Janardhan Rao: జోగి చెప్పారు మేం చేశాం
ABN , Publish Date - Oct 14 , 2025 | 04:25 AM
నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితుడైన అద్దేపల్లి జనార్దనరావు అసలు గుట్టువిప్పారు. వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ ఆదేశాలతోనే నకిలీ మద్యం తయారు చేశామని వెల్లడించారు.
నకిలీ మద్యం గుట్టువిప్పిన జనార్దనరావు
కూటమి సర్కారు నిఘాతో నకిలీ మద్యం వ్యాపారం ఆపేశా
కొన్నాళ్లు ఆఫ్రికాకు వెళ్లిపోయా.. జోగి ఫోన్ చేసి రప్పించారు
మళ్లీ ఇబ్రహీంపట్నంలో తయారుచేద్దామనుకున్నాం
తంబళ్లపల్లెలో అయుతే బాబుపై బురదజల్లొచ్చని అన్నారు
ములకలచెరువులో ఓ గది తీసుకుని యంత్రాలన్నీ చేర్చా
ఎక్సైజ్‌కు లీకులిచ్చి ములకలచెరువులో దాడులు చేయించారు
జయచంద్రారెడ్డి సస్పెన్షన్‌తో ఇబ్రహీంపట్నానికి సరుకు
బెయిల్ ఇప్పిస్తానని హ్యాండిచ్చారు.. నా తమ్ముడిని ఇరికించారు
నమ్మించి మోసం చేసినందుకే నిజాలు చెబుతున్నా: జనార్దన్
అమరావతి/విజయవాడ, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితుడైన అద్దేపల్లి జనార్దనరావు అసలు గుట్టువిప్పారు. వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ ఆదేశాలతోనే నకిలీ మద్యం తయారు చేశామని వెల్లడించారు. కూటమి ప్రభుత్వం రాగానే ఆపేసి ఆఫ్రికా వెళ్లిపోయిన తనకు ఈ ఏడాది ఏప్రిల్లో ఆయన ఫోన్ చేసి రప్పించారని.. ఆయన ఇచ్చిన భరోసాతోనే మళ్లీ మొదలుపెట్టామని తెలిపారు. ఇబ్రహీంపట్నంలో కాకుండా తంబళ్లపల్లె అయితే ముఖ్యమంత్రి చంద్రబాబుకు చెడ్డపేరు తీసుకురావొచ్చని మాజీ మంత్రి చెప్పడంతో అక్కడ మొదలుపెట్టామని జనార్దన్ చెప్పారు. అజ్ఞాతంలో ఉన్న టీడీపీ తంబళ్లపల్లె ఇన్‌చార్జి జయచంద్రారెడ్డికి ఈ వ్యవహారంతో ఎలాంటి సంబంధం లేదన్నారు. అద్దేపల్లి జనార్దనరావును శుక్రవారం (10న) గన్నవరంలోని విమానాశ్రయంలో ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత చేసిన విచారణలో ఆయన పలు విషయాలను వెల్లడించారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాద్యమాల్లో ప్రస్తుతం వైరల్ అవుతోంది. వీడియోలో ఆయన చెప్పిన వివరాల ప్రకారం.. 2012లో మద్యం వ్యాపారంలోకి ప్రవేశించిన జనార్దన్.. ఇబ్రహీంపట్నంలోని ఏఎన్‌ఆర్ బార్ ద్వారా లాభాలు గడించారు. అయితే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జాతీయ రహదారి పక్కన మద్యం షాపులు తొలగించాల్సి రావడంతో ఈయన దుకాణం కూడా పోయింది. దీంతో వ్యాపారం దెబ్బతింది. 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చాక.. ప్రభుత్వ మద్యం దుకాణాలు పెట్టడం, తర్వాత కొవిడ్ సమయంలో లిక్కర్‌కు డిమాండ్ పెరగడంతో.. జనార్దన్ హైదరాబాద్ నుంచి ఫినాయిల్ స్టిక్కర్లు అతికించిన క్యాన్లలో లిక్కర్‌ను ఇబ్రహీంపట్నం తీసుకొచ్చి స్థానిక వైసీపీ నేతల సహకారంతో బాట్లింగ్ చేసి విక్రయాలు జరిపేవారు.
