Share News

Political Strategy: ఇవేం పిల్లిమొగ్గలు

ABN , Publish Date - Oct 24 , 2025 | 03:02 AM

డామిట్‌... డేటా సెంటర్‌పై వైసీపీ కథ అడ్డం తిరిగింది మొన్నటిదాకా విషం చిమ్మిన నోటితోనే... నేడు స్వాగతించాల్సిన పరిస్థితి ఏర్పడింది. విశాఖలో గూగుల్‌ ఏఐ హబ్‌పై దుష్ప్రచారాన్ని జనం నమ్మకపోవడంతో...

 Political Strategy: ఇవేం పిల్లిమొగ్గలు

  • గూగుల్‌ హబ్‌పై మొన్నటిదాకా విషం

  • వేస్ట్‌, గోడౌన్‌, కాలుష్యమంటూ ప్రచారం

  • పది రోజులుగా అదేపనిగా బురదజల్లుడు

  • జగన్‌ రోత మీడియాలో చర్చల పరంపర

  • నేడు గూగుల్‌ను స్వాగతిస్తూ జగన్‌ ప్రకటన

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

డామిట్‌... డేటా సెంటర్‌పై వైసీపీ కథ అడ్డం తిరిగింది! మొన్నటిదాకా విషం చిమ్మిన నోటితోనే... నేడు స్వాగతించాల్సిన పరిస్థితి ఏర్పడింది. విశాఖలో గూగుల్‌ ఏఐ హబ్‌పై దుష్ప్రచారాన్ని జనం నమ్మకపోవడంతో... నాలుక మడతేయాల్సి వచ్చింది. ‘డేటా సెంటర్‌ను స్వాగతిస్తున్నాం’ అంటూ వైసీపీ అధ్యక్షుడు గురువారం స్వయంగా ప్రకటన చేశారు. కానీ... పది రోజులుగా జరుగుతున్న కథ వేరు. గూగుల్‌ డేటా సెంటర్‌పై వైసీపీ నేతలు, మేధావుల ముసుగు వేసుకున్న జగన్‌ మద్దతుదారులు రకరకాల దుష్ప్రచారాలు చేశారు. జగన్‌ చానల్‌లో దీనిపై చర్చోపచర్చలు నడిపారు. గూగుల్‌ డేటా సెంటర్‌ ఒక గోడౌన్‌లాంటిది మాత్రమే అని ఒకరన్నారు. ‘హమ్మో... దానివల్ల కాలుష్యం పెరిగిపోతుంది’ అని మరొకరు భయపెట్టారు. ‘అబ్బే... అది వేస్ట్‌. దానివల్ల ఉద్యోగాలేవీ రావు’ ఇంకొకరు గేలి చేశారు. రేడియేషన్‌ రూపంలో భారీ ఉష్ణోగ్రత బయటకు వస్తుందని, వాతావరణం కలుషితమవుతుందని, కూలింగ్‌ స్టేషన్ల కోసం భారీగా నీరు కావాలని ప్రజలను భయాందోళనకు గురిచేసేందుకు ప్రయత్నించారు. సముద్ర నీటిని శుద్ధిచేసి డేటా సెంటర్లకు వాడుకుంటారని కూడా తప్పుడు కథనాలను వండి జనంపైకి వదిలారు. అటు జగన్‌రోత మీడియా... ఇటు వైసీపీ అనుకూల సోషల్‌ మీడియాలో దీనిపై పుంఖానుపుంఖాలుగా కథనాలు వండివార్చారు.


అసూయ... అసహనం..

విశాఖలో భారీ ఏఐ డేటా సెంటర్‌ ఏర్పాటుపై ఈనెల 14వ తేదీన కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్‌, అశ్వనీ వైష్ణవ్‌ సమక్షంలో గూగుల్‌ ప్రతినిధులతో ఒప్పందం కుదిరింది. ఐదేళ్లలో 1.36 లక్షల కోట్ల పెట్టుబడి... దశలవారీగా నాలుగు గిగావాట్ల సామర్థ్యంతో దీనిని నిర్మిస్తామని గూగుల్‌ ప్రకటించింది. ఆ వెంటనే ప్రపంచమంతా ఒక్కసారిగా విశాఖ వైపు చూపు సారించింది. ఇతర రాష్ట్రాలు ఏపీని చూసి ఈర్ష్యకు లోనయ్యాయి. గూగుల్‌ రాకతో విశాఖకు మరిన్ని కంపెనీలు తరలి వస్తాయని... దీనికి అనుకూలమైన ఎకో సిస్టమ్‌ అభివృద్ధి చెందుతుందని నిపుణులు అభిప్రాయపడ్డారు. ప్రపంచమంతా మెచ్చుకున్నప్పటికీ.... వైసీపీకి మాత్రం గూగుల్‌ రాక నచ్చలేదు. దీనిపై రాష్ట్ర ప్రజలను గందరగోళంలోకి నెట్టే ప్రయత్నం బలంగా జరిగింది. కానీ... ఎంత బురదచల్లినా ఫలితం కనిపించలేదు. జగన్‌కు ఉన్న ‘ట్రాక్‌ రికార్డు’ వల్ల కాబోలు... వైసీపీ దుష్ప్రచారాన్ని జనం నమ్మలేదు. దీంతో... ప్లేటు తిప్పక తప్పలేదు. గూగుల్‌ డేటా సెంటర్‌పై ఇదే స్థాయిలో దుష్ప్రచారం కొనసాగిస్తే, ప్రజలు వైసీపీని ఛీకొట్టే పరిస్థితి వస్తుందని భయపడ్డారని... జగన్‌ తాజా ప్రకటనకు అదే కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. డేటా సెంటర్‌ను జగన్‌ స్వాగతించడంతో ఆ పార్టీ నేతలే విస్మయానికి గురవుతున్నారు.

Updated Date - Oct 24 , 2025 | 03:03 AM