Share News

Jagan Hyderabad Rally Sparks Massive Stir: హైదరాబాద్‌లోనూ రప్పా రప్పా

ABN , Publish Date - Nov 21 , 2025 | 04:22 AM

ఊహించినట్టే జరిగింది. వైసీపీ శ్రేణులు, జగన్‌ అభిమానులు హైదరాబాద్‌లో రచ్చ రచ్చ చేశారు. పొరుగు రాష్ట్రంలోనూ రప్పా రప్పా ప్లకార్డులు ప్రదర్శిస్తూ, కాబోయే సీఎం జగన్‌, జై జగన్‌ నినాదాలతో నానా హంగామా...

Jagan Hyderabad Rally Sparks Massive Stir: హైదరాబాద్‌లోనూ రప్పా రప్పా

  • బేగంపేట నుంచి ర్యాలీగా నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరైన జగన్‌

  • వైసీపీ కార్యకర్తల నానా హంగామా

  • గుంపులు, గుంపులుగా చేరిన శ్రేణులు

  • రోడ్లపై వెళ్లే సామాన్యులకు ఇబ్బందులు

  • పోలీసులపైకి దూసుకొచ్చిన వైనం

  • నాంపల్లిలో భారీగా ట్రాఫిక్‌ జామ్‌

  • భయంతో ముందుగానే షాపుల మూత

  • కోర్టు నుంచి బయటికి వస్తుండగా తోపులాట.. కిందపడిన న్యాయవాదులు

  • పోలీసులు భారీ బందోబస్తు పెట్టినా వైసీపీ శ్రేణుల అత్యుత్సాహం

హైదరాబాద్‌ సిటీ, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): ఊహించినట్టే జరిగింది. వైసీపీ శ్రేణులు, జగన్‌ అభిమానులు హైదరాబాద్‌లో రచ్చ రచ్చ చేశారు. పొరుగు రాష్ట్రంలోనూ ‘రప్పా రప్పా’ ప్లకార్డులు ప్రదర్శిస్తూ, కాబోయే సీఎం జగన్‌, జై జగన్‌ నినాదాలతో నానా హంగామా చేశారు. గుంపులు, గుంపులుగా చేరి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగించారు. నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టుకు జగన్‌ హాజరైన సమయంలో అయితే మరింత రెచ్చిపోయారు. ఓ దశలో కోర్టు వైపు వెళ్లేందుకు దూసుకెళ్లగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి నాంపల్లి వరకూ ముందస్తు ప్రణాళిక ప్రకారం వైసీపీ కార్యకర్తలు చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. బేగంపేట నుంచి జగన్‌ ర్యాలీగా నాంపల్లి వచ్చారు. గురువారం ఉదయం 11.37 గంటలకు నాంపల్లి కోర్టుకు చేరుకున్నారు. నాంపల్లి కోర్టులోని మొదటి గేటు నుంచి సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌ జాయింట్‌ సీపీ జోయెల్‌ డేవిస్‌, సెంట్రల్‌ జోన్‌ డీసీపీ శిల్పవల్లి, అడిషనల్‌ డీసీపీ ఆనంద్‌, అబిడ్స్‌ సబ్‌ డివిజన్‌ ఏసీపీ ప్రవీణ్‌తో పాటు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నాంపల్లి కోర్టు రెండువైపులా దారులను బారికేడ్లతో మూసివేశారు. కోర్టులో విచారణ సుమారు అరగంటకు పైగా జరిగింది. 12.10 గంటలకు రెండో గేటు నుంచి పోలీసులు జగన్‌ కాన్వాయ్‌ను బయటకు పంపించారు.


