జోగి రమేశ్ రూ.90 లక్షలకు ముంచాడు!
ABN , Publish Date - May 25 , 2025 | 01:15 AM
మాజీ మంత్రి, పెడన మాజీ ఎమ్మెల్యే జోగి రమేశ్, ఆయన అనుచరులు వైసీపీ హయాంలో అధికారాన్ని అడ్డంపెట్టుకుని చేసిన అక్రమాలు, అవినీతి వ్యవహారాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కృత్తివెన్ను మండలం ఇంతేరు గ్రామంలో ప్రభుత్వ భూములను ప్రైవేటు భూములుగా చూపి.. విక్రయిస్తామని నమ్మించి రూ.90 లక్షలపైన నగదు తీసుకుని తమను ముంచారని పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురానికి చెందిన తమ్ము వీరవెంకటప్రసాద్, ఆయన కుమారుడు కల్యాణ్‌కుమార్ కృత్తివెన్ను పోలీస్ స్టేషన్, మచిలీపట్నం డీఎస్పీ కార్యాలయంలో శనివారం ఫిర్యాదు చేశారు.
- మాజీ మంత్రి జోగి, ఆయన అనుచరులపై పోలీసులకు ఫిర్యాదు
- ప్రభుత్వ భూమి 30 ఎకరాలను ప్రైవేటు భూమిగా చూపి మోసం
- విడతల వారీగా రూ.90 లక్షలపైన వసూలు
- నగదు తిరిగి చెల్లించమంటే ఏడాది కాలంగా దాటవేత
- పెద్దల వద్ద పంచాయితీ.. మాట నిలుపుకోని మాజీ మంత్రి
- పోలీసులను ఆశ్రయించిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం బాధితులు
- ఆధారాలతో ఫిర్యాదు అందజేత
మాజీ మంత్రి, పెడన మాజీ ఎమ్మెల్యే జోగి రమేశ్, ఆయన అనుచరులు వైసీపీ హయాంలో అధికారాన్ని అడ్డంపెట్టుకుని చేసిన అక్రమాలు, అవినీతి వ్యవహారాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కృత్తివెన్ను మండలం ఇంతేరు గ్రామంలో ప్రభుత్వ భూములను ప్రైవేటు భూములుగా చూపి.. విక్రయిస్తామని నమ్మించి రూ.90 లక్షలపైన నగదు తీసుకుని తమను ముంచారని పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురానికి చెందిన తమ్ము వీరవెంకటప్రసాద్, ఆయన కుమారుడు కల్యాణ్‌కుమార్ కృత్తివెన్ను పోలీస్ స్టేషన్, మచిలీపట్నం డీఎస్పీ కార్యాలయంలో శనివారం ఫిర్యాదు చేశారు.
ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం:
కృత్తివెన్ను మండలం ఇంతేరు గ్రామంలో సర్వే నెంబరు 94లోని ప్రభుత్వ భూమిని 2021 నుంచి జోగి రమేశ్, ఆయన ప్రైవేటు పీఏ శ్రీనివాసరెడ్డి, వైసీపీ అప్పటి కృత్తివెన్ను మండల కన్వీనర్ వెంకటరాజు, ఎం.రత్నకుమారి తదితరుల కనుసన్నల్లో విక్రయిస్తూ వచ్చారు. ఇంతేరులో ప్రైవేటు భూమి 30 ఎకరాలు ఉందని, ఎకరం కేవలం రూ.3లక్షలకే విక్రయించేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారని జోగి, ఆయన అనుచరులు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురానికి చెందిన తమ్ము వీరవెంకటప్రసాద్ వద్ద బేరం పెట్టారు. పెడనలోని అప్పటి ఎమ్మెల్యే కార్యాలయానికి తీసుకువెళ్లి ఈ భూమి విక్రయంలో ఏమైౖనా ఇబ్బందులు ఎదురైతే జోగి చూసుకుంటారన్నారు. భూమి కొనుగోలు చేసిన తర్వాత ఇబ్బందులు వస్తే నేను చూసుకుంటానని అప్పటి ఎమ్మెల్యే జోగి తమతో చెప్పారని బాధితులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
నగదు చెల్లింపులు ఇలా..
