Traffic Rule Violations: జగన్.. అదే తీరు
ABN , Publish Date - Oct 10 , 2025 | 04:48 AM
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అనకాపల్లి జిల్లా పర్యటనలో అడుగడుగునా నిబంధనలను ఉల్లంఘించారు. విశాఖపట్నం విమానాశ్రయం నుంచి సుమారు 63 కిలోమీటర్ల దూరంలో ఉన్న మాకవరపాలెం చేరుకునేందుకు...
అడుగడుగునా షరతుల ఉల్లంఘనలు
రోడ్డుషోలా సాగిన మాజీ సీఎం పర్యటన
50కి పైగా వాహనాలతో కదిలిన కాన్వాయ్
60 కి.మీ. ప్రయాణానికి 6 గంటల సమయం
దారిపొడవునా వాహనం ఆపి వినతుల స్వీకరణ
ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్న అంబులెన్స్
పట్టించుకోకుండా కార్యకర్తలకు అభివాదాలు
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్)
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అనకాపల్లి జిల్లా పర్యటనలో అడుగడుగునా నిబంధనలను ఉల్లంఘించారు. విశాఖపట్నం విమానాశ్రయం నుంచి సుమారు 63 కిలోమీటర్ల దూరంలో ఉన్న మాకవరపాలెం చేరుకునేందుకు దాదాపు 6గంటల సమయం తీసుకున్నారు. వాస్తవానికి జగన్ రోడ్డు పర్యటనకు తొలుత పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ఆ తరువాత షరతులతో కూడిన అనుమతులు జారీచేశారు. కానీ వైసీపీ నాయకులు, శ్రేణులు మాత్రం పోలీసుల ఆంక్షలను పట్టించుకోకుండా విశాఖ విమానాశ్రయం నుంచి మాకవరపాలెం మండలం భీమబోయినపాలెం వరకూ రోడ్‌షో నిర్వహించారు. దాదాపు 50కిపైగా వాహనాలతో జగన్ కాన్వాయ్ సాగింది. ఉదయం 11.30 గంటలకు ఎయిర్‌పోర్టులో జగన్‌ను కలిసేందుకు, స్వాగతం పలికేందుకు వైసీపీ నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. వారిని ప్రవేశద్వారం వద్ద పోలీసులు నిలువరించారు. పార్టీ నేతలు ముందుగా ఇచ్చిన జాబితాలో పేర్లు ఉన్నవారిని మాత్రమే లోపలకు అనుమతించారు. అయితే పోలీసుల కళ్లుగప్పి చాలామంది ఎయిర్‌పోర్టు లోపలకు చొరబడ్డారు. అక్కడి నుంచి జగన్ జాతీయ రహదారిపైకి రాగానే పార్టీ నేతలు, కార్యకర్తలంతా ఆయన వాహనానికి అడ్డంగా వెళ్లి కరచాలనం చేసేందుకు ఎగబడ్డారు. దీంతో జాతీయ రహదారిపై విమానాశ్రయం కూడలి నుంచి ఎన్‌ఏడీ జంక్షన్ వైపు ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. పోలీసుల చొరవతో అక్కడి నుంచి ముందుకు కదలిన జగన్ కాకానినగర్ వద్ద స్టీల్‌ప్లాంటు కార్మికులు, యూనియన్ నేతల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. రోడ్డుపైనే వా హనం ఆపడంతో ట్రాఫిక్ చాలాసేపు నిలిచిపోయిం ది. గోపాలపట్నం పెట్రోల్ బంకు వద్ద వైసీపీ కార్యకర్తలతో జగన్ కరచాలనం చేస్తున్న సమయంలో వాహనాలు భారీగా నిలిచిపోవడంతో అంబులెన్స్ ట్రాఫిక్‌లో చిక్కుకుపోయింది.
