జై హనుమాన
ABN , Publish Date - May 22 , 2025 | 11:25 PM
హనుమాన జయంతి వేడుకలు జిల్లా వ్యాప్తంగా గురువారం ఘనంగా జరిగాయి.
ఘనంగా హనుమాన జయంతి
మద్దికెరలో రథోత్సవం
మద్దికెర, మే 22 (ఆంధ్రజ్యోతి): హనుమాన జయంతి వేడుకలు జిల్లా వ్యాప్తంగా గురువారం ఘనంగా జరిగాయి. ఆలయాల్లో ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు, వ్రతాలు నిర్వహించారు. కాగా మద్దికెర మండలంలోని హంప గ్రామంలో హనుమాన జయంతి సందర్భంగా రథోత్సవం కోలాహలంగా సాగింది. ఈ రథోత్సవానికి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. ముందుగా స్వామివారి ఆలయంలో గణపతిపూజ, పుణ్యహావాచనం, నవగ్రహ ఆరాధన, రథ ప్రోక్షణ చేశారు. అనంతరం రథం ఎదుట హోమం పూజలు చేశారు. అనంతరం రథాన్ని గ్రామ పురవీధుల్లో లాగుతూ భక్తులు తమ భక్తిప్రపత్తిని చాటుకున్నారు.
ఎమ్మిగనూరులో శోభాయాత్ర
ఎమ్మిగనూరు పట్టణంలో హనుమాన జయంతి సందర్భంగా శోభాయాత్రను నిర్వహించారు. పట్టణంలోని సోగనూరు రోడ్డు వజ్ర అభయ ఆంజనేయస్వామి ఆలయంలో ఉదయం నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆంజనేయస్వామి భారీ విగ్రహంతో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ నీలకంఠేశ్వర దేవాలయం, శ్రీనివాస సర్కిల్, ట్యాంక్ బండ్ రోడ్డు, సోమప్ప సర్కిల్ మీదుగా సాగింది.