JanaSena Party: జనసేన బలోపేతానికి త్రిశూల వ్యూహం
ABN , Publish Date - Oct 05 , 2025 | 04:24 AM
కూటమిని బలపరుస్తూనే జనసేన పార్టీ బలోపేతానికి ప్రణాళికాబద్ధంగా అడుగులు వేయాలి. దీనికోసం త్రిశూల వ్యూహాన్ని అమలు చేయాలి...
పార్టీ శ్రేణులతో ప్రజాప్రతినిధులు మమేకమవ్వాలి
కూటమి పార్టీలతో సమన్వయం చేసుకుని ఒకే గళం వినిపించాలి
యువత, మహిళల సంక్షేమం, రక్షణకు ప్రాధాన్యమివ్వాలి
జనసేన ఎమ్మెల్యేల సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
అమరావతి, అక్టోబరు 4(ఆంధ్రజ్యోతి): ‘కూటమిని బలపరుస్తూనే జనసేన పార్టీ బలోపేతానికి ప్రణాళికాబద్ధంగా అడుగులు వేయాలి. దీనికోసం త్రిశూల వ్యూహాన్ని అమలు చేయాలి. ఇందుకు సంబంధించిన విధివిధానాలు త్వరలోనే తెలియజేస్తాం. వాటిని ప్రతి ఒక్కరూ క్షేత్రస్థాయిలో అమలు చేయాలి’ అని జనసేన ప్రజాప్రతినిధులకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూచించారు. శనివారం రాత్రి మంగళగిరిలోని జనసేన ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ శాసన సభ పక్ష సమావేశం నిర్వహించారు. 3గంటల పాటు సుదీర్ఘంగా సాగిన ఈ సమావేశంలో జనసేన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. పాలన, రాజకీయపరమైన అంశాలపై పవన్ వారికి దిశా నిర్దేశం చేశారు. ‘ప్రజా ప్రతినిధులుగా అందరం యువత, మహిళల ఆకాంక్షలను అర్థం చేసుకోవడం చాలా అవసరం. ఈ వర్గాల అభివృద్ధి, సంక్షేమం, రక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలి’ అని పవన్ స్పష్టం చేశారు. ‘ప్రతి ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ 5 నియోజకవర్గాల చొప్పున బాధ్యత తీసుకొని పార్టీ శ్రేణులతో మమేకం కావాలి. జనసైనికులు, వీర మహిళలకు భరోసా కల్పించాలి. వారితో పాటు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించండి. ప్రభుత్వ పథకాల అమలు, లబ్ధిదారులకు సంక్షేమం ఏ విధంగా చేరుతోంది, యువతకు నైపుణ్య శిక్షణ, మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడం తదితర విషయాలపై దృష్టి సారించండి. రహదారుల కల్పన, ఇతర మౌలిక సదుపాయాలను పరిశీలించాలి. ప్రభుత్వంద్వారా చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమం కార్యక్రమాలను ప్రజలకు తెలియజేయాలి. ఇందుకోసం ఒక్కోఅంశంపై ఒక్కో కమిటీ వేసుకుందాం. ఆరు వారాల్లోగా ఆయా కమిటీలు నివేదికలు అందించాలి.’’ అని పవన్ తెలిపారు.
నవ తరంతో మాట్లాడండి
‘జనసేన పార్టీకి మిలీనియల్స్ బలంగా నిలిచారు. వారిఆకాంక్షలు గ్రహించాలి. జెన్ జీ తరంతోనూ ఎప్పటికప్పుడు మాట్లాడుతూ, చర్చిస్తూ ఉండండి. వాళ్లు ప్రతి విషయాన్ని గమనిస్తూనే ఉంటారు. గత ప్రభుత్వం రుషికొండ ప్యాలె్‌సను నిర్మించి, ఎన్ని రూ.వందల కోట్లు వృథాచేసిందో వారికి తెలుసు. మనం కచ్చితంగా రుషికొండ ప్యాలె్‌సను సద్వినియోగపరచడంపై దృష్టిపెట్టాలి. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్, మంత్రి నాదెండ్ల మనోహర్ తదితరులు ఈసమావేశంలో పాల్గొన్నారు.
ప్రధాని మోదీకి ధన్యవాదాలు
జీఎస్టీ 2.0 సంస్కరణలు అమలు చేస్తున్న ప్రధాన మోదీకి ధన్యవాదాలు తెలియజేసే తీర్మానాన్ని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ప్రవేశపెట్టగా, సుందరపు విజయ్‌కుమార్ బలపరిచారు. సమావేశంలో తీర్మానాన్ని ఏకగీవ్రంగా ఆమోదించారు.