Share News

YCP Congress Party: నేతలతో జగన్‌ చెడుగుడు

ABN , Publish Date - Dec 18 , 2025 | 03:44 AM

వైసీపీ అధికారంలో ఉండగా కీలక పాత్ర పోషించిన పలువురు ముఖ్య నేతల పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా మారింది. ఎన్నికల ముందు పలువురు నియోజకవర్గాలను మార్చేసి జగన్‌ చెడుగుడు ఆడుకున్నారు.

YCP Congress Party: నేతలతో జగన్‌ చెడుగుడు

  • అగమ్యగోచరంగా వారి రాజకీయ భవిష్యత్తు

  • పక్కన పెట్టేశారని కీలక నాయకుల్లో అసంతృప్తి

  • మళ్లీ చిలకలూరిపేట కావాలంటున్న రజిని

  • ఈసారి రేపల్లెకు మార్చాలని జగన్‌ యోచన

  • పెనమలూరు కోరుతున్న దేవినేని అవినాశ్‌

  • నిర్దిష్ట హామీ ఇవ్వని పార్టీ అధినేత

  • అంజాద్‌బాషా, నారాయణస్వామికి పూర్తిగా గుడ్‌బై

  • మార్గాని, రోజా, కొడాలికీ రాజకీయ కష్టాలే

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

వైసీపీ అధికారంలో ఉండగా కీలక పాత్ర పోషించిన పలువురు ముఖ్య నేతల పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా మారింది. ఎన్నికల ముందు పలువురు నియోజకవర్గాలను మార్చేసి జగన్‌ చెడుగుడు ఆడుకున్నారు. ఇప్పుడు ఆయా నేతలను నిర్దాక్షిణ్యంగా పక్కనపెట్టేశారు. దీంతో వారి పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. దీంతో... అసంతృప్తులు, అలకలు పెరిగిపోతున్నాయి. మాజీ మంత్రి విడదల రజినికి నాడు జగన్‌ మంత్రి పదవి ఇచ్చారు. ఐదేళ్లపాటు ఆమె హవా పార్టీలో కొనసాగింది. చిలకలూరిపేటతో పాటు జిల్లాను సైతం శాసించేస్థాయిలో అప్పట్లో వ్యవహరించారు. అంత చేసినా... ఎన్నికల సమయంలో సర్వే పేరిట ఆమెను గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి పంపించారు. ఈ పరిణామంపై ఆమె విస్తుబోయినా.. చేసేదేమీ లేక పశ్చిమ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తాజాగా తనకు మళ్లీ చిలకలూరిపేట కావాలని కోరుతున్నారు. కానీ.. ఆమె మాటను జగన్‌ ఏమాత్రం వినిపించుకోవడం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 2029 ఎన్నికల్లో రేపల్లె నుంచి పోటీ చేయించాలని జగన్‌ భావిస్తున్నట్టు చెబుతున్నారు. అయితే.. రాజకీయంగా బలమైన పునాదులు లేని తనను అక్కడకు పంపితే మరోసారి బలిపశువును అవుతానంటూ రజని వాపోతున్నారట. సహజంగా ఎన్నికలకు ఏడాది లేదా ఆరు మాసాల ముందు పార్టీలు అంతర్గత సర్వేలు నిర్వహించి.. అభ్యర్థుల మార్పులు చేర్పులపై కసరత్తు చేస్తాయి. కానీ, 2029లో జరిగే సార్వత్రిక ఎన్నికలపై 2025లోనే జగన్‌ నిర్ణయానికి రావడం చర్చనీయాంశంగా మారింది. ఒకప్పుడు పార్టీలో ఒక వెలుగు వెలిగిన రజినీ.. ఇప్పుడు అడపాదడపా స్థానిక మీడియా ముందు మాట్లాడటం మినహా ఆ జోరును చూపించలేకపోతున్నారు.


బాషా.. ఘోష!

