Share News

Fake Liquor: సూత్రధారి జనార్దనే

ABN , Publish Date - Oct 12 , 2025 | 04:42 AM

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన నకిలీ మద్యం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేసులో ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దన్‌రావే నకిలీ మద్యం తయారీ...

Fake Liquor: సూత్రధారి జనార్దనే

  • వైసీపీ జమానాలోనే నకిలీ మద్యం

  • 2023లో విచ్చలవిడిగా లిక్కర్‌ తయారీ.. ఇంజనీరింగ్‌ చదివి.. కిరాణా కొట్టుతో మొదలై

  • మద్యం వ్యాపారంలోకి జనార్దన్‌రావు అడుగులు.. బెంగళూరు, ముంబై, ఢిల్లీల నుంచి స్పిరిట్‌

  • హైదరాబాద్‌ నుంచి ఆర్టీసీ ద్వారా ఏపీకి సరఫరా.. ఫినాయిల్‌ సరఫరా పేరిట ఇన్వాయి్‌సలు

  • అద్దేపల్లి రిమాండ్‌ రిపోర్టులో కీలక విషయాలు.. రిమాండ్‌ విధించిన విజయవాడ కోర్టు

విజయవాడ, అక్టోబరు 11(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సంచలనం సృష్టించిన నకిలీ మద్యం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేసులో ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దన్‌రావే నకిలీ మద్యం తయారీ, విక్రయాలకు సూత్రధారి అని ఎక్సైజ్‌ పోలీసులు స్పష్టం చేశారు. అంతేకాదు.. వైసీపీ హయాం నుంచే నకిలీ మద్యం తయారీకి శ్రీకారం చుట్టినట్టు పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని నిజాంపేటలో ఒక గదిని అద్దెకు తీసుకుని అక్కడ నకిలీ మద్యం తయారు చేసి, దానికి ఫినాయిల్‌ కలరింగ్‌ ఇచ్చి.. సరఫరా చేసినట్టు తెలిపారు. ఇన్వాయి్‌సలు సైతం ఫినాయిల్‌ సరఫరా కోసమేనని తీసుకుని ఆర్టీసీ కార్గోలో ఇబ్రహీంపట్నంలో ఉన్న బార్‌కు పంపేవారు. నిజాంపేటలో ఏర్పాటు చేసిన నకిలీ మద్యం డిస్టలరీని తర్వాత అన్నమయ్య జిల్లాలోని మొలకలచెరువు, ఎన్టీఆర్‌ జిల్లాలోని ఇబ్రహీంపట్నానికి విస్తరించారు. జనార్దన్‌రావును ఎక్సైజ్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు గన్నవరం విమానాశ్రయంలో అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. శనివారం సాయంత్రం విజయవాడలోని ఆరో అదనపు జిల్లా జడ్జి కోర్టు న్యాయాధికారి లెనిన్‌బాబు.. జనార్దన్‌రావుకు రిమాండ్‌ విధించారు. కాగా.. రిమాండ్‌ రిపోర్టులో కీలక విషయాలను పేర్కొన్నారు.


ycp-1.jpg

ఇంజనీరింగ్‌ చదివి..

జానర్దన్‌రావు నెల్లూరు జిల్లాలోని వాకాడు కాలేజీలో ఇంజినీరింగ్‌ను పూర్తిచేశారు. తర్వాత కిరాణా వ్యాపారం చేసి, 2012లో మద్యం వ్యాపారంలోకి దిగారు. ఇబ్రహీంపట్నంలో ఏఎన్నాఆర్‌ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ను ఏర్పాటు చేసి, భారీ లాభాలను చవి చూశారు. అయితే, జాతీయ రహదారులకు పక్కన మద్యం షాపులు ఉండరాదని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలతో బార్‌ను మరోచోటకు మార్చుకోవాల్సి వచ్చింది. దీంతో వ్యాపారం దెబ్బతింది. ఈ నేపథ్యంలో నకిలీ మద్యాన్ని విక్రయించడం మొదలు పెట్టారు. హైదరాబాద్‌లోని నిజాంపేటలో ఒక గదిని అద్దెకు తీసుకుని, సమీపంలో ఉన్న మద్యం దుకాణం నుంచి హెచ్‌డీ విస్కీ కేసులను కొనుగోలు చేశారు. వాటి ద్వారా నకిలీ మద్యం తయారు చేసేవారు. వాటిని కేసులుగా పార్శిల్‌ చేసి అందులో ఫినాయిల్‌ ఉన్నట్టుగా అట్టపెట్టెలపై లేబుల్స్‌ అతికించి వాటిని ఆర్టీసీ కొరియర్‌ ద్వారా ఇబ్రహీంపట్నం పంపారు. బార్‌లో పనిచేసే ఉద్యోగి హజీ ఆ పార్శిళ్లను తీసుకుని, వాటిని బార్‌లో అమ్మేవారు. 2022లో తుంగల సుధాకర్‌, చింతమనేని కృష్ణమోహన్‌, మహంకాళి పూర్ణచంద్రరావు, బొర్రా కిరణ్‌తో పాటు జనార్దన్‌రావు సోదరి సుబా భారతి, షరీఫ్‌ అనే వారిని వ్యాపార భాగస్వాములుగా చేసుకుని హైదరాబాద్‌లో ఈ-7 పేరుతో బార్‌ను నిర్వహించారు. అక్కడి నుంచి 35 లీటర్ల క్యానుల్లో చీప్‌ లిక్కర్‌ను సరఫరా చేసి విక్రయించేవారు. 2023లో జనార్దన్‌రావు గోవా వెళ్లారు. అక్కడ ఈ కేసులో నిందితుడిగా ఉన్న బాలాజీని కలిసి, మరిన్ని వ్యాపార అవకాశాల కోసం చర్చించారు. ఈ క్రమంలో ‘నకిలీ ఫార్ములా’ను ఉయోగించి లిక్కర్‌ తయారీ చేయాలని నిర్ణయించుకున్నారు. స్పిరిట్‌, చక్కెర, ఇతరత్రా ముడిపదార్థాలతో 2023, ఏప్రిల్‌లో ఏఎన్నాఆర్‌ బార్‌ ఏర్పాటుచేసి, తొలగించిన ప్రదేశంలో నకిలీ మద్యం తయారీ మొదలుపెట్టారు.


