Palla Srinivas: బొత్సకు జగన్ నుంచే ప్రాణహాని
ABN , Publish Date - Oct 12 , 2025 | 04:48 AM
సీనియర్ నేతగా బొత్స సత్యనారాయణ అంటే తమకు గౌరవం ఉందని, అలాంటి నేత తనకు ప్రాణహాని ఉందని చెబితే ఆలోచించాల్సిందేనని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్...
ప్రతిపక్ష నేతగా ఫోకస్ అవుతున్నారనే!
తన కన్నా ఎక్కువ పేరొస్తే జగన్‌కు నచ్చదు
బొత్స కోరితే భద్రత కల్పిస్తాం: పల్లా
అమరావతి, అక్టోబరు 11(ఆంధ్రజ్యోతి): సీనియర్ నేతగా బొత్స సత్యనారాయణ అంటే తమకు గౌరవం ఉందని, అలాంటి నేత తనకు ప్రాణహాని ఉందని చెబితే ఆలోచించాల్సిందేనని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బొత్స మాటలను బట్టి ఆయనకు జగన్ వల్లే ప్రాణహాని ఉందనిపిస్తోందని చెప్పారు. వైసీపీలో తనకన్నా ఎక్కువ పేరు సంపాదించుకున్న వాళ్లను జగన్ అంతం చేస్తాడని, వివేకా హత్యే దానికి నిదర్శనమన్నారు. ప్రతిపక్ష నేతగా బొత్స బాగా ఫోకస్ అవుతున్నారని, అదే ఆయన ప్రాణహానికి కారణం కావొచ్చన్నారు. బొత్సకు కావాలంటే ప్రభుత్వపరంగా భద్రత కల్పిస్తామని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న మూడు ప్రాంతాలను కూటమి ప్రభుత్వం సమానంగా అభివృద్ధి చేస్తోందని పల్లా తెలిపారు. రాష్ట్రానికి పెట్టుబడిదారులు రాకుండా జగన్ కుట్రలు చేస్తున్నారని, మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తున్నారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. కల్తీ మద్యానికి ఆద్యుడు జగనేనని ఆరోపించారు.