసింది. జోగితో జరిగిన ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఆధారాలను కూడా అందజేశారని విశ్వసనీయంగా తెలిసింది. అద్దేపల్లి సోదరుల నుంచి వాంగ్మూలం తీసుకున్న అధికారులు వాటిని పరిశీలించిన తర్వాత జోగి రమేశ్‌ను విచారణకు పిలవడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతానికి అద్దేపల్లి సోదరుల విచారణ ముగిసింది. శుక్రవారం నుంచి మరో నిందితుడు తిరుమలశెట్టి శ్రీనివాసరావును కస్టడీలోకి తీసుకుని విచారిస్తారు. ఆయన వాంగ్మూలాన్ని బేరీజు వేసుకుని జోగి రమేశ్‌ను విచారణకు పిలుస్తారని తెలుస్తోంది. ఈ విచారణ పూర్తయిన తర్వాత జోగిని ఈ కేసులో నిందితుడిగా చేర్చుతున్నామని అధికారులు కోర్టులో మోమో దాఖలు చేసే సూచనలు కనిపిస్తున్నాయి.


ముగిసిన ‘అద్దేపల్లి’ సోదరుల కస్టడీ

నకలీ మద్యం తయారీ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న అద్దేపల్లి జనార్దనరావు, ఆయన సోదరుడు అద్దేపల్లి జగన్మోహనరావులకు ఎక్సైజ్‌ పోలీసుల కస్టడీ గురువారంతో ముగిసింది. వారిద్దరినీ సిట్‌ అధికారులు విజయవాడలో వారం రోజులపాటు విచారించారు. కస్టడీ ముగియడంతో ప్రభుత్వాస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించిన అనంతరం వారిని ఆరో అదనపు జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో హాజరుపరిచారు. విచారణకు సంబంధించి వీడియోను అధికారులు న్యాయాధికారికి అందజేశారు. అనంతరం జనార్దనరావును ఎస్కార్ట్‌ సిబ్బంది నెల్లూరులోని కేంద్ర కారాగారానికి, జగన్మోహనరావును విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. కాగా, నకిలీ మద్యం తయారీ కేసులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న తిరుమలశెట్టి శ్రీనివాసరావును ఎక్సైజ్‌ పోలీసులు శుక్రవారం కస్టడీకి తీసుకోనున్నారు. ప్రస్తుతం అతడు నెల్లూరులోని కేంద్ర కారాగారంలో ఉన్నాడు. కస్టడీ ముగిసిన అద్దేపల్లి జనార్దనరావును అక్కడి జైలు అధికారులకు అప్పగించి, శ్రీనివాసరావును విజయవాడకు తీసుకురానున్నారు.


నలుగురిపై పీటీ వారెంట్‌

నకిలీ మద్యం తయారీ కేసులో నలుగురు నిందితులపై పీటీ వారెంట్‌కు విజయవాడ ఆరో అదనపు జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు అనుమతించింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న సయ్యద్‌ హజీ, కట్టా శ్రీనివాసరావు, మిథున్‌ దాస్‌, అంతా దాస్‌.. చిత్తూరు జిల్లా జైల్లో రిమాండ్‌ ఖైదీలుగా ఉన్నారు. వారు భవానీపురం ఎక్సైజ్‌ పోలీస్‌లు నమోదు చేసిన కేసులో నిందితులుగా ఉన్నారు. వారిని కోర్టులో హాజరు పరిచేందుకు అనుమతివ్వాలని ఎక్సైజ్‌ పోలీసులు కొద్ది రోజుల క్రితం పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ నెల 22 లోపు వారిని కోర్టులో హాజరుపరచాలని న్యాయాధికారి జి.లెనిన్‌బాబు అనుమతిచ్చినా ఆ గడువులోగా హాజరుపరచలేదు. దీంతో మరో పిటిషన్‌ దాఖలు చేయగా.. నవంబరు 12లోగా కోర్టులో హాజరు పరచాలని న్యాయాధికారి ఆదేశాలిచ్చారు.

Updated Date - Oct 31 , 2025 | 04:29 AM