Share News

NCLT Judgment: సరస్వతి షేర్ల బదిలీపై ఎన్‌సీఎల్‌టీ తీర్పు రిజర్వు

ABN , Publish Date - Jul 16 , 2025 | 03:42 AM

సరస్వతి పవర్‌ కంపెనీ యాజమాన్య హక్కులు, షేర్ల బదిలీకి సంబంధించి మాజీ సీఎం జగన్‌, ఆయన తల్లి వైఎస్‌ విజయలక్షి, చెల్లి వైఎస్‌ షర్మిల మధ్య ఏర్పడిన వివాదంపై తీర్పును...

NCLT Judgment: సరస్వతి షేర్ల బదిలీపై ఎన్‌సీఎల్‌టీ తీర్పు రిజర్వు

  • తల్ల్లి, చెల్లిపై ట్రైబ్యునల్‌కు జగన్‌.. షేర్ల బదిలీ రద్దుకు వ్యాజ్యం

  • తన వాటా పునరుద్ధరించాలని వినతి

  • కంపెనీ మొత్తం తనదేనని విజయలక్ష్మి స్పష్టీకర

  • తనకసలు వాటాయే లేదన్న షర్మిల

హైదరాబాద్‌, జూలై 15(ఆంధ్రజ్యోతి): సరస్వతి పవర్‌ కంపెనీ యాజమాన్య హక్కులు, షేర్ల బదిలీకి సంబంధించి మాజీ సీఎం జగన్‌, ఆయన తల్లి వైఎస్‌ విజయలక్షి, చెల్లి వైఎస్‌ షర్మిల మధ్య ఏర్పడిన వివాదంపై తీర్పును హైదరాబాద్‌లోని నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) రిజర్వు చేసింది. ఈ కంపెనీలో 51.01 శాతం వాటా తమదేనని.. ఈ వాటాను తమకు తెలియకుండా తల్లి, చెల్లి అక్రమంగా బదిలీ చేసుకున్నారని.. ఈ బదిలీని రద్దు చేసి తమ వాటా తమకు పునరుద్ధరించాలని పేర్కొంటూ జగన్‌, ఆయన భార్య భారతి,. వారి కంపెనీ క్లాసిక్‌ రియాల్టీ పిటిషన్‌ వేసిన విషయం తెలిసిందే. దీనిపై అన్ని పక్షాల తరఫు వాదనలు మే 7న ముగిశాయి. ఇరువర్గాలు మే 30వ తేదీన లిఖితపూర్వక వాదనలు సైతం సమర్పించారు. వాదనలు విన్న ధర్మాసనంలో ఒక సభ్యుడు సెలవులో ఉండడంతో తీర్పు రిజర్వు చేయకుండా విచారణను ఈ నెల 15(మంగళవారం)కి వాయిదా వేశారు. మంగళవారం వాదనలు విన్న ఇద్దరు సభ్యులు రాజీవ్‌ భరద్వాజ్‌, సంజయ్‌ పురి తీర్పును రిజర్వు చేస్తున్నట్లు ప్రకటించారు.


ఎవరి వాదనలు ఏమిటంటే..

సరస్వతి పవర్‌ కంపెనీలో 51.01 శాతం వాటా తమదేనని జగన్‌, ఆయన భార్య భారతి, వారి కంపెనీ క్లాసిక్‌ రియాల్టీ పేర్కొనగా.. మొత్తం కంపెనీ తన చెప్పుచేతల్లోనే ఉందని.. 99.89 శాతం వాటా తన పేరుపై ఎప్పుడో బదిలీ అయిపోయిందని, కంపెనీ తనదేనని జగన్‌ తల్లి విజయలక్ష్మి స్పష్టం చేశారు. ఇది తండ్రి సంపాదించిన ఆస్తి కాదని.. చెల్లి షర్మిలపై ప్రేమ, అనురాగంతో సరస్వతి కంపెనీలో తమకు ఉన్న 51 శాతం వాటాను ఈడీ కేసులు ముగిసిన తర్వాత ఇద్దామనుకున్నామని జగన్‌ తెలిపారు. ‘ చెల్లి వేరే పార్టీలో చేరి నాపై తీవ్ర విమర్శలు చేసింది. అందుకే ఆమెపై ప్రేమానురాగాలు పోయాయి. ఆమెకు సరస్వతి పవర్‌లో వాటా ఇచ్చే ఉద్దేశం లేకపోవడంతో ఎంవోయూ, గిఫ్ట్‌ డీడ్‌ రద్దు చేసుకున్నాను. ఇది నా స్వార్జితం.. నేనే దాతను కాబట్టి ఏకపక్షంగా ఎంవోయూ, గిఫ్ట్‌ డీడ్‌ రద్దు చేసే హక్కు నాకు ఉంటుంది. 51 శాతం షేర్ల సర్టిఫికెట్లు నావద్దే ఉన్నాయి. తప్పుడు పత్రాలు సృష్టించి.. తల్లి, చెల్లి మోసం చేసి నా వాటా బదిలీ చేసుకున్నారు’ అని జగన్‌ పేర్కొన్నారు. తన కుమారుడు చెల్లిపై ప్రేమ తగ్గిందని చెబుతున్నాడే తప్ప.. తల్లిగా తనపై ప్రేమ తగ్గిందని చెప్పడంలేదని.. కంపెనీలో 99.89 శాతం వాటా తన వద్దే ఉన్నప్పుడు అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదని గత వాదనలసందర్భంగా విజయలక్ష్మి తెలిపారు. ‘నిబంధనల ప్రకారమే నా పేరుపై షేర్ల బదిలీ జరిగింది. నా కొడుకు, నేను ఒకే ఇంట్లో ఉంటున్నాం. అలాంటప్పుడు షేర్‌ సర్టిఫికెట్లు నా వద్ద లేవని ఎలా అంటారు’ అని ప్రశ్నించారు. వాటాలు వదులుకున్న తర్వాత కంపెనీకి సంబంధించినంత వరకు జగన్‌ సంబంధం లేని వ్యక్తి అని.. కంపెనీలో అంతర్గత వ్యవహారాలను ప్రశ్నించడానికి ఆయనెవరని సరస్వతి యాజమాన్యం నిలదీసింది. ఈ వ్యవహారంతో తనకు సంబంధమే లేదని.. తన పేరుపై ఎలాంటి వాటా లేదని.. తనను ప్రతివాదుల జాబితాలో నుంచి తొలగించాలని షర్మిల కోరారు.

Updated Date - Jul 16 , 2025 | 03:45 AM