Jogi Brothers: తెలీదు.. గుర్తులేదు..మరిచిపోయా
ABN , Publish Date - Dec 01 , 2025 | 05:10 AM
గుర్తులేదు, తెలీదు, మరిచిపోయా.. ఎక్సైజ్ పోలీసుల కస్టడీలో ఉన్న వైసీపీ నేత, మాజీమంత్రి జోగి రమేశ్ బ్రదర్స్ అధికారులు అడిగిన ప్రశ్నలకు చెప్పిన సమాధానాలు ఇవి...
జోగి బద్రర్స్ సమాధానాలివి
4 రోజుల కస్టడీలో 250 ప్రశ్నలడిగిన అధికారులు
అన్నీ డొంక తిరుగుడు జవాబులే
విజయవాడ, నవంబరు 30(ఆంధ్రజ్యోతి): ‘గుర్తులేదు, తెలీదు, మరిచిపోయా..’ ఎక్సైజ్ పోలీసుల కస్టడీలో ఉన్న వైసీపీ నేత, మాజీమంత్రి జోగి రమేశ్ బ్రదర్స్ అధికారులు అడిగిన ప్రశ్నలకు చెప్పిన సమాధానాలు ఇవి!. నకిలీ మద్యం తయారీ కేసులో నిందితులుగా ఉన్న జోగి రమేశ్, ఆయన సోదరుడు జోగి రాము నాలుగు రోజుల కస్టడీ ఆదివారంతో ముగిసింది. వారిని విజయవాడ గురునానక్ కాలనీలోని ఎక్సైజ్ తూర్పు పోలీస్ స్టేషన్‌లో విచారించారు. జోగి రమేశ్‌ను పైఅంతస్తులోను, రామును కింది అంతస్తులోను ప్రశ్నించారు. వారిని నాలుగు రోజుల్లో మొత్తం 250 ప్రశ్నలు అడిగారు. అయితే, ప్రతి ప్రశ్నకూ దాటవేత ధోరణిలోనే సమాధానాలిచ్చారు. నకిలీ మద్యం సూత్రధారి అద్దేపల్లి జనార్దనరావు లక్షలాది రూపాయలను ఇచ్చినట్టుగా చెబుతున్నారని ప్రశ్నించగా, ఆయన తనకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని రమేశ్ చెప్పినట్టు సమాచారం. జనార్దనరావుతో ఎలాంటి ఆర్థిక లావాదేవీలు నిర్వహించలేదని వాదించినట్టు తెలిసింది. ఆయనతో కలిసి మద్యం వ్యాపారం చేశారు కదా.. అని ప్రశ్నించగా దానికి ఎలాంటి సమాధానం చెప్పలేదు. అధికారులు మొత్తం 250 ప్రశ్నలు వేస్తే వాటిలో పదుల సంఖ్యలో ప్రశ్నలకే జవాబులు ఇచ్చినట్టు తెలిసింది.
ఫోన్లు తెరిచిన బ్రదర్స్
కస్టడీలో ఉన్న జోగి బ్రదర్స్ తమ ఫోన్లను అన్‌లాక్ చేశారు. అరెస్టు చేసినప్పుడు జోగి రమేశ్, ఆయన సోదరుడు రాము ఫోన్లను ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం, సాంకేతిక విశ్లేషణ కోసం ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌కు పంపారు. ఎఫ్‌ఎ్‌సఎల్ సిబ్బంది ఆ ఫోన్లను స్టేషన్‌కు తెచ్చారు. ఆ ఫోన్ల పాస్‌వర్డ్‌లు చెప్పాలని అధికారులు అడగ్గా.. తామే తెరుస్తామని ఫోన్లు తీసుకుని అన్‌లాక్ చేశారు. ఆఫ్రికా వెళ్లడానికి ముందు తాను జోగి రమేశ్‌ను ఇంటి వద్ద కలిశానని ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దనరావు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. దీనికి సంబంధించి రమేశ్ ఇంటి నుంచి డీవీఆర్‌ను స్వాధీనం చేసుకుని ఫుటేజీని పరిశీలించాలని భావించారు. దీనికి పాస్‌వర్డ్‌లు ఉండటంతో తెరుచుకోలేదు. రమేశ్ తన ఇంటి సీసీ కెమెరాలను సెల్‌ఫోన్‌కు అనుసంధానం చేసుకున్నారు. ఫోన్లను అన్‌లాక్ చేశాక దానిలో నిక్షిప్తమైన ఫుటేజీలను పరిశీలించారు. జోగి రమేశ్ ఇంటి ముందు అద్దేపల్లి అటూఇటూ తిరగడం ఫుటేజీల్లో కనిపించినట్టు తెలిసింది.
విజయవాడకు మార్చండి
నెల్లూరులోని కేంద్ర కారాగారంలో ఉంటున్న తనను విజయవాడలోని జిల్లా జైలుకు తరలించాలని జోగి రమేశ్ న్యాయాధికారి జి. లెనిన్‌బాబుకు విన్నవించుకున్నారు. దీంతో విజయవాడలో ఖాళీ ఉందో లేదో తెలుసుకోమని సిబ్బందిని ఆదేశించారు. జైలు అధికారులు ఇక్కడ ఖాళీ లేదని చెప్పడంతో అదే విషయాన్ని న్యాయాధికారి తెలియజేశారు. జైలులో సదుపాయాల గురించి ప్రశ్నించగా, బాగానే ఉన్నాయని జోగి బ్రదర్స్ సమాధానం ఇచ్చారు. కస్టడీలో పోలీసులు ఇబ్బంది పెట్టారా.. అని ప్రశ్నించగా అటువంటిదేమీ లేదని చెప్పారు. అనంతరం తొమ్మిదో తేదీ వరకు రిమాండ్‌ను పొడిగించారు. దీంతో వారిని నెల్లూరు జైలుకు తరలించారు.