Electricity Department : కరెంటుపై కనికట్టు!
ABN , Publish Date - Mar 11 , 2025 | 05:46 AM
నెలలో రూ.57.. ఇవన్నీ వివిధ ఆన్‌లైన్ చెల్లింపుల ద్వారా వచ్చిన రివార్డులు కావు. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలకు మధ్యన ఉండే జైళ్ల శాఖకు చెందిన ఓ అధికారి బంగ్లాకు గతేడాది వచ్చిన విద్యుత్ బిల్లులు ఇవి!

రాజమండ్రిలో జైళ్ల శాఖ అధికారి లీలలు
ఎంత విద్యుత్ వాడినా వందల్లోనే బిల్లు
ఏ నెలలోనూ రూ.500 దాటని వైనం
వేసవిలో అయితే మరీ 100 లోపే
ఇంటి ‘గుట్టు’పై అనేక అనుమానాలు
జైలు నుంచి విద్యుత్ మళ్లిస్తున్నారా?
విజయవాడలోని విజిలెన్స్‌కు ఫిర్యాదులు
ఆరా తీస్తున్న అధికారులు
(విజయవాడ-ఆంధ్రజ్యోతి)
జనవరిలో రూ.366.. ఫిబ్రవరిలో రూ.452.. మార్చిలో రూ.61.. ఏప్రిల్‌లో రూ.57.. మే నెలలో రూ.57.. ఇవన్నీ వివిధ ఆన్‌లైన్ చెల్లింపుల ద్వారా వచ్చిన రివార్డులు కావు. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలకు మధ్యన ఉండే జైళ్ల శాఖకు చెందిన ఓ అధికారి బంగ్లాకు గతేడాది వచ్చిన విద్యుత్ బిల్లులు ఇవి! రాజమహేంద్రవరం కేంద్రంగా ఉండే ఆ అధికారి అధికారిక నివాసానికి మరీ ఇంత తక్కువ మొత్తంలో విద్యుత్ బిల్లులు రావడం ఆ శాఖలో చర్చనీయాంశంగా మారింది. ఒక పేద, మధ్యతరగతి వినియోగదారుడికి ప్రతినెలా వచ్చే బిల్లు కన్నా తక్కువగా రావడంతో విద్యుత్ శాఖ అధికారులు అవాక్కవుతున్నారు. ఈ అధికారి సామాన్యుల కంటే కూడా అంత పొదుపుగా విద్యుత్‌ను వినియోగిస్తున్నారా అనే సందేహం వ్యక్తమవుతోంది. సాధారణంగా ప్రతి ఏటా వేసవి మూడు నెలల్లో విద్యుత్ బిల్లులు మండే ఎండల మాదిరి భగభగమంటాయి. విచిత్రంగా గత ఏడాది వేసవిలో ఏ నెలలోనూ ఆయన ఉంటున్న బంగ్లా విద్యుత్ బిల్లు రూ.100 దాటకపోవడం విశేషం.
