Share News

Jagan: ప్రతి ఒక్కరికీ వార్నింగ్‌ ఇస్తున్నా

ABN , Publish Date - Sep 11 , 2025 | 03:57 AM

అధికారంలో ఉండగా పెట్టుబడిదారులను బెదరగొట్టి, రివర్స్‌ టెండరింగ్‌లతో రాష్ట్రాన్ని తిరోగమనం పట్టించిన వైఎస్‌ జగన్‌... ఇప్పుడూ అవే ‘రివర్స్‌’ బెదిరింపులకు దిగుతున్నారు.

Jagan: ప్రతి ఒక్కరికీ వార్నింగ్‌ ఇస్తున్నా

  • మెడికల్‌ కాలేజీల టెండర్లలో పాల్గొనవద్దు

  • మేమొస్తే వాటిని రద్దు చేస్తాం.. జగన్‌ విధ్వంసకర హెచ్చరికలు

  • చంద్రబాబు, పవన్‌, అచ్చెన్న బావిలో దూకి చావాలని దూషణలు

అమరావతి, సెప్టెంబరు 10(ఆంధ్రజ్యోతి): అధికారంలో ఉండగా పెట్టుబడిదారులను బెదరగొట్టి, రివర్స్‌ టెండరింగ్‌లతో రాష్ట్రాన్ని తిరోగమనం పట్టించిన వైఎస్‌ జగన్‌... ఇప్పుడూ అవే ‘రివర్స్‌’ బెదిరింపులకు దిగుతున్నారు. పది మెడికల్‌ కాలేజీలను జగన్‌ పునాదులకే పరిమితం చేసి, అదే గొప్పగా డప్పుకొట్టుకుంటున్న సంగతి తెలిసిందే. వాటిని పీపీపీ విధానంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయంపై ఆయన అక్కసు వెళ్లగక్కారు. ఈ విధానంపై న్యాయ పోరాటం చేస్తామని, ప్రజా పోరాటం చేస్తామనీ హెచ్చరించవచ్చు. కానీ... ‘‘ఒకటే ఒకటి చెప్తావున్నా. ఎవరైనా టెండర్లలో పార్టిసిపేట్‌ చేయండి. ఎవడైనా రాండి. కానీ, ప్రతి ఒక్కరికీ వార్నింగ్‌ ఇస్తున్నా. రేప్పొద్దున్న మేమొచ్చిన తర్వాత రద్దు చేస్తాం. మళ్లీ వెనక్కి తీసుకుంటాం. ఇది మాత్రం కచ్చితంగా అందరూ గుర్తు పెట్టుకోవాలని చెప్తావున్నా’’ అంటూ పెట్టుబడిదారులను హెచ్చరించారు. మూడేళ్లలోపే ఆ మెడికల్‌ కాలేజీలను పూర్తిచేసి... విద్యార్థులకు, ప్రజలకు అందుబాటులోకి తేవాలన్నది కూటమి ప్రభుత్వ లక్ష్యం. ఇప్పుడు జగన్‌ ఈ ‘రివర్స్‌’ హెచ్చరికలు చేయడం రాష్ట్రానికి ద్రోహం తలపెట్టడమేనని, ఇది ఆయన విధ్వంసకర మనస్తత్వానికి అద్దం పడుతోందని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. బుధవారం అనంతపురంలో కూటమి నేతలు ‘సూపర్‌ సిక్స్‌.. సూపర్‌ హిట్‌’ సభను నిర్వహించగా... అదే సమయంలో వైఎస్‌ జగన్‌ తాడేపల్లిలో తాను ఎంచుకున్న మీడియాతో రెండు గంటలకుపైగా మాట్లాడారు.


తనకు అలవాటైన శైలిలో వక్రీకరణలు, అర్ధసత్యాలతో ప్రభుత్వంపై బురదజల్లారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఏదైనా బావి చూసుకుని దూకి చావాలి’’ అని దూషణలకు దిగారు. ‘‘చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌కు సిగ్గుండాలి. ‘సూపర్‌ సిక్స్‌’ అట్టర్‌ప్లాప్‌ అయ్యాయి. అట్టర్‌ప్లాప్‌ అయిన సినిమాకు విజయోత్సవం చేస్తున్నట్లుగా అనంతపురంలో సభ పెట్టారు. చంద్రబాబు.. కళ్లార్పకుండా అబద్ధాలు ఆడగల సమర్థుడు. ఇలాంటి మోసాలు చేస్తున్న సీఎం, డిప్యూటీ సీఎంలు ఏదైనా బావి చూసుకుని అందులో దూకి చావాలి.’’ అని వ్యాఖ్యానించారు. ‘‘సీఎం నియోజకవర్గం కుప్పంలోను, మంత్రి అచ్చెన్నాయుడు సొంత జిల్లా శ్రీకాకుళంలోనూ రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వారిద్దరూ ఎక్కడైనా బావి చూసుకుని దూకాల’’ని మళ్లీ అదే మాట అన్నారు.


విజన్‌ అంటే నాదే!

విజన్‌ అంటే తనదేనని జగన్‌ అన్నారు. మీడియాకు మ్యాప్‌ చూపిస్తూ... 17 మెడికల్‌ కాలేజీలను తీసుకువచ్చామన్నారు. వాటిలో ఐదు మాత్రమే నడుస్తున్నాయని... తక్కినవి పునాదులకే పరిమితమయ్యాయనే విషయాన్ని మాత్రం దాచిపెట్టారు. ‘‘అలాంటి మెడికల్‌ కాలేజీలను ప్రైవేటుపరం చేస్తున్న చంద్రబాబు మనిషా?. రాక్షసుడా?.’’ అని జగన్‌ ప్రశ్నించారు. స్థానిక ఎన్నికల భద్రతకు పారా మిలిటరీ బలగాలను వినియోగించాలని కోరారు. వచ్చే ఎన్నికల్లోనూ వైసీపీని అధికారంలోకి రానివ్వబోమన్నపవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలపై జగన్‌ స్పందిస్తూ... ‘‘2029లో ఏం జరుగుతుందో పవన్‌ చూసేదేముంది?. పైన దేవుడు, కింద ప్రజల ఆశీర్వాదం ఉండాలి.’’ అని అన్నారు.

అసెంబ్లీకి రాను..

వైసీపీకి ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నా ప్రతిపక్ష నేతగా తననే గుర్తించాలని జగన్‌ డిమాండ్‌ చేశారు. ‘‘అసలు ప్రతిపక్షమే లేదంటున్నారు. కాబట్టి, అసెంబ్లీ జరిగే సమయంలో..నేను మీడియా సమావేశాలు నిర్వహించి ప్రజాసమస్యలను బయటే లేవనెత్తుతా’’ అని అన్నారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాబోనని స్పష్టం చేశారు. ‘‘ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ క్రాస్‌ ఓటు చేసిందని అంటున్నారు.. దానికి రుజువు ఉందా?. ఇలాంటి ప్రశ్నలు ఎందుకబ్బా.. అడిగేది?.’’ అని మీడియా ప్రతినిధిపై జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - Sep 11 , 2025 | 03:58 AM