Share News

SIT Raids: కిక్కులో జగన్‌ పీఏ

ABN , Publish Date - Sep 12 , 2025 | 04:56 AM

వేలకోట్ల విలువైన మద్యం స్కామ్‌లో సిట్‌ దర్యాప్తు మరో కీలక మలుపు తిరిగింది. నిత్యం జగన్‌ వెన్నంటి ఉండే ఆయన వ్యక్తిగత సహాయకుడు (పీఏ) నర్రెడ్డి సునీల్‌ రెడ్డి కంపెనీల తలుపులనూ సిట్‌ తట్టింది.

SIT Raids: కిక్కులో జగన్‌ పీఏ

  • సునీల్‌ రెడ్డి పేరుతో పదికిపైగా కంపెనీలు

  • విశాఖ, హైదరాబాద్‌లలో సిట్‌ అధికారుల సోదాలు

  • పదీ డొల్ల కంపెనీలే..మనీ రూటింగ్‌కు ఏర్పాటు!

  • వైసీపీ హయాంలోని జే బ్రాండ్లలో 2 సునీల్‌వే

  • వేల కోట్ల మద్యం స్కామ్‌లో కీలక ఆధారాలు

  • చంచల్‌గూడలో జగన్‌ జైల్‌మేట్‌ సునీల్‌ రెడ్డి

  • జగన్‌ కంపెనీలన్నింటిలో డైరెక్టర్‌ పోస్టు

  • ‘అంతిమ లబ్ధిదారు’ లెక్క తేల్చడమే మిగిలింది

భారతి తర్వాత స్థానం సునీల్‌దే

తన పట్ల అంతులేని విధేయత చూపించడంతోపాటు వ్యక్తిగత, ఆర్థిక వ్యవహారాలు చూసుకునే సునీల్‌ రెడ్డికి వైసీపీ అధ్యక్షుడు జగన్‌ ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు. తాను ఏర్పాటు చేసిన అన్ని కంపెనీల్లో సతీమణి వైఎస్‌ భారతి తర్వాత సునీల్‌ రెడ్డినే డైరెక్టర్‌గా నియమించారు. తన వ్యాపార సామ్రాజ్యంలో మొదటి స్థానం సండూర్‌ పవర్‌ది అయితే, రెండో స్థానం భారతి సిమెంట్స్‌ది అని జగన్‌ చెబుతుంటారు. అలాంటి సండూర్‌ పవర్‌.. కన్న తల్లి, చెల్లికి వాటాలు ఇచ్చేది లేదని తేల్చిన సరస్వతి పవర్‌ మొదలుకుని తన భార్య పేరుతో ఏర్పాటు చేసిన పలు కంపెనీల్లో సునీల్‌ రెడ్డిని డైరెక్టర్‌గా చేర్చారు. సండూర్‌ పవర్‌లోకి నిధులు మళ్లించినట్లు సీబీఐ గుర్తించిన జడ్‌ఎం ఇన్ఫోటెక్‌, సిగ్మా ఆక్సిజన్‌, సాయిసూర్య వేర్‌ హౌసింగ్‌, రెవెరా, ఎక్సెల్‌ ప్రోసాఫ్ట్‌లో మొదటి డైరెక్టర్‌ భారతి కాగా రెండో డైరెక్టర్‌ సునీల్‌ కావడం గమనార్హం.

సోదాలు జరిగిన సునీల్‌ కంపెనీలివే..

  • ఆర్‌ ఆర్‌ గ్లోబల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ (వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు భార్గవరెడ్డి ఈ కంపెనీకి మరో డైరెక్టర్‌)