కడప మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అంజాద్‌ బాషా ఘోష మరో విధంగా ఉంది. వచ్చే ఎన్నికల్లో ఆయనకు టికెట్‌ ఇవ్వకూడదని జగన్‌ నిర్ణయించినట్టు సమాచారం. ఆయనకు బదులుగా బాషా సోదరుడి కుమారుడుని రంగంలోకి దింపే ఆలోచనలో జగన్‌ ఉన్నారని పార్టీనేతలు వెల్లడిస్తున్నారు. కడప ఎన్నికల్లో ఓటమి పాలైన నాటి నుంచి అంజాద్‌ బాషాను జగన్‌ దూరం పెట్టారు.

దేవినేని అవినాశ్‌ దారెటు?

ఎన్టీఆర్‌ జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న వైసీపీ యువనేత దేవినేని అవినాశ్‌ పరిస్థితి కూడా డోలాయమానంలో పడిందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన అవినాశ్‌ పరాజయం పాలయ్యారు. అయితే.. కాపు, కమ్మ సామాజికవర్గాల ప్రభావం ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా గెలవడం కష్టమనే అభిప్రాయంలో అవినాశ్‌ ఉన్నారని పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో.. తన తండ్రి దేవినేని నెహ్రూ ప్రాతినిధ్యం వహించిన కంకిపాడు(ప్రస్తుతం పెనమలూరు) నియోజకవర్గం నుంచి పోటీ చేయాలన్న యోచనలో అవినాశ్‌ ఉన్నారని అంటున్నారు. అయితే... ‘నిన్ను ఎమ్మెల్యేగా చూడాలని ఉంది.’ అంటూ అవినాశ్‌ను బుజ్జగించేలా మాట్లాడడమే తప్ప.. పెనమలూరుకు మార్చడంపై జగన్‌ ఎలాంటి హామీని ఇవ్వడం లేదని పార్టీవర్గాలు చెబుతున్నాయి. తాజాగా.. విజయవాడ ఎంపీగా పోటీ చేయాలని అవినాశ్‌ ముందు జగన్‌ కొత్త ప్రతిపాదన పెట్టారని పార్టీ ముఖ్యనేతలు చెబుతున్నారు. అయితే.. లోక్‌సభకు పోటీ చేయాలంటే నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థుల బరువు బాధ్యతలను చూసుకోవాల్సి ఉంటుందని.. అంత ఆర్థిక శక్తి.. స్తోమత కూడా తనకు లేవని అవినాశ్‌ చెబుతున్నట్టు సమాచారం. కానీ, జగన్‌ మాత్రం తన మాటే వినాలన్న వైఖరిలో ఉన్నారు. ఎన్టీఆర్‌ జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న అవినాశ్‌ అన్యమనస్కంగానే, అరకొరగా పార్టీ కార్యకలాపాల్లో పాల్గొంటున్నారని నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.


కొడాలి పరిస్థితి ఇదీ...

రాజకీయ స్వయంకృతాపరాధం ఒకవైపు, జగన్‌ వ్యవహరిస్తున్న తీరు మరోవైపు కొడాలి నానికి పాలుపోని పరిస్థితి తెస్తోందని వైసీపీ నాయకులు అంటున్నారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఐదేళ్లలో కొడాలి నాని నోటికి అడ్డూ అదుపు లేకుండా పోయింది. ఎన్నికల తర్వాత రెడ్‌ బుక్‌ భయంతో కొడాలి వెనక్కి తగ్గారని రాజకీయవర్గాలు చెబుతున్నాయి. దీంతో ప్రత్యామ్నాయంగా మరో నాయకుడి కోసం జగన్‌ వెదుకుతున్నట్టు తెలుస్తోంది. ఈ సమాచారంపై అవగాహన వల్లే ఇటీవల.. తాను డాక్టర్ల సలహా మేరకు రాజకీయాల్లో చురుగ్గాలేనని.. మరో ఆరు నెలల తర్వాత పూర్తిస్థాయిలో రాజకీయాల్లో ఉంటానని.. ప్రజా ఉద్యమాల్లో పాల్గొంటానని కొడాలి ప్రకటించారు. అయితే.. అల్లుడొచ్చేదాకా అమావాస్య ఆగదన్నట్లుగా జగన్‌ మాత్రం తన ఆలోచనలను అమలు చేయడంపై దృష్టి సారించారన్న ప్రచారం జోరుగా సాగుతోంది.