లో... మీడియం... హై
విద్యుత్ శాఖలో అధికారుల బిల్లులను మూడు కేటగిరిలుగా చూస్తారు. తక్కువగా విద్యుత్ బిల్లులు వచ్చే కనెక్షన్లను ‘లో’ కేటగిరిగా భావిస్తారు. కాస్త ఎక్కువగా వచ్చే బిల్లులను ‘మీడియం’ కేటగిరిగా, వేలు, లక్షల్లో బిల్లులు వచ్చే కనెక్షన్లను ‘హై’ కేటగిరిగా చూస్తారు. అధికారులు ఎక్కువగా హై కేటగిరి కనెక్షన్లపై దృష్టిసారిస్తారు. అప్పటి వరకు ఎక్కువ మొత్తంలో విద్యుత్ బిల్లు వచ్చి, తర్వాత నెలల్లో తగ్గుముఖం పడితే దానికి కారణాలను తనిఖీల ద్వారా తెలుసుకుంటారు. రాజమహేంద్రవరంలోని కేంద్ర కారాగారానికి సమీపంలో జైళ్ల అధికారుల వసతి సదుపాయాలు ఉన్నాయి. ఇందులో ఆ ఉన్నతాధికారి బంగ్లాకు పేదింటి వినియోగదారుడికి వచ్చినట్టుగా విద్యుత్ బిల్లులు రావడంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించి ట్రాన్స్‌కోలోని విజిలెన్స్ విభాగానికి ఫిర్యాదులు అందినట్టు తెలిసింది. ఏడాది పొడవునా నివాసం ఉండే భవనానికి తక్కువ మొత్తంలో బిల్లులు రావడం ఇప్పుడు అన్ని డిస్కమ్‌ల్లో చర్చనీయాంశంగా మారింది. రాజమండ్రిలో కేంద్ర కారాగారం ప్రాంగణానికి సమీపంలో మరో అధికారి వసతి గృహం ఉంది. దానికి మాత్రం బిల్లు భారీగానే రావడం గమనార్హం. గడిచిన ఏడాది మార్చిలో రూ.902, ఏప్రిల్‌లో రూ.2,644, మేలో రూ.900 బిల్లు వచ్చినట్టు రికార్డులు చెబుతున్నాయి. ఆ తర్వాత జూన్‌లో రూ.1,258, జూలైలో రూ.2,138, ఆగస్టులో రూ.1,434 బిల్లులు వచ్చాయి. ఈ ఇద్దరు అధికారులు 365 రోజులు ఇక్కడే ఉంటున్నా... విద్యుత్ బిల్లుల్లో ఇంత వ్యత్యాసం ఎందుకు వస్తుందన్న అనుమానం విజిలెన్స్ అధికారులకు కలుగుతోంది. దీనిపై అధికారులు ఆరా తీస్తున్నారు.
‘మళ్లింపు’ నడుస్తోందా?
జైళ్ల శాఖకు చెందిన ఈ అధికారి వసతి గృహానికి తక్కువ మొత్తంలో విద్యుత్ బిల్లు రావడం వెనుక ‘మళ్లింపు’ పథకం నడుస్తున్నట్టు అనుమానిస్తున్నారు. ఇందులో కొంతమంది స్థానిక విద్యుత్ శాఖ అధికారుల పాత్ర ఉన్నట్టు సమాచారం. జైలుకు వచ్చే ఖైదీల్లో వివిధ వృత్తులవారు ఉంటారు. విద్యుత్ పనుల్లో ప్రావీణ్యం ఉన్న ఖైదీలను ఉపయోగించుకుని జైలుకు సంబంధించిన విద్యుత్‌ను వసతి గృహానికి మళ్లించినట్టు ఆరోపణలు వస్తున్నాయి. అందువల్లే విద్యుత్ బిల్లులు ప్రతినెలా తక్కువ మొత్తంలో వస్తున్నాయని తెలుస్తోంది. వాస్తవానికి ప్రతి సబ్‌స్టేషన్‌కు ఈఆర్వో (విద్యుత్ రెవెన్యూ కార్యాలయం) నుంచి వినియోగం, బిల్లులకు సంబంధించి జాబితా వెళ్తుంది. వినియోగంలో హెచ్చుతగ్గులు భారీగా ఉన్నప్పుడు సంబంధిత సబ్‌స్టేషన్ సిబ్బంది ఆయా కనెక్షన్లు ఉన్న ఇళ్లను, వాణిజ్య సముదాయాలను తనిఖీ చేస్తారు. ఎక్కడైనా విద్యుత్ చౌర్యం జరుగుతుందా.. అని తెలుసుకుంటారు. అటువంటిది హై కేటగిరిలో ఉన్న జైళ్ల శాఖ అధికారి వసతి గృహానికి తక్కువ మొత్తంలో విద్యుత్ బిల్లు వస్తున్నా స్థానిక సబ్‌స్టేషన్ అధికారులు మౌనంగా ఉండటంపై విజిలెన్స్ అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.