బెంగళూరు, ముంబై, కేరళ నుంచి కూడా ముడిసరుకు తీసుకొచ్చి ఇబ్రహీంపట్నంలోనే బాట్లింగ్ చేసి మంజీరా విస్కీ, ఓల్డ్ అడ్మిరల్, కేరళ మాల్ట్, క్లాసిక్ బ్లూ వంటి ప్రసిద్ధ బ్రాండ్లను మార్కెట్లో విక్రయించారు. తర్వాత కూటమి ప్రభుత్వం రావడం, ఎక్సైజ్ పాలసీ మారిపోవడంతో నకిలీ దందా కొనసాగించేందుకు ఇబ్బందులు ఎదురయ్యాయి. ‘జోగి రమేశ్ ఆధ్వర్యంలోనే నకిలీ మద్యం తయారు చేశాం. కూటమి ప్రభుత్వం రాగానే నిఘా పెరగడంతో ఈ వ్యాపారం ఆపేశాం. కొన్నాళ్లు ఆఫ్రికాలో ఉన్నాను. ఈ ఏడాది ఏప్రిల్లో జోగి నాకు ఫోన్ చేసి.. అక్కడి నుంచి వచ్చి మళ్లీ నకిలీ మద్యం తయారు చేయాలని చెప్పారు. కూటమి ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించడానికి.. పై వారి ఆదేశాలతో నమ్మకస్తుడివైన నీకు ఈ పని అప్పజెబుతున్నానన్నారు. మొదట ఇబ్రహీంపట్నంలో తయారు చేయాలనుకున్నాం. అయితే తంబళ్లపల్లె నుంచి ప్రారంభిస్తే చంద్రబాబు ప్రభుత్వంపై బురద జల్లొచ్చని, అది మనకు మంచి అవకాశం అవుతుందని జోగి అన్నారు. ఆయన ఆదేశాలతో ఆ నియోజకవర్గంలో మద్యం దుకాణాలను నేను తీసుకున్నా. ములకలచెరువులో తయారీ మొదలుపెట్టాం. వేరే వాళ్ల పేరు మీద గది అద్దెకు తీసుకుని లిక్కర్ తయారీకి కావలసిన యంత్రాలన్నీ తీసుకొచ్చాం. నకిలీ మద్యం తయారు చేసి, మంచి సమయం చూసి ప్రభుత్వం మీద రుద్దుదామని జోగి అన్నారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడడానికి నాకు సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. అంతా సిద్ధమయ్యాక నన్ను ఆఫ్రికాలో ఉన్న స్నేహితుడి దగ్గరకు పంపారు. జోగి తన మనుషులతో ఎక్సైజ్ శాఖకు లీకులిచ్చి ములకలచెరువులో దాడులు చేయించారు.
తద్వారా ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలని కుట్ర చేశారు. ఈ వ్యవహారంలో టీడీపీ ఇన్‌చార్జిగా ఉన్న జయచంద్రారెడ్డిని చంద్రబాబు సస్పెండ్ చేయడంతో.. మన ప్లాన్ వర్కవుట్ కాలేదని.. ఇబ్రహీంపట్నంలో దాడులు చేయిద్దామని జోగి నాకు చెప్పారు. గోడౌన్‌లో దాడి జరగడానికి ముందురోజే అన్నీ తీసుకొచ్చి పెట్టాలన్నారు. ఆయన చెప్పినట్లే లీకులిచ్చి ఎక్సైజ్ అధికారులతో దాడి చేయించారు. సాక్షి మీడియాను ముందే అక్కడ ఉంచారు. అనుకున్నట్లే అంతా జరిగింది.. చంద్రబాబు ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చింది.. అంతా బాగా జరిగింది.. ఆఫ్రికా నుంచి నువ్వు రావలసిన అవసరం లేదని జోగి నాకు చెప్పారు. బెయిల్ ఇప్పిస్తానని హామీ ఇచ్చి చివరకు హ్యాండిచ్చారు. నా తమ్ముడిని ఇందులో ఇరికించారు. జరిగిన దానితో జయచంద్రారెడ్డికి ఎలాంటి సంబంధం లేదు. జోగితో నాకు చిన్నప్పటి నుంచి పరిచయం ఉంది. నన్ను నమ్మించి మోసం చేయడంతో అసలు నిజాలు బయటపెడుతున్నాను’ అని సదరు వీడియోలో జనార్దనరావు వెల్లడించారు. ఆయన ఎక్సైజ్ కోర్టులో సోమవారం బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
సీబీఐ విచారణ వేయండి: జోగి
విజయవాడ, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): నకిలీ మద్యం తయారీలో తన ప్రమేయం ఉందంటూ రాజకీయంగా తనపై బురదజల్లుతున్నారని.. నకిలీ మద్యంపై సీబీఐతో విచారణ జరిపించాలని మాజీ మంత్రి జోగి రమేశ్ డిమాండ్ చేశారు. జనార్దనరావు వీడియో బయటకు వచ్చాక ఆయన కూడా ఓ వీడియో విడుదల చేశారు. తర్వాత విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం ఈ వ్యవహారంలో తనను కావాలనే ఇరికించిందన్నారు. తాను ఏ పాపమూ ఎరుగనని.. భార్యాబిడ్డల సాక్షిగా ప్రమాణం చేస్తున్నానని చెప్పారు.
నకిలీ మద్యంపై సిట్ ఏర్పాటు
ఐజీ అశోక్‌కుమార్ సారథ్యం
అమరావతి, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): నకిలీ మద్యం తయారీ-విక్రయాల వ్యవహారాన్ని నిగ్గు తేల్చేందుకు రాష్ట్రప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటుచేసింది. ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్‌కుమార్ సారథిగా, ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్, డీఐజీ రాహుల్‌దేవ్ శర్మ, సీఐడీ ఎస్పీ కె.చక్రవర్తి, టెక్నికల్ సర్వీసెస్ ఎస్పీ మల్లికా గార్గ్‌లతో సిట్ ఏర్పాటుచేస్తూ సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. ఎక్సైజ్ శాఖ కమిషనర్ నియంత్రణ, పర్యవేక్షణలో సిట్ పనిచేస్తుందని తెలిపింది. ములకలచెరువు, ఇబ్రహీంపట్నం ఘటనలతో పాటు నకిలీ మద్యం ఉత్పత్తి, సరఫరా, పంపిణీకి సంబంధించిన ఇతర అక్రమాలపై కూడా దర్యాప్తు చేస్తుంది. ఎక్సైజ్ కమిషనర్ ద్వారా ప్రతి 15 రోజులకోసారి నివేదిక పంపాలని సిట్‌ను ప్రభుత్వం ఆదేశించింది.