Share News

Jogi Brothers: బెయిల్‌ ఇప్పించండి

ABN , Publish Date - Nov 05 , 2025 | 05:43 AM

నకిలీ మద్యం తయారీ కేసులో రిమాండ్‌ ఖైదీలుగా ఉన్న మాజీ మంత్రి జోగి రమేశ్‌, ఆయన సోదరుడు రాము తమకు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ మంగళవారం కోర్టును ఆశ్రయించారు.

Jogi Brothers: బెయిల్‌ ఇప్పించండి

  • కోర్టులో జోగి బ్రదర్స్‌ పిటిషన్లు

  • కస్టడీపై విచారణ రేపటికి వాయిదా

విజయవాడ, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): నకిలీ మద్యం తయారీ కేసులో రిమాండ్‌ ఖైదీలుగా ఉన్న మాజీ మంత్రి జోగి రమేశ్‌, ఆయన సోదరుడు రాము తమకు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ మంగళవారం కోర్టును ఆశ్రయించారు. వారి తరఫు న్యాయవాదివిజయవాడ ఆరో అదనపు జ్యుడిషియల్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో ఈ మేరకు పిటిషన్లు దాఖలు చేశారు. నకిలీ మద్యం కేసులో ఈ నెల 2న సిట్‌, ఎక్సైజ్‌ అధికారులు జోగి బ్రదర్స్‌ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కాగా, ఈ కేసులో రిమాండ్‌ ఖైదీలుగా ఉన్న జోగి బ్రదర్స్‌ను కస్టడీకి ఇవ్వాలని ఎక్సైజ్‌ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను ఆరో అదనపు జ్యుడిషియల్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు ఈ నెల ఆరో తేదీకి వాయిదా వేసింది. జోగి రమేశ్‌, రాము నుంచి మరింత సమాచారాం రాబట్టేందుకు వారిని పది రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ ఎక్సైజ్‌ అధికారులు పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై మంగళవారం జరగాల్సిన విచారణను కోర్టు గురువారానికి వాయిదా వేసింది.


జైలులో సదుపాయాల కల్పనపై వాదనలు పూర్తి

నకిలీ మద్యం తయారీ కేసులో నెల్లూరులోని కేంద్ర కారాగారంలో ఉన్న మాజీ మంత్రి జోగి రమేశ్‌ తనకు కుర్చీ, మంచం, ఫ్యాన్‌ వంటి సదుపాయాలు కల్పించాలని కోరుతూ ఆరో అదనపు జ్యుడిషియల్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో మంగళవారం పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై వాదనలు పూర్తవడంతో జైళ్ల శాఖ నిబంధనల ప్రకారం ఎలాంటి సదుపాయాలు కల్పించవచ్చో పరిశీలించాలని కేంద్ర కారాగారం సూపరింటెండెంట్‌ను న్యాయాధికారి లెనిన్‌బాబు ఆదేశించారు. అదేవిధంగా కుటుంబసభ్యులను కలవడానికి తనకు వారంలో మూడు, న్యాయవాదులను కలవడానికి మూడు ములాఖత్‌లు ఇవ్వాలని కోరుతూ కూడా జోగి రమేశ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపైనా పరిశీలించాలని జైలు సూపరింటెండెంట్‌ను న్యాయాధికారి ఆదేశించారు.


ఎక్సైజ్‌ కస్టడీకి ఏడుగురు నిందితులు

నకిలీ మద్యం తయారీ కేసులో రిమాండ్‌ ఖైదీలుగా ఉన్న ఏడుగురిని ఎక్సైజ్‌ కస్టడీకి ఇస్తూ విజయవాడ ఆరో అదనపు జ్యుడిషియల్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు న్యాయాధికారి లెనిన్‌బాబు మంగళవారం ఉత్తర్వులు ఇచ్చారు. నకిరికంటి రవి, బాదల్‌ దాస్‌, ప్రదీప్‌ దాస్‌, డి.శ్రీనివాసరెడ్డి, అంగులూరి వెంకట కల్యాణ్‌, తాండ్ర రమేశ్‌ బాబు, షేక్‌ అల్లాబక్షు, చెక్కా సతీశ్‌కుమార్‌లను పది రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని ఎక్సైజ్‌ అధికారులు పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై సతీశ్‌కుమార్‌ న్యాయవాది తప్ప మిగతా నిందితుల న్యాయవాదుల.. వాదనలు పూర్తవడంతో న్యాయాధికారి లెనిన్‌బాబు.. ఏడుగురిని ఈ నెల 7 నుంచి 11వ తేదీ వరకు కస్టడీకి తీసుకుని విచారించడానికి అనుమతిచ్చారు. సతీశ్‌కుమార్‌ పిటిషన్‌ను ఈ నెల 11వ తేదీకి వాయిదా వేశారు.

Updated Date - Nov 05 , 2025 | 06:39 AM