Public Reaction: జగన్.. కాస్త అప్‌డేట్ అవ్వూ
ABN , Publish Date - Sep 03 , 2025 | 03:31 AM
సీఎం చంద్రబాబుపై అక్కసు, బుర ద చల్లడమే లక్ష్యంగా వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ చేసిన ప్రయత్నం అబాసుపాలైంది. ‘హెరిటేజ్ ఫ్రెష్’ యజమాని ఎవరో కూడా తెలుసుకోకుండా ఆయన...
చంద్రబాబుకు, హెరిటేజ్ ఫ్రెష్‌కు లింకు పెట్టడంపై నెటిజన్ల సెటైర్లు
9 ఏళ్ల క్రితమే ఆ సంస్థను అమ్మేసిన బాబు
అమరావతి, సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబుపై అక్కసు, బుర ద చల్లడమే లక్ష్యంగా వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ చేసిన ప్రయత్నం అబాసుపాలైంది. ‘హెరిటేజ్ ఫ్రెష్’ యజమాని ఎవరో కూడా తెలుసుకోకుండా ఆయన, చంద్రబాబుపై విమర్శలు చేశారు. మంగళవారం కడప జిల్లా వేముల మండలం దుగ్గన్నగారి పల్లి వద్ద ఉల్లి పంటను పరిశీలించిన జగన్... ‘రైతులతో కూటమి సర్కార్ ఆడుకుంటోంది. ఉల్లి క్వింటాకు రూ.800 కూడా గిట్టుబాటు కావడం లేదు. రైతుల నుంచి కేవలం రూ.6కు కొని అదే ఉల్లిని హెరిటేజ్ ఫ్రెష్ దుకాణాల్లో కేజీ రూ.35 చొప్పున అమ్ముతున్నారు. చంద్రబాబు తన లాభాలు కొద్దిగా తగ్గించుకున్నా రైతులకు మేలు జరుగుతుంది’ అంటూ విమర్శించారు. హెరిటేజ్ ఫ్రెష్ ఇంకా చంద్రబాబుదేనన్న ఉద్దేశంతో జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి సుమారు 9 ఏళ్ల క్రితమే హెరిటేజ్ ఫ్రెష్‌ను చంద్రబాబు కుటుంబం విక్రయిం చేసింది. కానీ జగన్ మాత్రం హెరిటేజ్ ఫ్రెష్ చంద్రబాబుదేనంటూ చేసిన వ్యాఖ్యలపై ప్రస్తుతం నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ‘ఓ జగనూ.. హెరిటేజ్ ఫ్రెష్‌ను అమ్మేసి కొన్ని సంవత్సరాలు గడిచాయి. ఇప్పుడే నిద్రలేచి హెరిటేజ్.. హెరిటేజ్ అని కలవరిస్తే ఎలా చెప్పు. జగన్ కాస్త అప్‌డేట్ అవ్వూ.... ఏళ్లనాటి వెనుకబాటు నుంచి బయటకురా’ అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.