Farmer Maruti Prasad : నేరేడుకు లాభాల ఫార్ములా
ABN , Publish Date - Jul 27 , 2025 | 04:05 AM
కృషి, పట్టుదల, నూతన ఆలోచనలతో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకున్నాడు ఓ రైతు. నేరేడు పంటలో ప్రయోగాలు చేసి, నష్టాలను అధిగమించి, లాభాలను ఆర్జిస్తున్నాడు.
అనంత రైతు వినూత్న ఆవిష్కరణలు.. ఫలించిన పరిశోధనలు.. మార్కెట్లోకి ఉత్పత్తులు
అల్ల నేరేడుతో డ్రైఫ్రూట్, జ్యూస్, జామ్ తయారీ
ఆన్‌లైన్ ద్వారా దేశవ్యాప్తంగా అమ్మకాలు
నష్టాల నుంచి పట్టుదలతో లాభాల్లోకి
(రాయదుర్గం-ఆంధ్రజ్యోతి)
కృషి, పట్టుదల, నూతన ఆలోచనలతో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకున్నాడు ఓ రైతు. నేరేడు పంటలో ప్రయోగాలు చేసి, నష్టాలను అధిగమించి, లాభాలను ఆర్జిస్తున్నాడు. ఆ రైతు అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలం ఉద్దేహాళ్ గ్రామానికి చెందిన మారుతీప్రసాద్. ఆయనకు రెండెకరాల పొలం మాత్రమే ఉంది. అందులో 2018లో 150 అల్ల నేరేడు మొక్కలను నాటారు. మూడేళ్లకు దిగుబడి రావడం మొదలైంది. కానీ మార్కెట్‌లో ధర లేకపోవడంతో క్రమేపీ నష్టాలను చవి చూశారు. వాటిని ఓర్పుగా భరించి, కొత్త ఆలోచనలు చేశారు. చదువుకున్నది ఇంటర్మీడియట్ అయినా, తన తెలివితేటలు, అనుభవంతో నేరేడు పండ్లను.. జ్యూస్, డ్రై ఫ్రూట్, జామ్, పౌడర్ ఇలా వివిధ రూపాల్లో మార్కెట్‌కు పరిచయం చేశారు. డిమాండ్ పెరగడంతో జాతీయస్థాయిలో తన ఉత్పత్తులను ఎగుమతి చేస్తూ లాభాలను గడిస్తున్నారు.
సొంత ఫార్ములాతో ముందుకు..
నష్టాలను అధిగమించడానికి శాస్త్రవేత్తల సలహాలతో మారుతీ ప్రసాద్ సొంతంగా నేరేడు పళ్ల జ్యూస్ చేసే ఓ ఫార్ములాను రూపొందించారు. గుజ్జుగా ఫార్మూలాకు అనుగుణంగా వేడి చేసి, ద్రవంగా మార్చి 15 రోజులు నిల్వ చేసి జ్యూస్‌గా తయారు చేశారు. ఆ ఉత్పత్తిని మైసూర్‌లోని న్యూట్రిన్స్ ల్యాబ్‌కు పంపించి పరీక్షలు చేయించారు. ఈ జ్యూస్ పరిపూర్ణంగా చక్కెర వ్యాధిగ్రస్థులకు ఉపయోగపడుతుందని అక్కడి నుంచి అనుమతి పొందారు. దీంతో ఆ నేరుడు జ్యూస్‌ను మార్కెట్‌కు పరిచయం చేశారు. నేరేడు విత్తనాలను సైతం పౌడర్‌గా మార్చి, కిలో రూ. 300 చొప్పున మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. రెండు రూపాల్లో ప్రారంభించిన ఉత్పత్తులను క్రమేపీ పెంచుకుంటూ వచ్చారు. తన పొలంలోని పండ్లతో పాటు ఇతర రైతుల పొలాల్లో పండిన పంటను కూడా కొనుగోలు చేసి, జ్యూస్ తయారు చేస్తున్నారు. తద్వారా ఆ రైతులు నష్టపోకుండా ఆదుకుంటున్నారు.
ఏడాది నిల్వ ఉండేలా..
నేరేడు జ్యూస్, పౌడర్‌తో మొదలైన ఉత్పత్తులను డ్రైఫ్రూట్, జామ్ రూపంలోకి కూడా మార్చారు. గింజలను తొలగించి, సోలార్ డ్రయ్యర్‌లో మూడురోజుల పాటు ఎండబెట్టి, డ్రై నేరేడును తయారు చేస్తున్నారు. ఎండ లేనపుడు ఎలక్ర్టికల్ డ్రయ్యర్లను ఉపయోగిస్తున్నారు. డ్రై నేరేడు కిలో రూ. 3 వేలకు పైగా విక్రయిస్తున్నారు. ఏడాది పాటు డ్రై నేరేడును ఫ్రిడ్జ్‌లో ఉంచుకుని వాడుకోవచ్చని, అందులోని న్యూట్రిషన్స్‌కు ఎలాంటి నష్టం వాటిల్లదని చెబుతున్నారు. తమ ఉత్పత్తుల్లో ఎలాంటి రసాయనాలు వినియోగించలేదని రైతు తెలిపారు. ప్రభుత్వ అనుమతితో ఆన్‌లైన్ ద్వారా దేశంలోని చాలా ప్రాంతాలకు తమ ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నట్లు చెప్పారు. ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్థులు వీటిని కొనుగోలు చేస్తున్నారని వివరించారు. ఉద్యాన శాఖ అధికారుల సహకారంతోనే ఇలాంటి ఉత్పత్తులు తయారు చేస్తున్నట్లు తెలిపారు.
ఓర్పు చాలా అవసరం
నేరేడు పంటలో చాలా నష్టాలను చవి చూశాను. నష్టాలను అధిగమించి, ఎలాగైనా మార్కెట్‌లో నిలవాలని పట్టు వదలకుండా ఓర్పుతో ముందుకెళ్లాను. నాలా నేరేడు పండించే రైతులందరూ ఈ ప్రయత్నాన్ని చేయాలంటే చాలా ఓర్పు ఉండాలి. నేరేడు ఉత్పత్తుల తయారీ యంత్రాల కోసం రూ. 30 లక్ష లు వెచ్చించాను. రెండేళ్లుగా లాభాలను గడిస్తున్నాను. జాతీయస్థాయిలో డ్రై నేరేడు ఫ్రూట్, జ్యూస్, పౌడర్‌కు డిమాండ్ రావడంతో ఆర్డర్లు వస్తున్నాయి. రైతులు కొత్తగా ఆలోచిస్తే తప్పకుండా ఎక్కడో ఒకచోట ఫలితాలు లభిస్తాయనేందుకు నేనే ఉదాహరణ.
- మారుతీప్రసాద్, రైతు, ఉద్దేహాళ్
ఈ వార్తలు కూడా చదవండి..
సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటన షెడ్యూల్ ఖరారు
లొంగిపోయిన అగ్ర మావోయిస్టులు.. డీజీపీ ఏమన్నారంటే..