Share News

YS Jagan: జైలుకు పంపుతాం

ABN , Publish Date - Dec 19 , 2025 | 04:19 AM

పీపీపీ విధానంలో మెడికల్‌ కాలేజీల నిర్వహణను వ్యతిరేకిస్తూ మాజీ సీఎం జగన్‌ మరోసారి బెదిరింపు ధోరణితో మాట్లాడారు.

YS Jagan: జైలుకు పంపుతాం

  • పీపీపీ మెడికల్‌ కాలేజీల నిర్వాహకులకు జగన్‌ బెదిరింపులు

  • మా ప్రభుత్వం వచ్చాక 2 నెలల్లో జైలుకు

  • చంద్రబాబుకు జ్ఞానోదయం కాదు

  • ఎందుకంటే ఆయన చర్మం మందం

  • తన తప్పులను కలెక్టర్లపై నెట్టేస్తున్నాడు

  • కలెక్టర్లు తలలు బండకేసి బాదుకోవాలి

  • మరోసారి మాజీ సీఎం తీవ్ర వ్యాఖ్యలు

  • గవర్నర్‌కు ‘కోటి’ పత్రాలు అందజేత

అమరావతి, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): పీపీపీ విధానంలో మెడికల్‌ కాలేజీల నిర్వహణను వ్యతిరేకిస్తూ మాజీ సీఎం జగన్‌ మరోసారి బెదిరింపు ధోరణితో మాట్లాడారు. మెడికల్‌ కాలేజీలు దక్కించుకున్న కాంట్రాక్టర్లను జైలులో పెడతానంటూ గతంలో హెచ్చరించిన జగన్‌.. ఈసారి ఏకంగా ఆ కాలేజీల నిర్వాహకులను జైలులో పెడతానంటూ బెదిరించారు. తమ ప్రభుత్వం ఏర్పడిన రెండు నెలల్లోనే జైలులో ఉంటారని హెచ్చరించారు. పీపీపీ విధానంలో మెడికల్‌ కాలేజీల నిర్వహణను వ్యతిరేకిస్తూ చేపట్టిన కోటి సంతకాల పత్రాలను గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌కు అందజేయనున్న సందర్భంగా గురువారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎన్నికల్లో పోటీ చేసినవారితో జగన్‌ సమావేశమయ్యారు. గవర్నర్‌ను కలిశాక కోర్టు తలుపులు తడతామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి ఏకవచనంతో మాట్లాడారు. ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలను ప్రైవేటుపరం చేయడం పెద్ద స్కామ్‌గా ఆరోపించారు. ‘‘స్కామ్‌లు చేయడం చంద్రబాబుకు అలవాటే. ఆయన పాలనపై ప్రజల్లో ఆగ్రహం పెల్లుబుకుతోంది. ఆయన తన తప్పులను జిల్లా కలెక్టర్లపై నెట్టేస్తున్నాడు. కలెక్టర్ల కాన్ఫరెన్సులో ఈ మాటలు విన్నాక కలెక్టర్లు తలలు బండకేసి బాదుకోవాలి. మెడికల్‌ కాలేజీలను ప్రైవేటుపరం చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని కోటి మంది వ్యతిరేకించినా చంద్రబాబుకు జ్ఞానోదయం అవుతుందని అనుకోవడం లేదు.


ఎందుకంటే ఆయన చర్మం మందం. గతంలో ఒక్క ప్రైవేటు మెడికల్‌ కాలేజీని ఇచ్చినందుకే ముఖ్యమంత్రి పదవికి నేదురుమల్లి జనార్దనరెడ్డి రాజీనామా చేశారు. సహజంగా ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లో జీతభత్యాలు యాజమాన్యాలే భరిస్తాయి. కానీ స్కామ్‌లో భాగంగా చంద్రబాబే ప్రైవేటు మెడికల్‌ కాలేజీ సిబ్బంది జీతభత్యాలను భరిస్తామని చెబుతున్నారు. నెలకు ఐదు కోట్ల రూపాయల చొప్పున ఏడాదికి 60 కోట్ల దాకా ప్రభుత్వమే ఎదురు ఇస్తుందని చంద్రబాబు చెబుతున్నారు. ఆర్టీసీని ప్రభుత్వ పరం చేశాం కాబట్టి నిలబడింది. లేదంటే దానినీ చంద్రబాబు అమ్మేసేవాడు. ఈ మధ్య పోలీసు శాఖను ప్రైవేటు పరం చేసేయాలని వ్యాఖ్యానించాడు’’ అని ఆరోపించారు.


రుషికొండలో పుతిన్‌లాంటి వారుండొచ్చు

విశాఖ రుషికొండలో తాను కట్టించిన బ్రహ్మాండమైన భవంతిలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌లాంటి వారు విడిది చేయవచ్చని జగన్‌ అన్నారు. దేశ విదేశాలకు చెందినవారికి టూరిస్టు విడిదిగా ఉండేలా భవంతిని నిర్మించానని, విశాఖ నగరానికే తలమానికంగా ఉంటుందని చెప్పారు. విశాఖకు ఎవరు వెళ్లి చూసినా ఈ భవనం ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తుందని అన్నారు. లోక్‌భవన్‌లో గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ను కలసి కోటి సంతకాల పత్రాలను అందించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. తాను కేవలం రూ.240 కోట్లతో బ్రహ్మాండమైన రాజభవంతిని నిర్మిస్తే.. చంద్రబాబు ఒక రోజు యోగా కోసం రూ.330 కోట్లను ఆవిరి చేశాడని ఆరోపించారు. రాష్ట్రంలో 17 మెడికల్‌ కాలేజీల కోసం రూ.8,000 కోట్లతో 50 ఎకరాలు చొప్పున కొనుగోలు చేశామని, ఇందులో రూ.3,000 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. ఇప్పటికే ఏడు మెడికల్‌ కాలేజీలను నిర్మించామని, అవి ప్రస్తుతం పనిచేస్తున్నాయని అన్నారు. మిగిలిన పది మెడికల్‌ కాలేజీలకు సంబంధించి భూమి, భవంతి, పరికరాలు, సిబ్బంది అంతా ప్రభుత్వానిదేనని అన్నారు. మెడికల్‌ కాలేజీలన్నీ పూర్తయితే లక్ష కోట్ల రూపాయల విలువైన ఆస్తి అవుతుందని అన్నారు. ఇలాంటి ఆస్తిని ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తూ చంద్రబాబు పెద్ద స్కామ్‌ చేస్తున్నాడని ఆరోపించారు. మెడికల్‌ కాలేజీలు కట్టలేకపోతే ఆపేయాలని, తాము అధికారంలోకి వచ్చాక నిర్మిస్తామని జగన్‌ అన్నారు.

Updated Date - Dec 19 , 2025 | 04:21 AM