Share News

Krishna District: జగన్ షో జనం పాట్లు

ABN , Publish Date - Nov 05 , 2025 | 04:54 AM

మొంథా తుఫాను ప్రభావిత ప్రాంతాల సందర్శన, రైతుల పరామర్శ పేరుతో కృష్ణాజిల్లాలో వైసీపీ అధినేత జగన్‌ మరోసారి బలప్రదర్శన యాత్రను నిర్వహించారు.

Krishna District: జగన్ షో జనం పాట్లు

  • రైతుల పరామర్శ పేరిట వైసీపీ బల ప్రదర్శన

  • టపాసుల మోత.. సైలెన్సర్‌ తీసిన బైకుల రొద

  • విజయవాడ - మచిలీపట్నం ఎన్‌హెచ్‌ 65పై అనుమతుల్లేకుండా 70 కార్లతో భారీ రోడ్డు షో

  • భారీగా డబ్బు ఖర్చు చేసి జన సమీకరణ

  • తీవ్ర ఇక్కట్లుపడ్డ ప్రయాణికులు, వాహనదారులు

  • పోలీసులపై పదే పదే విరుచుకుపడ్డ వైసీపీ నేతలు

  • సీఐలపై మాజీ ఎమ్మెల్యే కైలే, పేర్ని కిట్టు దుర్భాషలు

  • కాన్వాయ్‌లోని వాహనాలు ఢీ.. పలువురికి గాయాలు

  • దమ్ముంటే అడ్డుకోండంటూ జగన్‌ మీడియాలో వైసీపీ నాయకుల బహిరంగ సవాళ్లు

  • పంటబీమా చెల్లించకపోవడంవల్లే రైతులకు కష్టాలని జగన్‌ ఆరోపణలు

విజయవాడ, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): మొంథా తుఫాను ప్రభావిత ప్రాంతాల సందర్శన, రైతుల పరామర్శ పేరుతో కృష్ణాజిల్లాలో వైసీపీ అధినేత జగన్‌ మరోసారి బలప్రదర్శన యాత్రను నిర్వహించారు. తుఫానుకు దెబ్బతిన్న పంట పొలాల పరిశీలన కోసమంటూ అనుమతులు తీసుకుని, నిబంధనలకు విరుద్ధంగా భారీ కాన్వాయ్‌లతో, తరలించిన జనాలతో విజయవాడ - మచిలీపట్నం ఎన్‌హెచ్‌ 65పై రోడ్డు షో నిర్వహించారు. దీంతో కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్‌ స్తంభించింది. వాహనాలు కదల్లేని పరిస్థితి ఏర్పడింది. ప్రయాణికులు, అత్యవసర పనుల మీద వెళుతున్న వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అంబులెన్స్‌ చిక్కుకుపోయింది. లారీలు, ఆటోలు, కార్లు, బస్సులు, ఆఖరుకు ద్విచక్ర వాహనాలు సైతం ముందుకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఉదయం ప్రారంభించిన జగన్‌ రోడ్డు షో మధ్యాహ్నం 3 గంటలు దాటే వరకు కొనసాగింది. పర్యటన మార్గంలో సమీప గ్రామాల నుంచి పెద్ద ఎత్తున జనాలను తరలించేలా చర్యలు చేపట్టారు. జగన్‌ దగ్గరకు వస్తున్నారనగా.. ఎక్కడికక్కడ జనాలు హైవే మీదకు దూసుకువచ్చేలా ఏర్పాట్లు చేశారు. తీసుకువచ్చిన జనాలకు జెండాలు, కండువాలు, టోపీలను ముందుగానే వైసీపీ నేతలు పంపిణీ చేశారు. ముందుగా జనాలను హైవే సెంట్రల్‌ డివైడర్ల మీద కూర్చోపెట్టారు. దీంతో జగన్‌ రోడ్‌ షోలో ‘జనం’ భారీగా కదిలారు.


ఓదార్పులో ఇదేం షో?