రోడ్లపై నానా హంగామా

గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో గురువారం ఉదయం 11 గంటలకు జగన్‌ బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అయన వెంట మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పేర్నినాని, విడదల రజని ఉన్నారు. విమానాశ్రయం వెలుపలకు రాగానే అప్పటికే అక్కడకు చేరుకున్న జగన్‌ అభిమానులు ఆయనకు మద్దతుగా నినాదాలు చేశారు. ఒకదశలో పోలీసులను నెట్టుకుంటూ జగన్‌ను కలిసేందుకు కొందరు ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. అభిమానులకు అభివాదం చేస్తూ కారులో నాంపల్లి కోర్టుకు బయలుదేరారు. నాంపల్లి సీబీఐ కోర్టుకు వెళ్లే మార్గంలో ఎక్కడి చూసినా వైసీపీ నాయకులు, కార్యకర్తలు గుంపులు గుంపులుగా వచ్చి రోడ్లపై హడావుడి చేశారు. ముందస్తు ప్రణాళిక ప్రకారం నాంపల్లి, బజార్‌ఘాట్‌, రెడ్‌హిల్స్‌ ప్రాంతాల్లో హంగామా సృష్టించారు. వైఎస్‌ జగన్‌ ఫొటోలతో కూడిన ప్లకార్డులను పట్టుకొని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రోడ్లమీద వెళ్లే సామాన్యులను సైతం ఇబ్బందులకు గురి చేశారు. వైసీపీ శ్రేణులను కట్టడి చేసేందుకు హైదరాబాద్‌ సిటీ పోలీసులు భారీ బందోబస్తును, ప్రత్యేకంగా రోప్‌ పార్టీలను ఏర్పాటు చేశారు. గుంపులు గుంపులుగా వచ్చిన వారిని ఎక్కడికక్కడ కట్టడి చేశారు. బజార్‌ఘాట్‌ మీదుగా కోర్టు వైపు జగన్‌ వెళుతున్న సమయంలో పోలీసులను తోసుకుంటూ పార్టీ శ్రేణులు వెళ్లే ప్రయత్నం చేశారు. భారీగా మోహరించిన పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేసిన జగన్‌ ఉన్న ఒక కారుతో పాటు మరో కారును మాత్రమే వెళ్లేందుకు అనుమతించారు. బజార్‌ఘాట్‌ వైపు నుంచి నాంపల్లి సీబీఐ కోర్టుకు వెళ్లే మార్గంలో నివాసం ఉండే స్థానికులు, వ్యాపార సంస్థల నిర్వాహకులను పోలీసులు అడ్డుకున్నారు. గుర్తింపు కార్డులు చూపిస్తేనే లోపలికి పంపించారు. కొంత మంది దగ్గర గుర్తింపు కార్డులు లేకపోవడంతో అడ్డుకున్నారు. దీంతో వారు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారు 2-3 గంటల పాటు నాంపల్లి, బజార్‌ఘాట్‌ ప్రాంతాల్లో స్థానికులతో పాటు వ్యాపారులు, ఆ మార్గంలో వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.


కోర్టు బయట గందరగోళం

జగన్‌ నాంపల్లి కోర్టుకు వస్తున్న సమయంలో పార్టీ శ్రేణులు ‘రప్పా రప్పా’ ప్లకార్డులు ప్రదర్శించారు. 2029లో కాబోయే సీఎం జగన్‌, జై జగన్‌ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఆయన కాన్వాయ్‌ వైపు దూసుకువచ్చే ప్రయత్నం చేశారు. వైసీపీ శ్రేణులను పోలీసులు లాగేయడంతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నాంపల్లి పరిసర ప్రాంతాల్లో సుమారు అర కిలోమీటరు వరకు ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వైసీపీ శ్రేణులు అతి చేయడంపై పలువురు వాహనదారులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సుమారు రెండు గంటలకు పైగా ఆ ప్రాంతంలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఒక దశలో ఏసీపీ ప్రవీణ్‌పైకి కార్యకర్తలు దూసుకొచ్చే ప్రయత్నం చేశారు. పోలీసులను వెనక్కినెట్టే ప్రయత్నం చేయగా, పోలీసులు గట్టిగా అడ్డుకుని నిలువరించారు. కొద్దిసేపు పోలీసులు, పార్టీ శ్రేణుల మధ్య తీవ్ర తోపులాట చోటు చేసుకుంది. ఒక దశలో పోలీసులు అక్కడ భారీ సంఖ్యలో గుమిగూడిన పార్టీ శ్రేణులను తరిమికొట్టే ప్రయత్నం చేశారు. కాగా కొందరు భయంతో ముందుగానే షాపులు మూసివేశారు. అంతకుముందు పోలీసులు సైతం షాపులు తెరవద్దని సూచించారు. జగన్‌ కోర్టు హాల్‌ను వీడుతున్న సందర్భంగా కూడా విపరీతమైన తోపులాట జరిగింది. కోర్టు హాల్‌ను వీడి కారిడార్లలో ప్రవేశించగానే ఒక్కసారిగా జనం మీదపడ్డారు. కొంతమంది న్యాయవాదులు ఆ తోపులాటకు కిందపడిపోయారు. పోలీసులు అదుపు చేయకపోయి ఉంటే మరింతగా తొక్కిసలాట జరిగేదని న్యాయవాదులు అభిప్రాయపడ్డారు. కొంతమంది అత్యుత్సాహంతో కోర్టు హాల్‌లోనే సెల్ఫీలు తీసుకోవడం ఇబ్బందికరంగా మారింది. 1:15 గంటలకు బంజారాహిల్స్‌ రోడ్డు నంబర్‌ 12 లోటస్‌ పాండ్‌లోని నివాసానికి వచ్చారు. జగన్‌ రాక గురించి తెలియడంతో వైసీపీ నాయకులు, జగన్‌ అభిమానులు అక్కడికి చేరుకున్నారు. జగన్‌ పలువురు వైసీపీ నాయకులతో ఇంట్లో చర్చలు జరిపారు. అనంతరం బేగంపేట ఎయిర్‌పోర్టుకు మధ్యాహ్నం 2 గంటల తర్వాత బయలుదేరి వెళ్లారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో బెంగళూరు వెళ్లారు. జగన్‌ వెంట ఎంపీ మిథున్‌ రెడ్డి ఉన్నారు.

Updated Date - Nov 21 , 2025 | 04:22 AM