Share News

YSR Congress Party: అహం అడ్డొచ్చే అసెంబ్లీకి డుమ్మా

ABN , Publish Date - Sep 18 , 2025 | 02:59 AM

తనకు ప్రతిపక్ష నేత హోదా ఇస్తే తప్ప.. అసెంబ్లీకి రానంటూ వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ భీష్మించడం వెనుక వేరే కథ ఉందా? ఆ పార్టీ వర్గాలు కూడా అవుననే అంటున్నాయి.

YSR Congress Party: అహం అడ్డొచ్చే అసెంబ్లీకి డుమ్మా

  • జగన్‌ హోదా బాధ వెనుక కథ ఇదీ

  • మండలిలో ప్రతిపక్ష నేతగా బొత్స

  • క్యాబినెట్‌ ర్యాంకు, కొంత ఎక్కువసేపు మాట్లాడే వీలు

  • శాసనసభలో జగన్‌ ఎమ్మెల్యే మాత్రమే

  • పార్టీ బలం ఆధారంగానే సమయం

  • అందుకే రానంటూ మారాం!

  • ఇంటి దగ్గరైతే సొంత మీడియా ముందు గంటలకొద్దీ ఉపన్యాసాలకు అవకాశం

  • ప్రశ్నలు అడిగేవారే ఉండరు

  • అడిగినా ఆయన జవాబు చెప్పరు

(అమరావతి-ఆంధ్రజ్యోతి): తనకు ప్రతిపక్ష నేత హోదా ఇస్తే తప్ప.. అసెంబ్లీకి రానంటూ వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ భీష్మించడం వెనుక వేరే కథ ఉందా? ఆ పార్టీ వర్గాలు కూడా అవుననే అంటున్నాయి. పార్టీకి సభలో ఎంత మంది సభ్యులు ఉన్నా.. ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టామా లేదా అన్నదానికే రాజకీయ పార్టీలు ప్రాధాన్యమిస్తాయి. జగన్‌ దానిని పక్కనపెట్టి.. ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాల్సిందేనని.. సీఎం ఎంతసేపు మాట్లాడితే తనకూ అంతే సమయం ఇవ్వాలని షరతులు పెట్టడానికి ప్రధాన కారణమే ఉందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. కేవలం ఒక వ్యక్తి వల్ల అంత కఠిన నిర్ణయం తీసుకున్నారని పేర్కొంటున్నాయి. ఆ వ్యక్తి సీఎం చంద్రబాబు గానీ.. మంత్రి లోకేశ్‌ గానీ.. స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు గానీ కాదని.. సాక్షాత్తూ శాసన మండలిలో ప్రతిపక్ష నేతగా ఉన్న తమ పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ కారణమని అంటున్నాయి. 58 మంది సభ్యుల మండలిలో వైసీపీ ఎమ్మెల్సీల సంఖ్యాబలం 34. అధికార కూటమి (13) కంటే ఎక్కువగా ఉండడంతో వైసీపీ పక్ష నేతగా ఆయనకు ప్రతిపక్ష నాయకుడి హోదా లభించింది. అధికారికంగా క్యాబినెట్‌ ర్యాంకు కూడా దక్కింది. అవసరమైనప్పుడు సభలో కాస్త ఎక్కువ సమయమే మాట్లాడే అవకాశం ఉంటోంది. జగన్‌ శాసనసభ్యుడు మాత్రమే. పొరుగు సభలో బొత్స ప్రతిపక్ష నేత హోదాలో ఉంటే.. తాను కేవలం ఎమ్మెల్యేగా ఉండడంతో అహం అడ్డొచ్చి జగన్‌ అసెంబ్లీకి రానంటున్నారని వైసీపీ నేతలు బాహాటంగానే గుసగుసలాడుతున్నారు.