కారు పైనుంచి కార్యకర్తలకు అభివాదం చేయడంలో నిమగ్నమైన జగన్ నిలిచిపోయిన అంబులెన్స్‌ను పట్టించుకోలేదు. ఇక కొత్తూరు(అనకాపల్లి), కశింకోట, తాళ్లపాలెం జంక్షన్ వద్దకు స్థానిక వైసీపీ నేతలు భారీగా జనాన్ని తరలించారు. దీంతో కశింకోట నుంచి తాళ్లపాలెం వరకు జాతీయ రహదారిపై వందలాది వాహనాలు నిలిచిపోయాయి. తమ ఆదేశాలను ఉల్లంఘించి కాన్వాయ్‌తోనే వెళ్లేందుకు యత్నించినా, జగన్ వాహనాన్ని ఆపేందుకు నేతలు, కార్యకర్తలు రోడ్డుపైకి వచ్చినా పోలీసులు సహనంతోనే విధులు నిర్వర్తించారు.
పీపీపీ రద్దు చేసేవరకూ పోరాటం
28న నియోజకవర్గాల్లో ధర్నాలు: జగన్
మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయడాన్ని నిరసిస్తూ ఈ నెల 28న రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ధర్నాలు చేస్తామని మాజీ సీఎం జగన్ చెప్పారు. పీపీపీ విధానం రద్దు చేసేవరకూ పోరాటం చేస్తామని అన్నారు. అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలం భీమబోయినపాలెంలో అసంపూర్తిగా ఉన్న మెడికల్ కాలేజీని ఆయన గురువారం సాయంత్రం పరిశీలించారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయబోమని ప్రకటించేంత వరకూ సీఎం చంద్రబాబును వదలిపెట్టేది లేదని అన్నారు. దీనిపై గ్రామస్థాయిలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించి సంతకాల సేకరణ చేపడతామని తెలిపారు. ప్రతి నియోజకవర్గం నుంచి 50 వేలకు తక్కువ కాకుండా రాష్ట్రవాప్తంగా కోటి సంతకాలు సేకరిస్తామని చెప్పారు. కోటి సంతకాలతో నవంబరు 24న గవర్నర్‌ను కలుస్తామని పేర్కొన్నారు. పేదవాడికి వైద్యం, వైద్య విద్య అందకుండా చేయడం కోసమే చంద్రబాబు మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తున్నారని జగన్ ఆరోపించారు. అమరావతిలో రూ.లక్ష కోట్లు ఖర్చు పెట్టేందుకు ఉత్సాహం చూపుతున్న చంద్రబాబు పేదల వైద్యం కోసం ఏడాదికి వెయ్యి కోట్లు ఖర్చు చేసేందుకు వెనుకాడుతున్నారని విమర్శించారు. భీమబోయినపాలెంలో మెడికల్ కళాశాల నిర్మాణానికి జీవో లేదని తప్పుడు మాటలు చెబుతూ స్పీకర్ అయ్యన్నపాత్రుడు తన పదవికే తలవంపులు తెస్తున్నారని జగన్ విమర్శించారు.
గో బ్యాక్ జగన్!
నర్సీపట్నంలో దళిత సంఘాల నిరసన
జగన్ పర్యటనను నిరసిస్తూ నర్సీపట్నంలో దళిత సంఘాలు ప్రదర్శన నిర్వహించాయి. దళిత సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో తొలుత ఎన్టీఆర్ మినీ స్టేడియంలోని గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేశారు. అనంతరం ప్లకార్డులతో అబీద్ సెంటర్‌లో మానవహారంగా ఏర్పడ్డారు. ఆ తరువాత అంబేడ్కర్ విగ్రహానికి పాలతో అభిషేకం చేశారు. ‘గో బ్యాక్ జగన్’ అంటూ నినాదాలు చేశారు. దళిత నాయకుడు మరిడియ్య మాట్లాడుతూ మాకవరపాలెం మండలంలో మెడికల్ కళాశాల నిర్మాణ పనులు జరగడం లేదని, ఫేక్ జీవోలు చూపి స్తూ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. మెడికల్ కళాశాల నిర్మాణానికి అనుమతి ఉందా అని ఆయన ప్రశ్నించారు. కరోనా సమయంలో మాస్క్ అడిగినందుకు దళి త వైద్యుడు సుధాకర్‌ను ఇబ్బందు లు పెట్టి, ఆయన మరణానికి కారణమయ్యారని ఆరోపించారు. అటువం టి వ్యక్తి ఏ మొహం పెట్టుకొని నర్సీపట్నం వస్తున్నారని నిలదీశారు.