నేడే జయకేతనం
ABN , Publish Date - Mar 14 , 2025 | 12:17 AM
జనసేన.. 12 ఏళ్ల రాజకీయ ప్రస్థానం. 2014 మార్చి 14వ తేదీన హైదరాబాద్‌లో పవన్ కల్యాణ్ పార్టీని స్థాపించారు. అప్పటి నుంచి జనం మధ్యే ఉండాలన్నదే ఆ పార్టీ ఆశయం.

జనసేన సుదీర్ఘ రాజకీయ ప్రయాణం.. పరాజయం ఎదురైనా మడమ తిప్పని ఆశయం..
ఇప్పుడు విజయాల మూట కట్టుకుని ఉత్సాహం.. పిఠాపురంలో ఆవిర్భావ దినోత్సవ సభకు పయనం
(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి):
జనసేన.. 12 ఏళ్ల రాజకీయ ప్రస్థానం. 2014 మార్చి 14వ తేదీన హైదరాబాద్‌లో పవన్ కల్యాణ్ పార్టీని స్థాపించారు. అప్పటి నుంచి జనం మధ్యే ఉండాలన్నదే ఆ పార్టీ ఆశయం. దీనికి అణుగుణంగానే అడుగులు వేసింది, ఎత్తుగడలు వేసింది, పక్కా కార్యాచరణతో ముందుకురికిం ది. అవినీతికి తావు లేకుండా వ్యవస్థలు ఉండా లన్న నినాదంతో గొంతెత్తింది. ఇన్నాళ్లు ఆ పార్టీ అనేక రాజకీయ ఒడిదుడు కులు ఎదుర్కొంది. పరాజయాలను మూటకట్టుకుంది. కాని ఇప్పుడు అదేచోట విజయాలు అందుకుని జన ధరహాసం చేస్తోంది. నేడు వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం..
ఉమ్మడి పశ్చిమ గోదావరిలో జనసేన ఆవిర్భావం నాటి నుంచి ఇప్పటి వరకు రాజకీయంగా కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నా ఎక్కడా పార్టీ కేడర్ తగ్గనేలేదు. మిగతా పార్టీల కంటే భిన్నంగా తమదైన శైలిలో జనం మధ్యనే ఉన్నారు. గత ఐదేళ్లలో జగన్ పార్టీ వ్యవహార శైలిని పవన్‌కల్యాణ్ నిలదీశారు. అదే ఉత్సాహంతో కిందిస్థాయి కేడర్ సైతం ఎక్కడికక్కడ నియోజకవర్గాల్లో జగన్ పార్టీకి ఎదురొడ్డి నిలిచింది. వీరిలో కొంతమందిపై పోలీసులు కేసులు బనాయించినా ఎక్కడ వెనక్కి తగ్గలేదు.
పరాజయం ఎదురైనా..
2019 ఎన్నికల్లో పార్టీ అధ్యక్షుడు పవన్ భీమవరంలో ఓటమి చెందారు. ఇది అనూహ్య పరిణామం. అయినా ఓటమి నుంచే మరిన్ని గుణపాఠాలు నేర్చుకున్నారు. ఉమ్మడి పశ్చిమలో పార్టీ నాయకత్వం పటిష్టంగా మారేలా ప్రత్యేక కార్యాచరణకు దిగారు. క్షేత్రస్థాయిలో ఆటంకాలున్నా వెనుతి రిగి చూడలేదు. పార్టీపై సామాజిక ముద్రవేసి కొందరు జన సేన ప్రతిష్టను దెబ్బ తీయాలని చూసినా కంగారు పడలేదు. పార్టీ ఆదేశమే శిరోధార్యంగా అనేక కార్యక్రమాలు చేయగలి గారు. జనాన్ని కూడగట్టుకోగలిగారు. ఇదే తరుణంలో నియో జకవర్గాల వారీగా తమ పార్టీ స్థాయి ఏమిటో, ఎదగాల్సిన తీరు ఏమిటో క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. ఒక దశలో జనసేన ఏ వైపు కదులుతుందో అన్న సందిగ్ధత వెన్నాడినా 2024 ఎన్నికల్లో చంద్రబాబుతో కలిసి ప్రయాణించాలన్న నిర్ణయం ఆ పార్టీ రూపు రేఖలనే మార్చేసింది. 2019 నాటి పరాజయాన్ని అలవోకగా అధిగమించడానికి దారితీసింది.