వాస్తవానికి మండలిలో ప్రతిపక్ష నేతగా బొత్స ఉన్నప్పటికీ.. మిగతా వైసీసీ ఎమ్మెల్సీలు కూడా ప్రజా సమస్యలపై చర్చల్లో పాల్గొంటున్నారు. ప్రశ్నోత్తరాల సమయంలో అధికార, విపక్ష సభ్యుల మధ్య వాదనలు గట్టిగానే జరుగుతున్నాయి. విపక్షానికి ఎక్కువ సమయం దొరుకుతున్నా.. ప్రభుత్వం కూడా అభ్యంతరపెట్టకుండా చర్చలు సాగిస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో సింగిల్‌ డిజిట్‌లో ఉన్నప్పటికీ వామపక్ష సభ్యులు ప్రజా సమస్యలను సమర్థంగా లేవనెత్తేవారు. ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసి సమాధానాలు రప్పించేవారు. జగన్‌ మాత్రం ఇలాంటి వాస్తవాలను పట్టించుకోకుండా.. తనకు ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానంటూ పట్టుబడుతున్నారు. అసెంబ్లీ సమావేశాల సమయంలో.. ఒకట్రెండు రోజులు తన తాడేపల్లి ప్యాలె్‌సలో సొంత, సానుకూల మీడియా ప్రతినిధులను పిలిపించుకుని.. గంటల కొద్దీ ధర్మప్రసంగాలు చేస్తారు. తన సహాయకులు సబ్జెక్టుకు సంబంధించిన ఇన్‌పుట్స్‌ ఇస్తుంటే.. జగన్‌ దర్జాగా కూర్చుని ఎంతసేపైనా మాట్లాడతారు. చెప్పాల్సింది చెప్పేశాక.. నిమిషమైనా అక్కడ ఉండకుండా వెళ్లిపోతారు. ఏ అంశంపైనా ఆయన్ను ప్రశ్నలడిగే అవకాశం ఉండదు. ప్రసంగం మధ్యలో ఎవరైనా అడిగినా ఆయన జవాబు చెప్పరు.


అభ్యంతరమెందుకు?

ప్రతిపక్ష నాయకుడు కాకపోయినా జగన్‌కు పోలీసులు జడ్‌ ప్లస్‌కు మించిన భద్రత కల్పిస్తున్నారు. ఇలాంటప్పుడు అసెంబ్లీకి రావడానికి.. సభలో కూర్చోడానికి అభ్యంతరం ఏమిటని రాజకీయ వర్గాలు ఆక్షేపిస్తున్న సంగతి తెలిసిందే. అసెంబ్లీ సంప్రదాయం ప్రకారం మొత్తం సభ్యుల్లో పది శాతం మంది ఎమ్మెల్యేలు ఉంటేనే ఆ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా, ఆ పార్టీ నేతకు విపక్ష నేత పదవి దక్కుతాయి. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1994 ఎన్నికల్లో మొత్తం 294 అసెంబ్లీ స్థానాలకు గాను కాంగ్రెస్‌కు 26 సీట్లు మాత్రమే దక్కాయి. కాంగ్రెస్‌ శాసనసభాపక్షం (సీఎల్పీ) నేతగా ఎంపికైన పి.జనార్దన్‌రెడ్డి (పీజేఆర్‌)కి ప్రతిపక్ష నేత హోదా రాలేదు. అయినా ఆయన ప్రజా సమస్యలను లేవనెత్తి చర్చించేవారు. ప్రతిపక్ష నేత హోదా ఇచ్చినా.. సభలో మాట్లాడేందుకు గంటల గంటలు టైమివ్వరు. గౌరవమర్యాదలు మాత్రమే ఉంటాయి. సభలో మాట్లాడేందుకు ఏ సభ్యుడికి ఎంత సమయం ఇవ్వాలన్నది ఆ పార్టీకి ఉన్న సభ్యుల సంఖ్య ఆధారంగా నిర్ణయిస్తారు. వైసీపీకి ఉన్నది 11 మంది ఎమ్మెల్యేలే కాబట్టి ఆ మేరకే సమయం కేటాయిస్తారు. ఇది తెలిసినా జగన్‌ పేచీ పెడుతున్నారని వైసీపీ ఎమ్మెల్యేల్లో కొందరు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు.

Updated Date - Sep 18 , 2025 | 09:40 AM