  • గ్రీన్‌ స్మార్ట్‌ ఇన్‌ఫ్రా

  • గ్రీన్‌ టెక్‌ ఇంజనీరింగ్‌ సిస్టమ్స్‌

  • శేఖర్‌ ఫౌండేషన్‌

  • గ్రీన్‌ టేల్‌ ఎంటర్‌ప్రైజెస్‌

  • గ్రీన్‌ కార్డ్‌ మీడియా

  • వయోలేటా ఫర్నిచర్స్‌

  • గ్రీన్‌ స్మార్ట్‌

  • జెన్సీస్‌ పెట్రో కెమికల్స్‌ అండ్‌ లాజిస్టిక్స్‌

  • గ్రీన్‌ ఫ్యూయల్స్‌ గ్లోబల్‌ ట్రేడింగ్‌


అమరావతి, విశాఖపట్నం, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): వేలకోట్ల విలువైన మద్యం స్కామ్‌లో ‘సిట్‌’ దర్యాప్తు మరో కీలక మలుపు తిరిగింది. నిత్యం జగన్‌ వెన్నంటి ఉండే ఆయన వ్యక్తిగత సహాయకుడు (పీఏ) నర్రెడ్డి సునీల్‌ రెడ్డి కంపెనీల తలుపులనూ ‘సిట్‌’ తట్టింది. గురువారం ఒకేరోజు హైదరాబాద్‌, విశాఖపట్నంలో సునీల్‌ పేరుతో ఉన్న పది కంపెనీల్లో సోదాలు నిర్వహించింది. ఈ కేసులో జగన్‌కు అత్యంత సన్నిహితులైన ఎంపీ మిథున్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్‌ రెడ్డి తదితరులు నిందితులుగా ఉన్నారు. మద్యం ముడుపుల సొమ్ములు ‘అంతిమ లబ్ధిదారు’కు చేరడంలో వీరి పాత్ర కీలకమని సిట్‌ అధికారులు తేల్చారు. ఇప్పుడు... ఈ కేసులో స్వయా నా జగన్‌ పీఏ సునీల్‌ రెడ్డి పాత్రపై దృష్టి సారించారు.


పీఏకు పలు కంపెనీలు

నర్రెడ్డి సునీల్‌ రెడ్డి... జగన్‌ సతీమణి భారతికి బంధువు. అక్రమాస్తుల కేసులో జగన్‌తోపాటు సునీల్‌ కూడా చంచల్‌గూడ జైలులో ఉన్నారు. కడప జిల్లాకు చెందిన నర్రెడ్డి సునీల్‌ రెడ్డి పేరుతో రెండు తెలుగు రాష్ట్రాల్లో పదికి పైగా కంపెనీలు ఏర్పాటయ్యాయి. ఆ కంపెనీల లావాదేవీలపై ఆరా తీసిన సిట్‌ అధికారులు, తాము సేకరించిన సమాచారంతో పాటు ఇప్పటికే విచారణలో లభ్యమైన ఆధారాలు పరిశీలించుకుని వాటిలో సోదాలకు దిగారు. గతంలో చంచల్‌గూడలో జగన్‌కు సునీల్‌రెడ్డి జైల్‌మేట్‌. జగన్‌ సతీమణి వైఎస్‌ భారతికి బంధువు. ఆయన కంపెనీలపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) గురువారం పెద్దఎత్తున దాడులు జరిపింది. హైదరాబాద్‌లోని ఎనిమిది, విశాఖలోని రెండు చోట్ల సిట్‌ అధికారులు విస్తృతంగా సోదాలు జరిపారు. హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌ రోడ్‌ నం. 2లోని సాగర్‌ సొసైటీ, రోడ్‌ నం. 3లోని స్నేహహౌస్‌ సహా రెండుచోట్ల.. రాజేంద్రనగర్‌లోని కాటేదాన్‌, ఖైరతాబాద్‌లోని కమలాపురి కాలనీల్లో ఒక్కోచోట కలిపి మొత్తం నాలుగు అడ్ర్‌సలలో ఉన్న ఎనిమిది కంపెనీల్లో సిట్‌ బృందాలు సోదాలు జరిపారు.


