Medical College Visit: నేడు విశాఖకు జగన్
ABN , Publish Date - Oct 09 , 2025 | 03:34 AM
వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి గురువారం విశాఖ నగరానికి రానున్నారు. అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలంలో నిర్మాణంలో ఉన్న వైద్య కళాశాలను...
అనకాపల్లి జిల్లాలో నిర్మాణం ఆగిపోయిన వైద్య కళాశాల సందర్శన?
రోడ్డు మార్గంలో ప్రయాణానికి షరతులతో అనుమతి
ఉల్లంఘిస్తే అనుమతి రద్దు చేస్తామని పోలీసుల ప్రకటన
అయినా భారీగా జనసమీకరణకు వైసీపీ నేతల యత్నం
మాజీ వలంటీర్లు, సోషల్ మీడియా కార్యకర్తలతో టెలీకాన్ఫరెన్స్
విశాఖపట్నం, అక్టోబరు 8(ఆంధ్రజ్యోతి): వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి గురువారం విశాఖ నగరానికి రానున్నారు. అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలంలో నిర్మాణంలో ఉన్న వైద్య కళాశాలను ఆయన సందర్శించనున్నారు. గురువారం విజయవాడ నుంచి విమానంలో విశాఖకు చేరుకుంటారని పార్టీ నేతలు చెబుతున్నారు. ఎయిర్‌పోర్టు నుంచి గాజువాక, లంకెలపాలెం మీదుగా రోడ్డుమార్గంలో మాకవరపాలెం వెళ్లేందుకు బందోబస్తు ఏర్పాటుచేయాలని ఆ పార్టీ నేతలు లేఖ ద్వారా నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చిని కోరారు. గురువారం విశాఖలో మహిళల ప్రపంచకప్ క్రికెట్ భారత్-దక్షిణాఫ్రికా మ్యాచ్ జరగనున్నందున జగన్‌కు రోడ్డుమార్గాన పర్యటనకు అనుమతి నిరాకరిస్తున్నట్టు మంగళవారం ఉదయం సీపీ ప్రకటించారు. విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో మాకవరపాలెం వెళ్లడంపై ఆలోచన చేయాలని సూచించారు. అయితే, రోడ్డుమార్గంలోనే మాకవరపాలెం వెళతామని వైసీపీ నేతలు ప్రకటించడంతో...ఎయిర్‌పోర్టు నుంచి గాజువాక మీదుగా కాకుండా ఎన్‌ఏడీ, పెందుర్తి మీదుగా మాకవరపాలెం వెళ్లేందుకు షరతులతో కూడిన అనుమతి ఇస్తున్నట్టు సీపీ మంగళవారం రాత్రి ప్రకటించిన విషయం తెలిసిందే. మాజీ సీఎం పర్యటనకు అవసరమైన భద్రత కల్పిస్తామని, కాన్వాయ్‌లో పదికి మించి వాహనాలు ఉండకూడదని, రోడ్‌షో నిర్వహించడం, కూడళ్ల వద్ద గుమికూడిన ప్రజలను ఉద్దేశించి ప్రసంగాలు చేయడం, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించడానికి వీల్లేదని సీపీ షరతులు విధించారు. ఈ షరతులను ఉల్లంఘిస్తే అనుమతి రద్దు చేయడంతోపాటు చట్టపరమైన చర్యలకు గురికావాల్సి ఉంటుందన్నారు. అయినప్పటికీ వైసీపీ నేతలు జనసమీకరణలో నిమగ్నమయ్యారు.
జగన్‌కు ఎయిర్‌పోర్టులో ఘనస్వాగతం పలికేందుకు జనం తరలివచ్చేలా చూడాలంటూ వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలతో పాటు గతంలో వలంటీర్లుగా పనిచేసినవారు పిలుపునిచ్చారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు టెలీకాన్ఫరెన్స్ ద్వారా మాజీ వలంటీర్లు, సోషల్ మీడియా కార్యకర్తలతో నిరంతరం మాట్లాడుతూ జనసమీకరణపై ఆరా తీస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఉత్తరాంధ్రకు అన్యాయం చేస్తోందని చెప్పి ప్రజలను సమీపంలోని జంక్షన్‌కు తరలించాలని ఆదేశించారు. బుధవారం వైసీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్, వైసీపీ విశాఖ జిల్లా ఇన్‌చార్జి కురసాల కన్నబాబు ఇక్కడి పార్టీ కార్యాలయంలో తిష్ఠ వేసి జనసమీకరణపై నేతలు, కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు, వివిధ విభాగాల అధ్యక్షులతో సమావేశాలు నిర్వహించారు.