Annamayya District Politics: ఆయన పెద్దిరెడ్డి మనిషే
ABN , Publish Date - Oct 07 , 2025 | 05:26 AM
ఆయన మనసంతా వైసీపీయే ఆయన సంబంధాలూ వైసీపీ నేతలతోనే కానీ... వ్యూహాత్మకంగా టీడీపీలో చేరారు అనూహ్యంగా టికెట్ తెచ్చుకున్నారు ఆ తర్వాత...
జయచంద్రా రెడ్డి వైసీపీ కోవర్టే
ఎన్నికల ముందు టీడీపీలో చేరిక
అనూహ్యంగా తంబళ్లపల్లి టికెట్
ద్వారకానాథ్ రెడ్డి గెలుపునకు సహకారం
(రాయచోటి - ఆంధ్రజ్యోతి)
ఆయన మనసంతా వైసీపీయే! ఆయన సంబంధాలూ వైసీపీ నేతలతోనే! కానీ... వ్యూహాత్మకంగా టీడీపీలో చేరారు! అనూహ్యంగా టికెట్ తెచ్చుకున్నారు! ఆ తర్వాత... వైసీపీ అభ్యర్థి గెలుపు కోసం పరోక్షంగా సహకరించారు! ఆయనే... జయచంద్రా రెడ్డి! నకిలీ మద్యం కేసులో ఆయన పాత్ర ఇప్పుడు కీలకంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా కూటమి సర్కారు హవా కనిపించినా... అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లిలో వైసీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి ద్వారకానాథ రెడ్డి గెలుపొందారు. ఆయన... మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డికి సోదరుడనే విషయం తెలిసిందే! పెద్దిరెడ్డి కుటుంబానికి జయచంద్రా రెడ్డి ఆది నుంచీ వీర విధేయుడు కావడం గమనార్హం. ఆయనను టీడీపీలో చేర్చుకోవడమే ఒక తప్పయితే... అసెంబ్లీ టికెట్ ఇవ్వడం మరో తప్పని అప్పుడే పార్టీ వర్గాలు వాపోయాయి! జయచంద్రా రెడ్డి వైసీపీ కోవర్టు అని... ఆయన కారణంగా తెలుగుదేశం పార్టీకి నకిలీ మకిలీ అంటుకుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
తొలి నుంచీ పెద్దిరెడ్డితోనే...
మొలకలచెరువు మండలం కదిరినాథునికోటకు చెందిన జయచంద్రారెడ్డి ఆది నుంచీ మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబానికి విధేయుడిగా ఉన్నారు. పెద్దిరెడ్డి కుమారుడు, రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డికి, జయచంద్రారెడ్డికి కలిపి ఉగాండా దేశంలో లిక్కర్ వ్యాపారం ఉన్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మొలకలచెరువులో జయచంద్రారెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా జరగడం విశేషం. అదే మొలకలచెరువులో జయచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఒక క్రికెట్ టోర్నీ నిర్వహించి... ఆ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ద్వారకానాథరెడ్డిని అప్పట్లో ఆహ్వానించారు. అలాంటి జయచంద్రారెడ్డి... మరో ఆరేడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలనగా, 2023 డిసెంబరులో అనూహ్యంగా టీడీపీలో చేరారు. చంద్రబాబు సమక్షంలోనే టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. నియోజకవర్గంలో మురుసుకాపులు ఎక్కువగా ఉన్నారని.. ఆయనకు టికెట్ ఇస్తే గెలుస్తారంటూ.. ఆయన సామాజికవర్గ నేతలు చంద్రబాబును నమ్మించారు. ఫలితంగా 2024 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థుల మొదటి జాబితాలోనే జయచంద్రారెడ్డి పేరు ప్రకటించారు. అయితే ఆయన పెద్దిరెడ్డి కుటుంబ కోవర్టు అని టీడీపీ శ్రేణుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. పెద్దిరెడ్డి కుటుంబసభ్యులతో వివిధ సందర్భాల్లో జయచంద్రారెడ్డి ఉన్న ఫొటోలు బయటపడి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. దీంతో ఆయనకు బీఫారం ఇవ్వకుండా టీడీపీ అధిష్ఠానం పెండింగ్ పెట్టింది. నామినేషన్ పత్రాల పరిశీలన సందర్భంగా బీఫాం ఇచ్చేందుకు గడువు ముగుస్తుండగా చివరి క్షణంలో అందజేశారు.
వైసీపీ అభ్యర్థికి సహకారం...
టికెట్ వచ్చి, నామినేషన్ల దాఖలు.. పరిశీలన అనంతరం జయచంద్రా రెడ్డి ఒక్కసారిగా ఎన్నికల ప్రచారంలో స్పీడ్ తగ్గించారు. దాని వెనుక పెద్దిరెడ్డి కుటుంబం ఆదేశాలు ఉన్నాయని ఇప్పటికీ టీడీపీ శ్రేణులు ఆరోపిస్తుంటాయి. పోలింగ్ రోజు పలు మండలాల్లో ఏజెంట్లను కూడా పెట్టకుండా వైసీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి విజయానికి జయచంద్రారెడ్డి సహకరించారనే ఆరోపణలున్నాయి. ఎన్నికలు ముగిసి కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక.. వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన వారికే ఈయన అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. టీడీపీ జెండా మోసి, పెద్దిరెడ్డి కుటుంబ అరాచకాలకు బలైన టీడీపీ నాయకులు, కార్యకర్తలు 70 శాతం వరకు జయచంద్రారెడ్డికి దూరంగా ఉండిపోయారు. అంగళ్లులో చంద్రబాబుపై దాడి జరిగిన సందర్భంగా వైసీపీ బనాయించిన అక్రమ కేసుల్లో జైళ్లకు వెళ్లి వచ్చి ఊళ్లు వదిలి వెళ్లిన వారు కూడా ఆయనకు దూరంగా ఉంటున్నారు.
ఆయన వర్గీయులదే హవా..
నియోజకవర్గవ్యాప్తంగా అన్ని రకాల వ్యవహారాల్లోనూ జయచంద్రారెడ్డి వర్గీయులదే హవా. కాంట్రాక్టు పనులు సైతం టీడీపీతో సంబంధం లేని వ్యక్తులకే ఇస్తున్నట్లు ఆరోపణలున్నాయి. బినామీల పేర్లతో మద్యం దుకాణాలు దక్కించుకోవడం, బెల్టు షాపుల నిర్వహణ మొత్తం ఆయన వర్గీయుల చేతుల్లోనే నడుస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. బయటి వ్యక్తులు ఎవరైనా నియోజకవర్గంలో కాంట్రాక్టు పనులు చేయాలంటే ముఖ్యమైన వ్యక్తులకు మామూళ్లు ఇచ్చుకోవాల్సిందేననే ఆరోపణలు ఉన్నాయి. అంగళ్లులో ఆయన వర్గీయులు భూదందాలకు పాల్పడుతున్నట్లు సమాచారం. ప్రభుత్వ కార్యాలయాల్లో వారు అధికారులను బెదిరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. తంబళ్లపల్లె పరిధిలో జరిగిన అక్రమాలు, అరాచకాలపై ఇప్పటివరకు ఆయన ఒక్కసారి కూడా నోరు విప్పిన పాపాన పోలేదని టీడీపీ కార్యకర్తలు వాపోతున్నారు.