ఫలించిన పక్కా వ్యూహం
తమ సొంత జిల్లా పశ్చిమలో ఏదో రూపంలో బలంగా ఎదగాలని ఒకప్పటి చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం ఆశిం చినా అప్పట్లో నెరవేరలేదు. జనసేనాని పవన్‌కల్యాణ్ నేతృ త్వాన్న అంచలంచెలుగా పన్నెండేళ్ల వ్యవధిలోనే ఏకంగా ఆరు అసెంబ్లీ స్థానాల్లో పార్టీ ఎమ్మెల్యేలను గెలిపించుకో గలి గారు. తమకు బాగా పట్టున్న ఉభయ గోదావరి జిల్లాల్లో తగినన్ని సీట్లు కావాల్సిందేనని పవన్ 2024లో పట్టుబట్టడం దానికి తెలుగుదేశం నాయకత్వం అంగీకరించడం, బీజేపీ అండగా నిలవడంతో గోదావరి రాజకీయాల్లో దూసుకు పోయారు. ఉమ్మడి పశ్చిమలో నరసాపురం, భీమవరం, నిడ దవోలు, తాడేపల్లిగూడెం, పోలవరం, ఉంగుటూరు నియోజక వర్గాల్లో పార్టీ పక్షాన పోటీ చేసిన అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుపొందారు. ఇప్పుడు శాసనసభలో పార్టీ పక్షాన ఎమ్మెల్యే లు బొలిశెట్టి శ్రీనివాస్, నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు, పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు గళం విన్పిస్తున్నారు. పర్యాటక మంత్రిగా నిడదవోలు నుంచి కందుల దుర్గేశ్ కీలకంగా మారారు. భీమవరం నుంచి గెలిచిన అంజిబాబు అసెంబ్లీ ప్రజాపద్దుల కమిటీ చైర్మన్‌గా మరో కీలక బాధ్యతను అందుకోగలిగారు. వీరితోపాటు ఆర్టీసీ రీజనల్ చైర్మన్‌గా రెడ్డి అప్పలనాయుడు, క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్‌గా కనకరాజు సూరి సైతం జనసేన పక్షానే పూర్తిగా ఎదిగారు. పశ్చిమ రాజకీయాల్లో జనసేన తగు ప్రాధాన్యత సంతరించుకోగలిగింది. వాస్తవానికి కూటమి ప్రభుత్వంలో జనసేన వ్యవహరిస్తున్న తీరు ఇప్పటికే ఆ పార్టీకి ప్లస్ మార్కుగానే మారింది. గోదావరి జిల్లాల్లో ఈ ఏడాదే అత్య ధికంగా సభ్యత్వ నమోదులో లభించడం ఆ పార్టీ క్షేత్ర స్థాయిలో పటిష్టంగా మారిందన్న సంకేతాలు ఇచ్చింది. పన్నెండేళ్ల ప్రజా పోరాటాలకు అనుగుణంగానే జనసేన జనం మధ్యలో నిలిచింది.
అంతా చిత్రాడ వైపే..
జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని నేడు కాకినాడ జిల్లాలోని పవన్ సొంత నియోజకవర్గమైన పిఠాపురంలోని చిత్రాడ వద్ద ఘనంగా నిర్వహించేందుకు ఆ పార్టీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే పార్టీ సీనియర్లంతా నియోజకవర్గాల్లో పర్య టించారు. పార్టీ సీనియర్ నేత, మంత్రి నాదెండ్ల మనో హర్ పార్టీ కేడర్‌కు దిశ నిర్దేశం చేశారు. జనసేన జిల్లా అధ్యక్షుడు చినబాబు నియోజకవర్గాల వారీగా ఏ స్థాయిలో కేడర్ తరలి వెళ్తున్నది ఆరా తీశారు. మొత్తం మీద పార్టీ ఆవిర్భావోత్సవం నేతలు, కేడర్‌లో సరికొత్త జోష్ నింపింది.
