Share News

YS Jagan: సినిమా చూపిస్తా

ABN , Publish Date - Sep 25 , 2025 | 04:41 AM

అధికారంలో ఉండగా ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు బనాయించి కక్షసాధింపు చర్యలకు దిగిన మాజీ సీఎం జగన్‌.. ఇప్పుడు రెడ్‌బుక్‌ను సాకుగా చూపుతున్నారు.

YS Jagan: సినిమా చూపిస్తా

  • డిజిటల్‌ బుక్‌తో ప్రతీకారం తీర్చుకుందాం

  • కూటమి నేతలు, అధికారులు సప్త సముద్రాల అవతల ఉన్నా వదిలిపెట్టేది లేదు

  • ప్రభుత్వంపై 15 నెలల్లోనే తీవ్ర అసంతృప్తి

  • మేం అధికారంలోకి వస్తే పార్టీ క్యాడర్‌ ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు: జగన్‌

  • వైసీపీ సమావేశంలో డిజిటల్‌ బుక్‌ ఆవిష్కరణ

అమరావతి, సెప్టెంబరు 24(ఆంధ్రజ్యోతి): అధికారంలో ఉండగా ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు బనాయించి కక్షసాధింపు చర్యలకు దిగిన మాజీ సీఎం జగన్‌.. ఇప్పుడు రెడ్‌బుక్‌ను సాకుగా చూపుతున్నారు. రెడ్‌బుక్‌ పేరిట వైసీపీ కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేసిన కూటమి నేతలు, అధికారులపై వైసీపీ డిజిటల్‌ బుక్‌తో ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు. తాడేపల్లి నివాస ప్రాంగణంలో బుధవారం జరిగిన వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో డిజిటల్‌ బుక్‌ను జగన్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డిజిటల్‌ యాప్‌ను ప్రారంభించి, యాప్‌ పనితీరును నేతలకు వివరించారు. ప్రభుత్వం, కూటమి నేతలు, అధికారుల వల్ల అన్యాయానికి గురైనవారు ఎవరైనా 040-48171718కు ఫోన్‌ చేయాలని సూచించారు. వైసీపీ కార్యకర్తలు, నాయకులపై అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తున్న కూటమి నేతలతో పాటు పోలీసులు, అధికారులు రిటైర్డ్‌ అయినా, సప్త సముద్రాల అవతల ఉన్నా వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. వైసీపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టినవారికి తాము అధికారంలోకి వచ్చాక సినిమా చూపిస్తామని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 15 నెలల్లోనే తీవ్రస్థాయిలో ప్రజావ్యతిరేకత వచ్చిందని అన్నారు. సూపర్‌ సిక్స్‌ అంటూ అట్టర్‌ఫ్ల్లాప్‌ అయిన సినిమాకు విజయోత్సవం చేశారన్నారు. వైసీపీ క్యాడర్‌కు అక్టోబరు నాటికి గుర్తింపు కార్డులు అందిస్తామని ప్రకటించారు. డిసెంబరు 15వ తేదీ నాటికి వైసీపీ సంస్థాగత కమిటీలన్నింటిని వేయాలని సమన్వయకర్తలను ఆదేశించారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్నందున గ్రామ స్థాయిలో రైతు, మహిళ, ఎస్సీ, ఎస్టీ, యువజన, విద్యార్థి, మైనారిటీ విభాగాలకు కమిటీలను నియమించాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. అధికారంలోకి వచ్చాక పార్టీ క్యాడర్‌ ద్వారా అభివృద్ధి కార్యక్రమాలను చేపడతామన్నారు. పార్టీ నేతలకు పాలనలో ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు.


బటన్‌ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వేశామని ఇప్పటి వరకూ చెబుతూ వచ్చిన జగన్‌.. ఇప్పుడు వైసీపీ నేతల ద్వారా పథకాలను లబ్ధిదారులకు చేరుస్తామని చెప్పారు. మెడికల్‌ కాలేజీలను చంద్రబాబు ప్రైవేటుపరం చేస్తున్నారని జగన్‌ ఆరోపించారు. అమరావతిలో ఉన్న 50,000 ఎకరాలు చాలదంటూ మరో 50,000 ఎకరాల సేకరణకు చంద్రబాబు సిద్ధమయ్యారని అన్నారు. అమరావతి కోసం లక్ష కోట్లు ఖర్చు చేస్తానంటున్న చంద్రబాబు మెడికల్‌ కాలేజీలకు రూ.5,000 కోట్లు ఖర్చు చేయలేనంటున్నారని విమర్శించారు. విద్యుత్తును యూనిట్‌కు రూ.4.50 చెల్లించి కొంటున్నారని, ఇలాంటి ఖర్చులతో రాష్ట్రానికి ఆదాయం తగ్గిపోతుందని అన్నారు. వైసీపీ హయాంలో ధరల స్థిరీకరణకు రూ.7,800 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. రైతులకు గిట్టుబాటు ధరలు దక్కడం లేదని, యూరియా దొరకడం లేదని విమర్శించారు. ఆరోగ్యశ్రీని ముంచేశారని జగన్‌ అన్నారు.

Updated Date - Sep 25 , 2025 | 04:42 AM