జగ న్‌ తుఫాను ప్రభావిత ప్రాంతాల పరిశీలన నేపథ్యంలో, పది కార్లు, 500 మందికి మాత్రమే పోలీసులు అనుమతి ఇచ్చారు. రోడ్డుషో నిర్వహించటానికి అనుమతి ఇవ్వలేదు. కానీ జగన్‌ 70 కార్లతో రోడ్డు షో నిర్వహించి...వాహనదారులకు, ప్రయాణికులకు, ప్రజలకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగించారు. రోడ్డు షో పొడవునా డబ్బులిచ్చి తీసుకు వచ్చిన జనాలతో సీఎం సీఎం అంటూ నినాదాలు చేయించారు. బాధల్లో ఉన్న రైతులను పరామర్శించటానికి వెళ్లే తీరు ఇదేనా అంటూ.. ట్రాఫిక్‌లో చిక్కుకుపోయిన ప్రయాణికులు, వాహనదారులు అసహనం వ్యక్తం చేశారు. తాడేపల్లి నుంచి కాన్వాయ్‌లో బయలు దేరిన జగన్‌ హైవే మీద రోడ్డు షో నిర్వహిస్తారని పోలీసులు ఊహించలేకపోయారు. తాడేపల్లి నుంచి విజయవాడ వచ్చిన జగన్‌ కాన్వాయ్‌..పటమట, ఆటోనగర్‌ మధ్య ప్రాంతంలో హైవే మీద కాన్వాయ్‌ను ఉద్దేశపూర్వకంగా నిలిపారు. అక్కడికి ముందుగా పెనమలూరు వైసీపీ నాయకులు, శ్రేణులను రప్పించారు. వాహనం దిగి జగన్‌ వారితో మాట్లాడారు. తర్వాత జగన్‌ తన కారు డోర్‌ దగ్గర లేచి నిలబడి కార్యకర్తలకు అభివాదం చేస్తూ నిదానంగా ముందుకు కదిలారు. అప్పటికే అక్కడికి వచ్చిన కార్యకర్తలు కాన్వాయ్‌ను అనుసరించారు. ఈ హఠాత్‌ పరిణామంతో పోలీసులు ఖంగుతిన్నారు.


నిబంధనలు తోసిరాజని..

నాయకులు నిర్దేశించిన ప్రాంతాలకు కార్యకర్తలు, డబ్బులు తీసుకుని వచ్చిన వారు చేరుకున్నారు. హైవే మీద ట్రాఫిక్‌కు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, వాహనాలు స్తంభించాయని విజయవాడ - మచిలీపట్నం మధ్యన ప్రత్యామ్నాయం కూడా లేదని చెప్పినా వైసీపీ నాయకులు వినలేదు. పైగా పోలీసుల మీద వైసీపీ శ్రేణులు దౌర్జన్యం చేశాయి. కాన్వాయ్‌ను వేగంగా ముందుకు కదిలించే ఏర్పాటు చేద్దామనుకుంటే పెనమలూరు వరకు కూడా ఎక్కడకక్కడ హైవే మీదకు తరలించిన జనాన్ని నాయకులు ఎక్కించారు. దీంతో పోలీసులకు అదుపు చేయటం కష్టమైపోయింది. తొక్కిసలాటలు జరుగుతాయేమోనని భయపడాల్సి వచ్చింది. పోలీసులు కార్యకర్తలను కాన్వాయ్‌ సమీపానికి రాకుండా అడ్డుకున్నారు. అయినప్పటికీ జగన్‌ కాన్వాయ్‌లోని వాహనాలు కార్యకర్తలు అనుసరిస్తున్నారని చూడకుండా ఎలాపడితే అలా నడిపారు.

ఢీ కొట్టుకున్న కాన్వాయ్‌ వాహనాలు

రోడ్డు షోలో జగన్‌ కాన్వాయ్‌లోని రెండు వాహనాలు పరస్పరం ఢీకొట్టుకున్నాయి. ఉయ్యూరు మండలం గండిగుంట దగ్గర జగన్‌ కాన్వాయ్‌లోని ఆ పార్టీ నేతల కార్లు ఒకదానికొకటి గుద్దుకోవడంతో పలువురికి స్వల్ప గాయాలు అయ్యాయి. ఇంత జరిగినా వైసీపీ శ్రేణులు, నాయకులు పోలీసు ఆంక్షలను పట్టించుకోలేదు.

హైవేను బ్లాక్‌ చేసి..: పెడన నియోజకవర్గం వైసీపీ ఇన్‌చార్జ్‌ ఉప్పల రాము గూడురులో హైవే పైకి భారీగా కార్యకర్తలను తీసుకురావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. గూడురు సెంటర్‌ లో పోలీసులతో వైసీపీ నేతలు వాగ్వాదానికి దిగారు. హైవేకు ఆటంకం లేకుండా కార్యక్రమం నిర్వహించుకోవాలని పోలీసులు ముందుగా చెప్పినా జగన్‌, ఆ పార్టీ నేతలు పట్టించుకోలేదు. వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. గుంటూరు జిల్లా రెంటపాళ్య పర్యటనలో సింగయ్య మృతి వంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు చూసుకుంటుంటే, వైసీపీ నేతలు మాత్రం అడుగడుగునా వాగ్వాదానికి దిగారు.


పండగా.. పరామర్శా..!