పిఠాపురం సభ కోసం..
కాకినాడ జిల్లా పిఠాపురం మండలం చిత్రాడలో శుక్రవారం జరగనున్న జనసేన ఆవిర్భావ సభ జయ కేతనంకు భారీ ఏర్పాట్లు చేశారు.
రెండు తెలుగు రాష్ట్రాల నుంచి లక్షల మంది హాజరుకానున్నారు.
మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు సభ నిర్వహిస్తారు.
అధినేత పవన్ అమరావతి నుంచి మధ్యాహ్నం 3.45 గంటలకు సభా ప్రాంగణం సమీపంలోని హెలీప్యాడ్‌లో దిగుతారు.
జనసేన ఆవిర్భావం, నేపథ్యం, పోరాటాలు, సిద్ధాంతాలు.. విజయపథం వరకు సాగిన ప్రస్థానాన్ని పవన్ వివరిస్తారు.
24 ఎకరాల విస్తీర్ణంలో సభ నిర్వహిస్తున్నారు. 14 ఎకరాల్లో ఏడు గ్యాలరీలు ఏర్పాటు చేసి రెండు లక్షల మంది కూర్చొనేందుకు ఏర్పాట్లు చేశారు.
సభావేదిక మొదటి వరసలో డిప్యూటీ సీఎం పవన్, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆశీనులవుతారు.
మిగిలిన రెండు వరుసల్లో 250 మంది ఆహ్వానితులు కూర్చుంటారు.
సభా ప్రాంగణంలో 20కి పైగా ఎల్‌ఈడీ స్ర్కీన్లు ఏర్పాటు చేసి, 75 సీసీ కెమేరాలు, 15 డ్రోన్లతో నిఘా పెట్టారు.
నాలుగు కిలోమీటర్ల మేర ఆడియో వినబడేలా మైక్‌లు అమర్చారు.
బందోబస్తుకు ఏలూరు రేంజ్ పరిధిలోని స్టేషన్ల నుంచి 1700 మంది పోలీసులను రప్పించారు.
సభకు వచ్చి, వెళ్లే ప్రధాన రహదారుల వెంబడి మధ్యాహ్నం, రాత్రి భోజనాలు ఏర్పాటు చేశారు.
సభా ప్రాంగణంలో తాగు నీరు, మజ్జిగ, ఓఆర్ ఎస్ ప్యాకెట్లు, బిస్కెట్లు అందించనున్నారు.
ఐదు వైద్య బృందాలను 20కిపైగా అంబులెన్స్‌లు అందుబాటులో ఉంచారు.
సభకు తరలివచ్చే వాహనాల కోసం కాకినాడ వైపు ఐదు, పిఠాపురం వైపు నాలుగు పార్కింగ్ ప్లేసులు గుర్తించారు.
కాకినాడ–కత్తిపూడి మధ్య ఆవిర్భావ సభకు వచ్చే వాహనాలు తప్ప మిగిలిన వాటిని దారి మళ్లిస్తు న్నారు. ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి వరకూ ఆర్టీసీ బస్సులను నిలిపివేశారు.
పార్టీ శ్రేణులకు పవన్ దిశా నిర్దేశం
జనసేన పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ పిఠాపురంలో జరిగే అవిర్భావ సభ ద్వారా దిశా నిర్దేశం చేస్తారు. ఇప్పటి వరకు ఎలా పోరాడాలో చెప్పారు. కూటమి ప్రభుత్వంలో భాగస్వామి అయ్యి ప్రజలకు ఎలా సేవ చేయాలో చూపించి మన్ననలు పొందారు. రానున్న రోజుల్లో పార్టీ శ్రేణులు ఎలా పనిచేయాలో ఈ సభ ద్వారా దిశానిర్దేశం చేస్తారు.శుక్రవారం పిఠాపురంలో జరిగే అవిర్భావ సభకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి దాదాపు 50 వేల మంది తరలి వెళ్లనున్నారు.
– కొటికలపూడి గోవిందరావు(చినబాబు), జనసేన ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు