Share News

Land Disputes: జగన్‌ దెబ్బకు రైతులు విలవిల

ABN , Publish Date - Oct 17 , 2025 | 03:54 AM

జగన్‌ సర్కారు పోయినా నాటి కష్టాలు ఇంకా వెంటాడుతున్నాయి. నాటి పాలకులు చేసిన తప్పులకు ఇప్పుడు రైతులు బాధలు పడుతున్నారు. రీ సర్వే పేరిట మాజీ సీఎం జగన్‌ చేసిన భూ విధ్వంస కార్యక్రమం వల్ల దాదాపు 8.5 లక్షల కుటుంబాలు విలవిల్లాడిపోతున్నాయి.

Land Disputes: జగన్‌ దెబ్బకు రైతులు విలవిల

  • నాడు.. లేని భూ వివాదాల సృష్టి.. రీ సర్వే బాధితులు 8.5 లక్షల మంది

  • పేరు, ఫొటోల పిచ్చితో 800 కోట్లు ఖర్చు

  • రైతుల ప్రమేయం లేకుండా అడ్డగోలుగా సర్వే

  • తప్పుల తడకతో అన్నదాతలకు కష్టాలు

  • కూటమి సర్కారు వచ్చాక వినతుల వెల్లువ

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

జగన్‌ సర్కారు పోయినా నాటి కష్టాలు ఇంకా వెంటాడుతున్నాయి. నాటి పాలకులు చేసిన తప్పులకు ఇప్పుడు రైతులు బాధలు పడుతున్నారు. రీ సర్వే పేరిట మాజీ సీఎం జగన్‌ చేసిన భూ విధ్వంస కార్యక్రమం వల్ల దాదాపు 8.5 లక్షల కుటుంబాలు విలవిల్లాడిపోతున్నాయి. చరిత్రలో తన పేరు, ఫొటో శాశ్వతంగా ఉండాలన్న దురాలోచనతో పాస్‌బుక్‌, సరిహద్దు సర్వే రాళ్ల ఏర్పాటుతో పాటు డ్రోన్లు, రోవర్లు ఇంకా అనేక రకాల సాంకేతిక పరిరకాల కొనుగోలు కోసం జగన్‌ 800 కోట్లకు పైగా ప్రజాధనం ఖర్చు చేశారు. అంతచేసి చివరకు లక్షలాది మంది రైతులను కష్టాలపాలు చేశారు. జగనన్న శాశ్వత భూ హక్కు-రీ సర్వే పేరిట 6,860 గ్రామాల్లో భూముల కొలతలు వేయించి, ఆ గ్రామాల్లో కొత్తగా లక్షలాది సమస్యలు సృష్టించారు. గ్రామానికి సగటున 100 మందిపైనే రైతులు, భూ యజమానులను రీ సర్వే బాధితులుగా మార్చేశారు. శాశ్వత పరిష్కారం అంటూనే.. గ్రామాల్లో గిట్టని తెలుగుదేశం, జనసేన, ఇతర వర్గాల భూములను చిక్కుల్లో పడేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక జగన్‌ సర్వే చేయించిన 6,860 గ్రామాల్లో సభలు నిర్వహించింది. తమకు తీవ్ర భూ సమస్యలు ఉన్నాయంటూ ఏకంగా 8.67 లక్షల మంది రైతులు ఏకరువు పెట్టారు. వారి పిటిషన్లను సర్కారు క్రోడీకరించగా, ఇవన్నీ రీ సర్వే తర్వాత కొత్తగా పుట్టుకొచ్చిన సమస్యలే అని తేలింది. ఇందులో 40 వేల సమస్యలు పునరావృతం(రిపీట్‌) అయినట్లు కనిపిస్తున్నా, మిగిలిన 8.27 లక్షల సమస్యలు వాస్తవికమైనవని అధికారులు తేల్చారు. ఈ సమస్యలను పరిష్కరించాల్సిందే.


భూములను తప్పుగా కొలిచారని, తమకు నోటీసులు ఇవ్వకుండానే రీ సర్వే చేశారని, పాసుపుస్తకాల్లో భూమి విస్తీర్ణం తప్పుగా, తక్కువగా నమోదు చేశారని, సరిహద్దులు, భూమిని తప్పుగా చూపించారని.. ఇంకా 18 రకాల సమస్యలను రైతులు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. జగన్‌ సర్కారు కొత్తగా తీసుకొచ్చిన జాయింట్‌ ఎల్‌పీఎమ్‌ అంశాన్ని కూడా రైతులు ప్రధానంగా లేవనెత్తారు. గ్రామాల నుంచి వచ్చిన పిటిషన్లను క్రోడీకరించడానికే అధికారులకు చాలా సమయం పట్టింది. ఇక ఆ సమస్యలను పరిష్కరించడానికి ఇంకెంతకాలం పడుతుందోనన్న ఆందోళన రైతుల నుంచి వ్యక్తమవుతోంది.

Updated Date - Oct 17 , 2025 | 03:57 AM