Buddha Venkanna: జోగి, జగన్ కలిస్తే కల్తీ మద్యం తయారు
ABN , Publish Date - Oct 17 , 2025 | 05:23 AM
జోగి.. జోగి.. రాసుకుంటే బూడిద రాలినట్టు జోగి, జగన్ కలిస్తే కల్తీ మద్యం తయారైందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న పేర్కొన్నారు.
రమేశ్‌ను అరెస్టు చేస్తే.. పెద్దల పేర్లు బయటికొస్తాయ్: బుద్దా వెంకన్న
విజయవాడ(వన్‌టౌన్), అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): జోగి.. జోగి.. రాసుకుంటే బూడిద రాలినట్టు జోగి, జగన్ కలిస్తే కల్తీ మద్యం తయారైందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న పేర్కొన్నారు. విజయవాడలోని తన కార్యాలయంలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నకిలీ మద్యం తయారీ కేసులో జోగి రమేశ్‌ది కీలకపాత్ర అన్నారు. చంద్రబాబు ప్రమాణం చేయాలని మాట్లాడటం సిగ్గుచేటన్నారు. జగన్, భారతి.. వేంకటేశ్వరస్వామి వద్ద ప్రమాణం చేస్తారా? అని ప్రశ్నించారు. జోగి రమేశ్ ఏ తప్పూ చేయకపోతే సిట్ అధికారుల ముందుకెళ్లాలని సూచించారు. ఉమ్మడి కృష్ణాజిల్లాలో జగన్ అరడజను దొంగలు.. కొడాలి నాని, పేర్ని నాని, దేవినేని అవినాశ్, వెలంపల్లి శ్రీనివాసరావు, వల్లభనేని వంశీ అని పేర్కొన్నారు. నకిలీ మద్యం కేసులో జోగి రమేశ్ వెనుక ఇంకా పెద్దలు ఉన్నారని, జోగిని అరెస్టు చేసి విచారిస్తే వారి పేర్లు కూడా బయటకు వస్తాయని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నకిలీ మద్యాన్ని బయటకు తెచ్చిందని, ఇద్దరు టీడీపీ నాయకుల పేర్లు బయటపడిన వెంటనే తమ నాయకుడు వారిని సస్పెండ్ చేశారని, మరి జగన్.. జోగి రమేశ్‌ను ఎందుకు సస్పెండ్ చేయలేదని ప్రశ్నించారు. వైసీపీ నాయకులు రంకెలు వేయటం మాని, పోలీసులకు లొంగిపోయి విచారణకు సహకరించాలని హితవు పలికారు.