అసలే రైతులు పంటలు దెబ్బతిని బాధలో ఉంటే.. వైసీపీ నాయకులు జగన్‌ పర్యటనను పండగలా మార్చివేశారు. ఆయనకు గజమాలలు వేశారు. అడుగడుగునా పూలవర్షం కురిపించారు. టపాసులు కాలుస్తూ స్వాగతం పలికారు. పోలీసుల ఆంక్షలను జగన్‌, వైసీపీ పార్టీ నేతలు, శ్రేణులు ఏ మాత్రం పట్టించుకోకుండా ఎక్కడికక్కడ ఉల్లంఘనలకు పాల్పడ్డారు. సైలెన్సర్‌ లేని వాహనాలతో ఆ పార్టీ కార్యకర్తలు నానా హడావిడి చేసి హైవేను బ్లాక్‌ చేశారు. జగన్‌ పర్యటనకు పోలీసులు మధ్యాహ్నం రెండు గంటల వరకే అనుమతి ఇచ్చారు. అది కూడా రామరాజుపాలెం, ఆకుమర్రు, సీతారామపురం, ఎస్‌ఎన్‌ గొల్లపాలెంలో మాత్రమే పర్యటనకు అనుమతినిచ్చారు. కానీ జగన్‌ మాత్రం రోడ్డు షోను సాయంత్రం వరకు కొనసాగించారు. ప్రెస్‌మీట్‌ పేరుతో మరింత జాప్యం చేశారు.

ట్రాఫిక్‌లో చిక్కుకున్న అంబులెన్స్‌

ఎన్‌హెచ్‌ - 65 పై అత్యవసరంగా ప్రయాణించే పలు వాహనాలు జగన్‌ రోడ్‌ షోలో చిక్కుకుపోయాయి. ట్రాఫిక్‌లో చిక్కుకున్న ఓఅంబులెన్స్‌ను ముందుకు పంపించేందుకు పోలీసులు ఎంతో కష్టపడాల్సి వచ్చింది. పోలీసులు పదే పదే విజప్తి చేస్తేగానీ అంబులెన్స్‌ ముందుకు వెళ్లడానికి దారి దొరకలేదు.

పోలీసులపై కైలే, కిట్టు వీరంగం..

జగన్‌ పర్యటన నేపథ్యంలో పామర్రు మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్‌ కుమార్‌ పోలీసుల మీద వీరంగం వేశారు. పెడన సమీపంలో ఎస్‌ఎన్‌ గొల్లపాలెం దగ్గర పేర్ని కిట్టు పోలీసులపై ఓవరాక్షన్‌ చేశారు.


పంటబీమా చెల్లించకపోవడంవల్లే రైతులకు కష్టాలు: జగన్‌

మచిలీపట్నం, నవంబరు 4(ఆంధ్రజ్యోతి): మొంథా తుఫాను కారణంగా రైతులకు జరిగిన పంటనష్టాన్ని చంద్రబాబు ప్రభుత్వం తక్కువగా చూపిస్తోందని మాజీ సీఎం జగన్‌ విమర్శించారు. మంగళవారం పంటలు దెబ్బతిన్న కృష్ణాజిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా పెడన నియోజకవర్గం గూడూరు మండలం రామరాజుపాలెంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో 15 లక్షల ఎకరాల్లో తుఫాను కారణంగా వివిధ రకాల పంటలకు నష్టం జరిగితే 11 లక్షల ఎకరాల్లోనే పంటనష్టం జరిగినట్టు చూపడం ఎంతవరకు సమంజసమన్నారు. తక్కువ మొత్తంలో పంటనష్టం జరిగినట్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు చూపే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన గత 18 నెలల్లో 16 సార్లు ప్రకృతి వైపరీత్యాలు సంభవించాయని, పంటలబీమాను చెల్లించకపోవడంతో ఆపత్కాలంలో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని జగన్‌ అన్నారు. పంట నష్టపరిహారంగా రైతులకు ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని, పెట్టుబడి సాయంగా ఒక్కో రైతుకు రూ.20 వేలు ఇస్తామని చెప్పి, కేవలం రూ.5 వేలతోనే సరిపెట్టారన్నారు. చాపర్‌లో తిరిగితే పంటనష్టం ఎలా తెలుస్తుందని చంద్రబాబును ఉద్దేశించి జగన్‌ అన్నారు. నష్ట పరిహారం జాబితాలు సక్రమంగా తయారుచేయాలని, లేదంటే రైతులకు న్యాయం జరిగేవరకు పోరాడతానని జగన్‌ అన్నారు.

Updated Date - Nov 05 , 2025 | 04:56 AM