Election Promises: చెప్పేదొకటి.. చేసేదొకటి
ABN , Publish Date - Sep 09 , 2025 | 06:35 AM
సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడొచ్చినా.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామనేవారికే మద్దతిస్తామని.. 25 ఎంపీ సీట్లిస్తే కేంద్రం మెడలు వంచి హోదా సాధిస్తామని హుంకరింపు ప్రకటనలు చేయడం..
ప్రత్యేక హోదాపై జగన్ తీరిదీ
నాడు ఎక్కువ మంది ఎంపీలను ఇస్తే.. కేంద్రం మెడలు వంచుతామని హుంకరింపు
2019లో 22 మందిని ఇచ్చినా గప్‌చుప్
ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికలోనూ ఇంతే
బేషరతుగా ఎన్‌డీఏ అభ్యర్థికి మద్దతు
అమరావతి, సెప్టెంబరు 8(ఆంధ్రజ్యోతి): సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడొచ్చినా.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామనేవారికే మద్దతిస్తామని.. 25 ఎంపీ సీట్లిస్తే కేంద్రం మెడలు వంచి హోదా సాధిస్తామని హుంకరింపు ప్రకటనలు చేయడం.. అవి పూర్తయ్యాక నోరెత్తకపోవడం వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌కు పరిపాటిగా మారింది. 2014, 19 ఎన్నికల్లో ఇదే తంతు సాగించారు. 2019లో అధికారంలోకి వచ్చాక ఏకంగా 22 మంది లోక్‌సభ.. 11 మంది రాజ్యసభ సభ్యుల బలం ఉన్నా.. ఏనాడూ ప్రత్యేక హోదా కోసం ప్రధాని మోదీపై ఒత్తిడి తీసుకురాలేదు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలై కేవలం 11 అసెంబ్లీ సీట్లకే పరిమితమైనా.. శాసనసభలో తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని నానా యాగీ చేస్తున్న ఆయన.. ప్రత్యేక హోదా ఊసే మరిచారు. మంగళవారం జరిగే ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఎన్‌డీఏ అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌కు బేషరతుగా మద్దతు ప్రకటించారు. రక్షణ మంత్రి, బీజేపీ సీనియర్ నేత రాజ్‌నాథ్‌సింగ్ ఫోన్ చేసి అడిగీ అడగ్గానే.. జగన్ ఎలాంటి షరతులూ పెట్టకుండానే తలూపారు. ప్రత్యేక హోదా ఇవ్వాలని పట్టుబట్టలేదు. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణను ఆపేయాలని మాటవరుసకైనా అడుగలేదు. మాట తప్పను.. మడమ తిప్పనంటూ గొప్పలు చెప్పుకొంటూ.. ఆచరణలో మాత్రం భిన్నంగా వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయం రాష్ట్ర ప్రజల్లో పాతుకుపోయిందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. మద్యం కుంభకోణం కేసులో నిందితుడిగా రాజమండ్రి జైల్లో ఉన్న వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు బెయిలివ్వాలని న్యాయస్థానాన్ని కోరారు. కోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది.
రాష్ట్రంలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అధికారంలో ఉంది. గత ఏడాది ఎన్నికల్లో ఈ కూటమికి వ్యతిరేకంగా వైసీపీ పోరాడింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని లిఖిత పూర్వక హామీఇచ్చే పార్టీకే కేంద్రంలో మద్దతిస్తామని జగన్ అప్పట్లోనూ అన్నారు. మరి ప్రత్యేక హోదా సాధ్యం కాదని తేల్చిచెప్పిన బీజేపీ నిలబెట్టిన రాధాకృష్ణన్‌కు ఇప్పుడు మద్దతిస్తున్నారు. అవినీతి కేసుల నుంచి రక్షణ కోసమే.. ఆయనకు జగన్ బేషరతుగా మద్దతు ప్రకటించారని ఆయన చెల్లెలు, పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తాజాగా మండిపడ్డారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఎన్‌డీఏ అభ్యర్థికి ఎందుకు మద్దతు ప్రకటించారో రాష్ట్ర ప్రజలకు జగన్ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.