SIT Inquiry: సిట్ ప్రశ్నలకు జోగి ఉక్కిరిబిక్కిరి
ABN , Publish Date - Nov 28 , 2025 | 05:46 AM
నకిలీ మద్యం తయారీ కేసులో నిందితులుగా ఉన్న వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్, ఆయన సోదరుడు జోగి రాము సిట్ అధికారుల ప్రశ్నలకు ఉక్కిరిబిక్కిరి అయినట్టు తెలుస్తోంది....
అన్నదమ్ములను వేర్వేరు గదుల్లో విచారించిన అధికారులు
కొన్ని ప్రశ్నలకు మౌనం.. మరికొన్నింటికి దాటవేత
కస్టడీ ఒక రోజు పొడిగింపు
విజయవాడ, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): నకిలీ మద్యం తయారీ కేసులో నిందితులుగా ఉన్న వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్, ఆయన సోదరుడు జోగి రాము సిట్ అధికారుల ప్రశ్నలకు ఉక్కిరిబిక్కిరి అయినట్టు తెలుస్తోంది. నాలుగు రోజుల కస్టడీలో భాగంగా వీరిద్దరినీ అధికారులు గురువారం విజయవాడలో విచారించారు. ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు విచారణ కొనసాగింది. ఇద్దరికీ కలిపి 100 ప్రశ్నలు వే యగా, కొన్నింటికి మాత్రమే జోగి రమేశ్ జవాబు చెప్పినట్టు తెలిసింది. మరికొన్ని ప్రశ్నలకు డొంక తిరుగుడుగా సమాధానాలు ఇచ్చాడని, ఇంకొన్ని ప్రశ్నలకు అసలు నోరు విప్పలేదని సమాచారం. ముఖ్యంగా అద్దేపల్లి జనార్దనరావు, అద్దేపల్లి జగన్మోహనరావులకు వీరు చేసిన ఫోన్‌కాల్స్‌పై ఎక్కువ సమయం విచారించారు. ఇప్పటికే జోగి బ్రదర్స్, అద్దేపల్లి సోదరుల కాల్‌డేటాను ఎక్సైజ్ పోలీసులు సేకరించి భద్రపరిచారు. ఆ డేటాను ఎదురుగా పెట్టి రమేశ్‌ను ప్రశ్నించారు. సుమారు మూడు నెలలుగా అద్దేపల్లి సోదరులు, జోగి బ్రదర్స్ మధ్య నిత్యం వందలాది ఫోన్ కాల్స్ ఉన్నట్టు గుర్తించారు. వాటిపై ప్రశ్నించగా ఒకే వీధిలో ఉన్నాం కాబట్టి యోగక్షేమాలు తెలుసుకోవడానికి ఫోన్లు చేసుకున్నామని చెప్పినట్టు సమాచారం. ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం తయారీ వ్యవహారం బయటపడానికి ముందు తాను జోగి రమే్‌షను ఇంటికి వెళ్లి కలిశానని అద్దేపల్లి జనార్దనరావు రెండుసార్లు కస్టడీలో వెల్లడించాడు. దీనిపై ప్రశ్నించగా జోగి బ్రదర్స్ అడ్డంగా బుకాయించినట్టు తెలిసింది. అసలు జనార్దనరావు తమ గుమ్మం మెట్లు ఎక్కలేదని చెప్పినట్టు సమాచారం. ఇబ్రహీంపట్నంలోని ఫెర్రీ వద్ద జోగి రాము తీసుకున్న రూ.9 లక్షలపై ప్రశ్నించగా.. కొన్ని సంవత్సరాలుగా ఫెర్రీ వైపు తాను వెళ్లలేదని రాము చెప్పినట్టు తెలిసింది. విచారణ ముగిసిన అనంతరం జోగి బ్రదర్స్‌కు ప్రభుత్వాస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించి జిల్లా జైలుకు తరలించారు.
కాగా, జోగి బ్రదర్స్ కస్టడీని కోర్టు ఒకరోజు పొడిగించింది. విజయవాడలోని ఆరో అదనపు జ్యుడిషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు గురువారం ఈ ఆదేశాలిచ్చింది. తొలుత బుధవారం నుంచి నాలుగు రోజుల పాటు వీరి కస్టడీకి అనుమతి ఇచ్చింది. అయితే, వారిని నెల్లూరులోని కేంద్ర కారాగారం నుంచి బెజవాడకు తీసుకురావడానికి ఎక్కువ సమయం పట్టింది. తొలిరోజు మొత్తం ప్రయాణానికి సరిపోయిందని, అందువల్ల మరో రోజు కస్టడీ పొడిగించాలని ఎక్సైజ్ పోలీసులు పిటిషన్ దాఖలు చేయడంతో కోర్టు అనుమతించింది. దీంతో కస్టడీ గడువు 30వ తేదీ వరకు పెరిగింది.
సిట్ ప్రశ్నలకు జోగి రమేశ్ ఇచ్చిన సమాధానాలు ఇవీ..
సిట్: ఈ నంబరుకు మీరు ఎప్పుడైనా ఫోన్ చేశారా?
జోగి: ఆ నంబరు ఎవరిదో తెలియదు!
సిట్: అద్దేపల్లి జనార్దనరావుతో మీరు, జగన్మోహనరావుతో మీ తమ్ముడు రాము చాలాసార్లు మాట్లాడారు కదా!
జోగి: యోగక్షేమాలు తెలుసుకోవడానికి మాట్లాడాం.
సిట్: నకిలీ మద్యం తయారీ ద్వారా వచ్చిన ఆదాయంలో అద్దేపల్లి బ్రదర్స్ మీకు డబ్బులు ఇచ్చారా?
జోగి: మా మధ్య ఎలాంటి ఆర్థిక లావాదేవీలూ జరగలేదు.