Japanese Team: అమరావతిలో పర్యటించిన జపాన్ బృందం
ABN , Publish Date - Sep 03 , 2025 | 06:03 AM
ప్రజా రాజధాని అమరావతిలో జపాన్‌కు చెందిన యూనివర్సిటీ ఆఫ్ టోక్యో బృందం మంగళవారం పర్యటించింది. అమరావతిలో యూనివర్సిటీ ఏర్పాటుకు అనుకూలమైన భూముల గురించి...
టోక్యో వర్సిటీ ఏర్పాటుకు భూముల పరిశీలన
తుళ్లూరు, సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): ప్రజా రాజధాని అమరావతిలో జపాన్‌కు చెందిన యూనివర్సిటీ ఆఫ్ టోక్యో బృందం మంగళవారం పర్యటించింది. అమరావతిలో యూనివర్సిటీ ఏర్పాటుకు అనుకూలమైన భూముల గురించి సీఆర్‌డీఏ అడిషనల్ కమిషనర్ జి.సూర్యసాయి ప్రవీణ్ చంద్ వారికి డ్రోన్, మ్యాప్‌ల సాయంతో వివరించారు. పూర్తి పర్యావరణహితంగా, ప్రణాళికాబద్ధంగా ప్రపంచస్థాయి సదుపాయాలతో నిర్మిస్తున్న రాజధాని గురించి వివరించారు. శాఖమూరు తదితర ప్రాంతాల్లో భూములను జపాన్ బృంద సభ్యులు పరిశీలించారు. అమరావతిలో విద్యాసంస్థల ఏర్పాటుకు అనుకూలమైన సదుపాయాలున్నాయని ఈ సందర్భంగా వారు సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం విట్, ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ క్యాంప్‌సలను సందర్శించారు. ఈ క్యాంప్‌సలలో వేలాది మంది విద్యార్థులు పలు కీలకమైన కోర్సులు అభ్యసిస్తున్నారని ఆయా వర్సిటీల అధ్యాపకులు జపాన్ బృందానికి తెలిపారు. అమరావతిలో విద్యాసంస్థల ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి పూర్తిగా సహాయ సహకారాలు లభిస్తున్నాయని వివరించారు. జపాన్ బృందంలో టోక్యో వర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ యోషియూకి కజాయో, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, ప్రొఫెసర్ హయాషి కయోరి, ప్రాజెక్టు స్పెషలిస్ట్ జేమ్స్ ఫెగాన్ ఉన్నారు. సీఆర్‌డీఏ ఐటీ విభాగ ప్రాజెక్టు మేనేజర్ ఎం.లక్ష్మీప్రసన్న తదితరులు వారి వెంట పాల్గొన్నారు.