నారాయణ.. నారాయణ!

రాష్ట్రంలో బలమైన ఎస్సీ సామాజికవార్గనికి చెందిన జీడీ నెల్లూరుకు చెందిన కిళత్తూరు నారాయణస్వామికి ఉప ముఖ్యమంత్రి పదవిని ఇచ్చి ఘనంగా చెప్పుకొన్న జగన్‌ ఇప్పుడు ఆయన్ను కూడా పక్కన పెట్టారని పార్టీ నేతలు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో నారాయణస్వామి కుటుంబంలో ఎవరికీ సీటు ఇచ్చే అవకాశం లేదని అంటున్నారు.

‘మార్గం’ మూత?

గత ఎన్నికల్లో రాజమండ్రి రూరల్‌ బరి నుంచి వైసీపీ అభ్యర్థిగా రంగంలోకి దిగి ఓటమిపాలైన మాజీ ఎంపీ మార్గాని భరత్‌కు రాజకీయ భవిష్యత్తు ఏమిటో అంతుచిక్కడం లేదని అంటున్నారు. 2019లో రాజమండ్రి ఎంపీగా విజయం సాధించిన భరత్‌ను మళ్లీ అదే స్థానం నుంచి పోటీ చేయించేందుకు జగన్‌ ధైర్యం చేయలేదు. 2024లో రాజమండ్రి రూరల్‌ నుంచి పోటీలో పెట్టారు. కానీ.. ఇప్పుడు ఆయనను ఎక్కడికి పంపించాలో జగన్‌ నిర్ధారించుకోలేకపోతున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి.


రోజా రూటెటు?

ఉమ్మడి చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన మాజీ మంత్రి ఆర్కే రోజా విషయంలోనూ జగన్‌ అనిశ్చితి కొనసాగిస్తున్నారని పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సహా స్థానిక వైసీపీ నేతలకు రోజా అంటే గిట్టడం లేదని పార్టీనేతలు అంటున్నారు. ఇప్పటిదాకా నగరిపై జగన్‌ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోయినా.. పరిస్థితులను గమనిస్తున్నారని, ఎన్నికలకు ముందు సర్వేల పేరిట రోజాను తప్పించే వీలుందని పార్టీనేతల్లో అంతర్గతంగా చర్చసాగుతోంది.

హవా శ్యామలదే!

వైసీపీలో ఇప్పుడు యాంకర్‌ శ్యామల హవానే కనిపిస్తోంది. సీనియర్‌ నేతలు రోజా, విడదల రజినీ వంటి వారిని సైతం తప్పించి యాంకర్‌ శ్యామలను అధికార ప్రతినిధిని చేశారు. ఈ విషయంలో పార్టీ నేతల అభిప్రాయాలను, మనోభావాలను జగన్‌ ఏమాత్రం పట్టించుకోలేదు. రాజకీయంగా ఎలాంటి అనుభవం లేకపోయినా.. ప్రత్యర్థులను ఎద్దేవా చేసేలా మాట్లాడుతున్న శ్యామలను జగన్‌ తన స్వభావానికి అనుకూలంగా ప్రోత్సహిస్తున్నారనే చర్చ సాగుతోంది. అయితే.. ఆమె హవా ఎంత కాలం కొనసాగుతుందనే విషయం చెప్పలేమని పలువురు వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం. జగన్‌ను మెప్పించినంత కాలమే ఎవరికైనా మనుగడ అని చెబుతున్నారు.

Updated Date - Dec 18 , 2025 | 06:55 AM