Fake Liquor Scam: తంబళ్లపల్లె కోర్టుకు జోగి సోదరులు
ABN , Publish Date - Dec 03 , 2025 | 06:00 AM
ములకలచెరువు నకిలీ మద్యం కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్, ఆయన సోదరుడు రామును మంగళవారం తంబళ్లపల్లె కోర్టులో హాజరు పరిచారు.
నకిలీ మద్యం కేసులో రిమాండ్..నెల్లూరుకు తరలింపు
రాయచోటి/ములకలచెరువు, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): ములకలచెరువు నకిలీ మద్యం కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్, ఆయన సోదరుడు రామును మంగళవారం తంబళ్లపల్లె కోర్టులో హాజరు పరిచారు. ఈ కేసులో జోగి రమేశ్‌ను ఏ-32గా, జోగి రామును ఏ-33గా చేరుస్తూ ఇటీవల ఎక్సైజ్ పోలీసులు తంబళ్లపల్లె జూనియర్ సివిల్ కోర్టులో మెమో దాఖలు చేశారు. పీటీ వారెంట్‌కు కోర్టు అనుమతి ఇచ్చింది. ఇప్పటికే ఇబ్రహీంపట్నం నకిలీమద్యం వ్యవహారంలో అరెస్టయ్యి నెల్లూరు సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న జోగి బ్రదర్స్‌ను పీటీ వారెంట్‌పై మంగళవారం ప్రత్యేక భద్రత మధ్య తంబళ్లపల్లె కోర్టులో హాజరు పరిచారు. వీరిద్దరికీ న్యాయాధికారి ఉమర్ ఫరూక్ ఈనెల 16 వరకు రిమాండ్ విధించారు. దీంతో జోగి సోదరులను తిరిగి నెల్లూరు జైలుకు తీసుకెళ్లారు. జోగి రమేశ్‌ను కోర్టు వద్ద కలిసేందుకు తంబళ్లపల్లె వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, మదనపల్లె నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జి నిస్సార్ అహమ్మద్ తదితరులు వచ్చారు. రిమాండ్‌లో ఉన్న నిందితులతో మాట్లాడకూడదని పోలీసులు నచ్చజెప్పినా వినకుండా కోర్టునుంచి బయటకు వెళుతున్న రమేశ్‌ను ఎమ్మెల్యే పలకరించారు. జోగి సోదరుల వాహనంపై కార్యకర్తలు పూలు చల్లుతూ హంగామా సృష్టించారు.