Kanaka Durga Temple: జయహో భవానీ!
ABN , Publish Date - Oct 05 , 2025 | 04:00 AM
విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ కొనసాగుతోంది. సాధారణ భక్తుల కంటే అమ్మవారి దీక్ష చేపట్టిన భవానీ భక్తులు పెద్ద ఎత్తున దర్శనానికి...
ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భవానీ దీక్షాధారులు
1.20 లక్షల మందికి పైగా దుర్గమ్మ దర్శనం
విజయవాడ, అక్టోబరు 4(ఆంధ్రజ్యోతి): విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ కొనసాగుతోంది. సాధారణ భక్తుల కంటే అమ్మవారి దీక్ష చేపట్టిన (భవానీ) భక్తులు పెద్ద ఎత్తున దర్శనానికి తరలివస్తున్నారు. శనివారం నుంచి అమ్మవారు కనకదుర్గమ్మగా దర్శనమిస్తుండగా, తెల్లవారుజామున మూడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు 1.20 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. కొండ దిగువన వినాయకుడి ఆలయం నుంచి క్యూలైన్‌లోకి ప్రవేశించిన భక్తులకు దర్శనం పూర్తవ్వడానికి గంట సమయం పడుతోంది. అదే హోల్డింగ్ పాయింట్లలో ఉన్న భక్తులకు దర్శన సమయం ఐదారు గంటలు పడుతోంది. ఇరుముడులతో దర్శనం చేసుకున్న భక్తులు మొక్కులు చెల్లించుకుని దీక్ష విరమిస్తున్నారు. కాగా, శరన్నవరాత్రులు ప్రారంభం రోజు నుంచి శనివారం సాయంత్రం నాటికి మొత్తం 16 లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లు ఆలయవర్గాలు తెలిపాయి.