విశాఖలో.. విశాఖపట్నంలో సునీల్‌రెడ్డికి చెందిన రెండు కంపెనీల కార్యకలాపాలకు సంబంధించిన రికార్డులు సిట్‌ బృందాలు పరిశీలించాయి. హార్బర్‌ పార్క్‌ రోడ్డులో రామకృష్ణ మఠం ఎదురుగా గల ‘ఆకాశం’ భవనంలోని మూడో అంతస్థులో (డోర్‌ నంబర్‌7-8-22) నర్రెడ్డి సునీల్‌రెడ్డికి ‘వెర్ట్‌లైఫ్‌ బంకర్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌’, ‘గ్రీన్‌ఫీల్డ్స్‌’ పేరుతో ఈ కార్యాలయాలు ఉన్నాయి. అదనపు ఎస్పీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో విజయవాడ నుంచి వచ్చిన సిట్‌ బృందం ఉదయం 11 గంటల సమయంలో అక్కడకు వెళ్లి సోదాలు ప్రారంభించాయి. సోదాల సమయంలో మీడియాతోపాటు ఇతరులెవరినీ లోపలకు అనుమతించలేదు. రాత్రి 7.30 గంటల సమయంలో ఏపీ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ లోగో కలిగిన వ్యక్తి ఒకరు బ్రీఫ్‌ కేస్‌ పట్టుకుని ఆ భవనంలోకి వెళ్లారు. దీంతో కీలక పత్రాలను సిట్‌ అఽధికారులు గుర్తించారని, వాటిలో సంతకాలు లేదా ఇతర వివరాలను నిర్ధారించుకోవడానికే ఫోరెన్సిక్‌ నిపుణుడిని రప్పించి ఉంటారని ప్రచారం జరుగుతోంది. సునీల్‌రెడ్డి ఈ కార్యాలయాలను 2019లో ప్రారంభించినట్టు కొందరు చెబుతున్నారు. రాత్రి 9.30 గంటలకు కూడా సోదాలు కొనసాగుతున్నాయి. సోదాలకు సంబంధించిన పూర్తివివరాలు తెలియడం లేదు. మద్యం కుంభకోణంలో ఉత్తరాంధ్రలో నాడు కీలకంగా వ్యవహరించిన ఒక మంత్రి బంధువు పాత్ర కూడా ఉన్నట్టు సిట్‌ అధికారులు ఇప్పటికే గుర్తించినట్టు ప్రచారం జరుగుతోంది. ఇక్కడ సోదాలు ముగిసిన తర్వాత సిట్‌ అధికారులు సదరు మాజీ మంత్రి బంధువు ఇంట్లో సోదాలు నిర్వహించే అవకాశం లేకపోలేదని పోలీసులు చెబుతున్నారు. హైదరాబాద్‌, విశాఖలోని కంపెనీలన్నీ ప్రైవేట్‌ లిమిటెడ్‌, ఎల్‌ఎల్‌పీ, ఫౌండేషన్‌ హోదాల్లో కార్యకలాపాలు సాగిస్తున్నట్లు సిట్‌ సోదాల్లో తేలింది. ఈ కంపెనీల కార్యాలయాల నుంచి హార్డ్‌ డిస్క్‌లు, కీలక పత్రాలు, కంప్యూటర్లలోని డేటా సిట్‌ అధికారులు సేకరించారు. ఈ కంపెనీలకు ఆడిటర్‌గా ఉన్న వ్యక్తిని పిలిపించి సిట్‌ విచారించనున్నట్టు సమాచారం.


పొరుగు రాష్ట్రాల్లో రియల్‌ ఎస్టేట్‌..

విదేశాల్లో మైనింగ్‌...

పన్నెండేళ్ల క్రితం జగన్‌తో పాటు అక్రమాస్తుల కేసులో (ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌) సీబీఐ అధికారులు సునీల్‌ రెడ్డిని చంచల్‌ గూడ జైలుకు తరలించారు. కోనేరు ప్రసాద్‌ నుంచి తీసుకున్న డబ్బులు ఇతను జగన్‌కు చేర్చినట్లు అప్పట్లో సీబీఐ రిమాండ్‌ రిపోర్టులో కోర్టుకు తెలిపింది. అప్పటికే అరెస్టయి ఒంటరిగా జైలు గదిలో ఉన్న జగన్‌కు సేవలు చేసేందుకు సునీల్‌ను అక్కడ ఉంచాలని అప్పట్లో అక్రమాస్తులు కేసు వాదించిన లాయర్లు సీబీఐ కోర్టులో పిటిషన్‌ వేశారు. దీంతో చాలాకాలంపాటు జగన్‌కు సునీల్‌ జైల్‌మేట్‌గా ఉన్నారు. జగన్‌కు బెయిల్‌ వచ్చే వరకూ కనీసం బెయిల్‌ పిటిషన్‌ కూడా వేయకుండా జైల్లోనే గడిపిన సునీల్‌ రెడ్డి విశ్వాసం జగన్‌ను మెప్పించింది. దీంతో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పది కంపెనీలకు ఆయనను యజమానిని చేసినట్లు సిట్‌ వర్గాలు ఆధారాలు సేకరించాయి. ఏపీలో మందుబాబుల రక్తాన్ని పీల్చి దోచుకున్న వేల కోట్ల రూపాయల మనీ రూటింగ్‌లో ఈ కంపెనీలను ఉపయోగించినట్లు సమాచారం. మన రాష్ట్రంతో పాటు పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటకల్లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాలతోపాటు ఇతర దేశాల్లో మైనింగ్‌లో పెట్టుబడులు పెట్టినట్లు ఇప్పటికే సమాచారాన్ని సేకరించిన సిట్‌ సేకరించింది. ఎన్నికల సమయంలో అభ్యర్థులకు పంచేందుకు తరలించిన డబ్బుల వివరాలు రాబట్టింది. అయితే తాజాగా సునీల్‌ రెడ్డి డైరెక్టర్‌గా ఉన్న కంపెనీల్లో సోదాలు జరిపింది.


