False Propaganda: వాస్తవాలకు పరదా
ABN , Publish Date - Aug 25 , 2025 | 05:14 AM
రాష్ట్ర ప్రభుత్వంపై అడ్డగోలు అబద్ధాలతో బురద జల్లుతున్న జగన్ పత్రిక.. సీఎం చంద్రబాబు జిల్లాల పర్యటనలపైనా విష ప్రచారం చేస్తోంది. వాస్తవాలను మరుగు పరిచి.. అబద్ధాలు, అసత్యాలను సృష్టించి..
సీఎం పెద్దాపురం పర్యటనపై జగన్ పత్రిక విష ప్రచారం
కాకినాడ, ఆగస్టు 24(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వంపై అడ్డగోలు అబద్ధాలతో బురద జల్లుతున్న జగన్ పత్రిక.. సీఎం చంద్రబాబు జిల్లాల పర్యటనలపైనా విష ప్రచారం చేస్తోంది. వాస్తవాలను మరుగు పరిచి.. అబద్ధాలు, అసత్యాలను సృష్టించి.. ప్రజలు ఏమనుకుంటారోనన్న ఇంగితం లేకుండా, అడ్డంగా దొరికిపోయి విమర్శల పాలవుతామన్న వెరపు లేకుండా వ్యవహరిస్తోంది. దీనికి నిలువెత్తు ఉదాహరణే.. కాకినాడ జిల్లా పెద్దాపురంలో శనివారం సీఎం చంద్రబాబు పర్యటనపై జగన్ పత్రిక అల్లిన కట్టుకథ!. ‘స్వర్ణాంధ్ర.. స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో భాగంగా సీఎం చంద్రబాబు పెద్దాపురంలో స్వచ్ఛ ర్యాలీ నిర్వహించారు. దీనిలో వైద్యులు, ఆశావర్కర్లు, పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు. ఈ క్రమంలో అధికారులు పెద్దాపురం మెయిన్ రోడ్డుపై డివైడర్ల మధ్యలో 250 మీటర్ల మేర ‘స్వచ్ఛ ర్యాలీ’కి సంబంధించిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. రహదారిపై ఎడమవైపు సీఎం చంద్రబాబు ర్యాలీ, కుడివైపు సాధారణ ప్రజలు, వాహనాల రాకపోకల కోసం కేటాయించారు. కానీ, జగన్ పత్రిక మాత్రం సీఎం పర్యటనపై విషం కక్కింది. అడ్డగోలుగా అబద్ధాలు అచ్చోసింది. ‘సీఎం పర్యటనలో పరదాలు’ అంటూ నిస్సిగ్గుగా నిజాలు దాచి అబద్ధాలు వండి వార్చింది. ర్యాలీ కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను వెనుక నుంచి ఫొటోలు తీసి(ఫ్లెక్సీలపై ఎక్కడైనా ఒకవైపే సంబంధిత కార్యక్రమం వివరాలను ముద్రిస్తారు. రెండో వైపు నలుపో, తెలుపో అలానే వదిలేస్తారు.) వాటినే పరదాలంటూ పేర్కొంది. వాస్తవానికి ర్యాలీలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు వెనుకభాగం అంతా నలుపు రంగులో ఉన్నాయి. ప్రముఖుల పర్యటనల్లో ఫ్లెక్సీల నాణ్యత కోసం ఎక్కువ ఖర్చుతో వెనుక భాగం నలుపు రంగు ఉండేలా చేస్తారు. అలా చేయడంవల్ల బ్యాక్ లైటింగ్ ఫ్లెక్సీ మీద పడకుండా నాణ్యత ఎక్కువగా ఉండి అందంగా కనిపిస్తుంది. అదే వెనుక తెలుపు రంగు ఉంటే బ్యాక్ లైటింగ్ ప్రభావం ఫ్లెక్సీ ఎదుట భాగంపై పడి ఆకర్షణీయంగా కనిపించదు. ఈ విషయం తెలిసి కూడా జగన్ పత్రిక అబద్ధాలు రాసేసింది. ఫ్లెక్సీల వెనుక భాగాన్ని ఏకంగా పరదాలుగా పేర్కొంటూ సీఎం చంద్రబాబు పాల్గొన్న ర్యాలీపై బురద జల్లింది.

పరదాల సీఎం జగనే!
వాస్తవానికి పరదాల సంస్కృతి ప్రారంభించింది గత వైసీపీ ప్రభుత్వంలోనే. అప్పటి సీఎం జగన్ ఎక్కడ పర్యటనకు వెళ్లినా కిలోమీటర్ల కొద్దీ రహదారులకు ఇరువైపులా ఇనుప బారికేడ్లు బిగించేవారు. పరదాలు కట్టేవారు. వచ్చిన జనాన్ని కదలకుండా నిర్బంధించేలా వ్యవహరించారు. అంతేకాదు, ఎక్కడికక్కడ చెట్లను నరికేసేవారు. దీంతో అప్పట్లో జగన్‌కు ‘పరదాల సీఎం’గా రాష్ట్రవ్యాప్తంగా చెడ్డ పేరొచ్చింది. గత ఎన్నికల్లో ప్రభుత్వం మారి చంద్రబాబు సీఎం అయ్యాక వీటన్నింటికీ చెక్ పెట్టారు. అసలు పరదాల ప్రస్తావన కాదు కదా చెట్ల జోలికి కూడా పోవడం లేదు. అప్పట్లో జగన్ వస్తే రహదారులపై ట్రాఫిక్ మళ్లించేసి నానా ఇబ్బందులు పెట్టారు. కానీ, ఇప్పుడు అలాంటిదేమీ లేకుండా రహదారికి ఒకవైపు సీఎం భద్రత సిబ్బంది, వాహనాలు ఉంటున్నాయి. రోడ్డుకు రెండోవైపు సాధారణ ప్రజల వాహనాల రాకపోకలకు అనుమతిస్తున్నారు. శనివారం పెద్దాపురంలో మెయిన్‌రోడ్డుపై ఒకవైపు మాత్రమే, అదీ సీఎం పర్యటించే ప్రాంతంలో రహదారిని మూసి పక్కన రెండోవైపు ఆటోలు, కార్లు, లారీలు, ట్రాక్టర్లు, ద్వి చక్రవాహనాలు వెళ్లేలా ఎలాంటి ఆంక్షలు లేకుండా వ్యవహరించారు. జనాన్ని నిలిపివేయడంతో ట్రాఫిక్ ఆగిందని జగన్ పత్రిక రాసింది. అయితే, సీఎం చంద్రబాబు కాన్వాయ్ ప్రజావేదిక సభకు వెళ్లే క్రమంలో 10 నిమిషాలు మాత్రమే ట్రాఫిక్‌ను నిలిపివేశారు. వీవీఐపీలు ప్రయాణించిన సమయంలో ఇలా చేయడం సర్వసాధారణం. కానీ, జగన్ పత్రిక ఇదంతా దాచేసి నిస్సిగ్గుగా బురద జల్లేసి.. ప్రజల కళ్లకు విషపు రాతలతో గంతలు కట్టే ప్రయత్నం చేసింది.