జోగి రమేశ్ ప్రైవేటు పీఏ శ్రీనివాసరెడ్డి ఖాతాకు 2021, జూలై 5వ తేదీన రూ.2.20లక్షలు ఒకసారి, రూ.10 లక్షలు మరో సారి నరసాపురంలోని వెంకట సత్యదుర్గా సీఫుడ్స్ ఖాతా నుంచి చెల్లింపులు చేశారు. 2021, జూలై 6వ తేదీన ఎం.మహేష్‌బాబు ఖాతాకు రూ.5లక్షలు, 2021, జూలై 7వ తేదీన మళ్లీ అతని ఖాతాకే మరో రూ10లక్షలు, అదే రోజు శ్రీనివాసరెడ్డి ఖాతాకు రూ.8లక్షలు, ఎం.రత్నకుమారి ఖాతాకు రూ.2లక్షలు జమ చేశారు. 2022, మే 5వ తేదీన శ్రీనవాసరెడ్డి ఖాతాకు మరో రూ.3లక్షలను వెంకట సత్యదుర్గా సీఫుడ్స్ ఖాతా నుంచి జమచేశారు. భూమి కొనుగోలు నిమిత్తం రూ.38లక్షలను విడతల వారీగా తమ కంపెనీ ఖాతా నుంచి నగదు జమ చేశామని, అందుకు సంబంధించిన వివరాలను బాధితులు పోలీసులకు అందజేశారు. దీంతోపాటు అప్పటి ఎమ్మెల్యే జోగి రమేశ్ కృత్తివెన్ను పర్యటనకు వచ్చిన సమయంలో రత్నకుమారి, శ్రీనివాసరెడ్డి, వెంకటరాజు ఒక ఇంట్లో ఉండి తమకు కబురు చేయగా, అక్కడకు వెళ్లి 2022, మే 21వ తేదీన రూ.52 లక్షలను వారికి అందజేశామని ఫిర్యాదులో పేర్కొన్నారు. మొత్తంగా ఈ భూమి కొనుగోలు వ్యవహారంలో రూ.90 లక్షలకుపైగా తమ నుంచి వసూలు చేశారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపారు. ఎంతకూ భూమిని తమ పేరుతో రిజిస్ర్టేషన్ చేయకుండా తిప్పుతుండటంతో కృత్తివెన్ను తహసీల్దార్ కార్యాలయంలో విచారణ చేస్తే ఇంతేరులోని సర్వే నెంబరు 94లోని భూమి రెవెన్యూ రికార్డుల్లో ప్రభుత్వ భూమిగా నమోదై ఉందని ఫిర్యాదులో వివరించారు.
పెద్దలు చెప్పినా వినలేదు..
జోగి రమేశ్, ఆయన అనుచరులు చేసిన మోసంపై బాధితులు మత్స్యకార పెద్దల వద్ద పలుమార్లు పంచాయితీలు పెట్టారు. రేపల్లె, యానాం, ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన పెద్దలు, ఎంపీల వద్దకు బాధితులు వెళ్లి మోసపోయిన విధానాన్ని ఏకరువు పెట్టారు. దీంతో మత్స్య సామాజిక వర్గానికి చెందిన పెద్దలు జోగి రమేశ్‌తో మాట్లాడి తమ్ము వీరవెంకటప్రసాద్, అతని కుమారుడు కల్యాణ్‌కుమార్‌లకు ఇవ్వాల్సిన నగదును వెంటనే ఇవ్వాలని పలుమార్లు చెప్పారు. నెల, రెండు నెలల్లో నగదును ఇచ్చేస్తానని వాయిదాలు వేస్తూ వచ్చిన జోగి ఇటీవల కాలంలో తాను ఇప్పట్లో నగదు ఇవ్వలేనని చెప్పినట్లు సమాచారం. దీంతో సగం నగదు ఇప్పుడు ఇచ్చి, కొంత కాలం తర్వాత మిగతా సొమ్ము ఇవ్వాలి అనే ప్రతిపాదన పెద్దలు చేసినా.. తన వద్ద నగదు లేదని, ఇప్పట్లో ఇచ్చే పరిస్థితి లేదని చెప్పడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వివరాలు సేకరిస్తున్నాం : సీహెచ్ రాజా, డీఎస్పీ, మచిలీపట్నం
జోగి రమేశ్, ఆయన అనుచరులు ఇంతేరులో ప్రభుత్వ భూమిని ప్రైవేటు భూమిగా చూపి, విక్రయిస్తామని చెప్పి నగదు వసూలు చేసిన విషయంపై ఫిర్యాదు అందింది. దీనిపై సమగ్ర వివరాలు సేకరించాలని కృత్తివెన్ను ఎస్‌ఐని ఆదేశించాం. విచారణ పూర్తయిన తర్వాత పూర్తిస్థాయిలో వివరాలు వెల్లడిస్తాం.