అక్రమాస్తులకు నమ్మకమైన బినామీ..

తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని దోచుకున్న జగన్‌, లెక్కలేనన్ని సూట్‌ కేసు కంపెనీలు అప్పట్లో సృష్టించారు. ఆనాడు విజయసాయిరెడ్డి తర్వాత వినిపించిన పేరు సునీల్‌ రెడ్డిదే. వైఎస్‌ హయాంలో జగన్‌ దోపిడీపై 11కేసులు నమోదు చేసి మూలాలు వెలికి తీసిన సీబీఐ... ఎమ్మార్‌ ప్రాపర్టీర్‌ కుంభకోణంలో సునీల్‌ పాత్రను గుర్తించింది. రికార్డుల్లో ఐదు వేల రూపాయల గజం ధర చూపించి నగదు రూపంలో యాభై వేలు తీసుకుని సుమారు 134కోట్ల రూపాయలు దారి మళ్లించినట్లు ఆధారాలు సేకరించింది. దీంతో ఆ కేసులో సునీల్‌ రెడ్డిని నిందితుడిగా చేర్చి చంచల్‌ గూడ జైలుకు తరలించింది.


చిరుద్యోగిగా మొదలై..

కడప జిల్లా వీరపునాయుని పల్లె మండలంలోని చిన్న గ్రామం అనిమెలకు చెందిన నర్రెడ్డి సునీల్‌ రెడ్డి కుటుంబం నాలుగు దశాబ్దాల క్రితం పులివెందులకు వలస వెళ్లింది. సునీల్‌ రెడ్డికి ఏదైనా ఉద్యోగం ఇప్పించమంటూ వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి బావ సీవీ సుబ్బారెడ్డిని ఆయన తండ్రి సింగిరెడ్డి కోరారు. వైఎస్‌ సిఫారసుతో జగన్‌ కంపెనీల్లో సునీల్‌ చిరుద్యోగిగా చేరారు. అయితే, అక్కడ సునీల్‌ చురుకుదనాన్ని ప్రదర్శించి అనతికాలంలోనే జగన్‌కు వ్యక్తిగత సహాయకుడిగా మారారు. జగన్‌ జైలుకు వెళ్లడానికి ముందు రోజువరకూ ఆయన ఫోన్‌ సునీల్‌ వద్దే ఉండేది. ఏదైనా వస్తే జగన్‌కు అందించేవారు. ఎవరితోనైనా ఫోన్‌ మాట్లాడాలంటే కలిపించేవారు. కానీ కంపెనీలు పెట్టి వ్యాపారాలు చేసే ఆర్థిక స్థితి మంతుడు మాత్రం కాదు.

రెండు జే బ్రాండ్లు సునీల్‌వే.?

వైసీపీ ప్రభుత్వంలో ఐదేళ్ల పాటు రాష్ట్రంలో మద్యం సేవించే వారికి సరఫరా చేసిన జే బ్రాండ్లలో రెండు ఉత్పత్తులు సునీల్‌ రెడ్డివేనని సిట్‌ గుర్తించినట్లు సమాచారం. జగన్‌ సీఎం అయ్యాక ఎక్కువగా హైదరాబాద్‌లోనే ఉంటూ లిక్కర్‌ వ్యవహారాలను సునీల్‌ చక్కబెట్టారు. పనిలో పనిగా ఆయన ఏపీలో రెండు మద్యం బ్రాండ్లను ప్రవేశపెట్టి భారీగానే వెనకేసుకున్నట్లు సిట్‌కు ఉప్పందింది. టెక్నాలజీ సాయంతో లోతుగా ఆరా తీయడంతో డొల్ల కంపెనీల బాగోతం బయటపడింది. ముడుపుల సొమ్ము హైదరాబాద్‌లో తీసుకుని హవాలా రూపంలో విదేశాలకు తరలించి తిరిగి అదే సొమ్ము తెల్ల డబ్బుగా ఈయన కంపెనీల నుంచి పెట్టుబడుల రూపంలో వస్తున్నట్లు సమాచారం. తాజాగా సిట్‌ జరిపిన సోదాల్లో అత్యంత కీలక సమాచారం లభించినట్లు తెలుస్తోంది.

Updated Date - Sep 12 , 2025 | 08:26 AM