బెంగుళూరు, ముంబై, ఢిల్లీ ప్రాంతాల నుంచి స్పిరిట్‌, ఇతర ముడిపదార్థాలను బాలాజీ కొనుగోలు చేసి ఇబ్రహీంపట్నం పంపేవారు. తయారైన నకిలీ మద్యాన్ని జనార్దన్‌రావు సోదరుడు జగన్‌ మోహనరావు, మరికొందరు ఉద్యోగులు సీసాల్లో నింపి, వాటిపై కేరళ మార్ట్‌ విస్కీ, మంజీరా విస్కీ, ఓల్డ్‌ అడ్మిరల్‌ బ్రాందీ, క్లాసిక్‌ బ్లూ విస్కీ వంటి లేబుళ్లు అంటించేవారు. దీనికిగాను బాలాజీకి అడ్వాన్స్‌గా రూ.20 లక్షలను జనార్దన్‌రావు చెల్లించారు. లీటర్‌ బాటిల్‌కు రూ.350-450 బాలాజీ వసూలు చేసేవారు. వాటిని జనార్దన్‌రావు 180 ఎంఎల్‌ సీసాల్లోకి మార్చి ఒక్కోదానిపై రూ.30 నుంచి 40 లాభాన్ని ఆర్జించారు. 2024 ఎన్నికల సమయంలో నిఘా పెరగడంతో బాలాజీ స్పిరిట్‌ను సరఫరా చేయలేకపోయారు. దీంతో జనార్దన్‌రావు నకిలీ మద్యం తయారీ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలుపుదల చేశారు. గత ఏడాది ఎన్నికల అనంతరం.. ఇంజనీరింగ్‌లో స్నేహితుడైన టీడీపీ తంబళ్లపల్లె నియోజకవర్గ ఇన్‌చార్జి జయచంద్రారెడ్డితో పాటు మరికొంతమంది స్నేహితులను కలిశారు. ప్రభుత్వం ప్రకటించిన మద్యం విధానంలో జయచంద్రారెడ్డి అనుచరుడు సురేంద్రనాయుడు, అతని పీఏ రాజేశ్‌ మద్యం షాపులను దక్కించుకున్నారు. వాటి ద్వారా నకిలీ మద్యం విక్రయించారు. ఇంతకుముందు మాదిరిగానే బాలాజీ ముడిసరుకును సరఫరా చేశారు.


పని పంచుకున్నారు!

నకిలీ మద్యం వ్యవహారంలో ఒక్కొక్కరు ఒక్కొక్క పనిని పంచుకున్నారు. శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి ఖాళీ ప్లాస్టిక్‌ సీసాలను సరఫరా చేయగా వాటిపై అతికించే లేబుళ్లు, బ్రాండ్‌ స్టిక్కర్లను రవి సమకూర్చారు. నకిలీ మద్యాన్ని విజయవాడ పరిధిలోని విద్యాధరపురంలోని ఉన్న శ్రీనివాస వైన్స్‌లో మేనేజర్‌ కల్యాణ్‌ ద్వారా విక్రయించారు. బాట్లింగ్‌, లేబుల్‌ ఫిక్సింగ్‌, ప్యాకింగ్‌లను సయ్యద్‌ హజీ, కట్టా రాజు, బాదల్‌దాస్‌, ప్రదీప్ దాస్‌ మిథున్‌ దాస్‌, అంతా దాస్‌ చేసేవారు. జయచంద్రారెడ్డి ఆఫ్రికాలో ఉండడంతో జనార్దన్‌రావు గత నెల 25న ఆఫ్రికాలోని రువాండాకు వెళ్లారు. ఈ నకిలీ మద్యం తయారీలో ఇంకా అధునాతన పద్ధతులను పరిశీలించడానికి ఆఫ్రికా వెళ్లినట్టు ఎక్సైజ్‌ పోలీసులు రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు.

Updated Date - Oct 12 , 2025 | 07:23 AM