Job Fraud Scam: ఉద్యోగాల పేరుతో బురిడీ
ABN , Publish Date - Dec 03 , 2025 | 05:58 AM
మంచి ఉద్యోగం.. ఆకర్షణీయమైన జీతం.. అంటూ నిరుద్యోగ యువతకు వల విసిరారు. ట్రాప్‌లో పడిన వారి పేరు మీదే బ్యాంకు ఖాతాలు తెరిచి..
కర్ణాటక, ఏపీలకు చెందిన 8 మంది అరెస్టు
పిఠాపురం, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): మంచి ఉద్యోగం.. ఆకర్షణీయమైన జీతం.. అంటూ నిరుద్యోగ యువతకు వల విసిరారు. ట్రాప్‌లో పడిన వారి పేరు మీదే బ్యాంకు ఖాతాలు తెరిచి.. సైబర్ నేరాల ద్వారా వచ్చిన సొమ్ముని ఆ ఖాతాల్లో వేయించుకున్నారు. ఇలా రూ.75 లక్షలు కాజేశారు. మోసపోయినట్టు గుర్తించిన నిరుద్యోగ యువత పిఠాపురం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఏపీ, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన 8 మందిని అరెస్టు చేశారు. కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణ పోలీసుస్టేషన్‌లో కాకినాడ ఏఎస్పీ దేవరాజ్ మనీష్ పాటిల్ వివరాలను వెల్లడించారు. కాకినాడ రూరల్ మండలానికి చెందిన నాళం గంగాభవానీ గత నెల 24న కోటగుమ్మం సెంటర్లో ‘ఉద్యోగ అవకాశాలు.. నెలకు రూ.15వేలు-రూ.35వేలు జీతం’ అనే ప్రకటన చూసి అందులోని ఫోన్ నంబర్లకు కాల్ చేసింది. వాళ్లు.. ప్రాసెసింగ్ ఫీజు, ల్యాప్‌టాప్ కోసం రూ.24 కట్టాల్సి ఉంటుందని చెప్పగా.. వారికి ఆ మొత్తం ఫోన్‌పే చేసింది. ఆ తర్వాత ఆమెకు అనుమానం వచ్చి పిఠాపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాను కూడా ఇలాగే రూ.13 వేలు చెల్లించి మోసపోయానని పేర్కొంటూ కోటిపల్లి సాయి, ఆమె స్నేహితులు ముగ్గురు... పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్పీ బిందుమాధవ్ ఆదేశాల మేరకు పోలీసులు దర్యాప్తు చేశారు. ‘ట్రాంజ్ ఇండియా కార్పొరేట్ నెట్‌వర్క్ ప్రైవేట్ లిమిటెడ్’ పేరిట తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కార్యాలయం ఏర్పాటు చేసిన కేటుగాళ్లు... డేటా ఎంట్రీ, టెలీకాలింగ్ ఉద్యోగాల పేరుతో పలువురిని మోసం చేసినట్టు పోలీసులు విచారణలో గుర్తించారు.