International Experts: జగన్ తప్పిదాలు సరిదిద్దాల్సిందే
ABN , Publish Date - Oct 10 , 2025 | 05:14 AM
పోలవరం ప్రాజెక్టు పనులు సజావుగా సాగాలంటే.. 2019-24 మధ్య నాటి సీఎం వైఎస్ జగన్ హయాంలో జరిగిన విధ్వంసాన్ని సరిదిద్దాల్సిందేనని నలుగురు సభ్యులతో...
పోలవరం గైడ్‌బండ్‌ను పునర్నిర్మించాల్సిందే: విదేశీ నిపుణులు
దానికి మరమ్మతులు సాధ్యం కాదు
కొత్త డయాఫ్రం వాల్ 7 నెలల్లోనే సగం పూర్తయింది
మార్చికల్లా మొత్తం అయిపోతుంది
ఆ తర్వాత పాత వాల్‌ను మూసేయాలి
దిగువ కాఫర్ డ్యాం సీపేజీని నిలువరించేలా చర్యలు చేపట్టాలి
2027 నాటికి పోలవరం పూర్తి కావాలంటే పనులను రోజువారీ పరిశీలించాల్సిందే
రిపోర్టులో నిపుణుల స్పష్టీకరణ
అమరావతి, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు పనులు సజావుగా సాగాలంటే.. 2019-24 మధ్య నాటి సీఎం వైఎస్ జగన్ హయాంలో జరిగిన విధ్వంసాన్ని సరిదిద్దాల్సిందేనని నలుగురు సభ్యులతో కూడిన అంతర్జాతీయ నిపుణుల ప్యానెల్ స్పష్టం చేసి ంది. నాడు కుంగిపోయిన గైడ్‌బండ్‌ను మరమ్మతు చేయడం సాధ్యం కాదని తేల్చిచెప్పిం ది. కొత్తగా పునర్నిర్మించాల్సిందేనని.. ఇందుకోసం డిజైన్లను తయారు చేయాలని పేర్కొం ది. దిగువ కాఫర్ డ్యాం సీపేజీని నివారించేందుకు రోజువారీ పరిశీలన చేయాలని సూచించింది. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ధ్వంసమైన డయాఫ్రం వాల్‌కు సమాంతరంగా నిర్మిస్తున్న కొత్త వాల్ పనులు ఏడు నెలల్లోనే 50 శాతం మేర పూర్తయ్యాయని కితాబిచ్చింది. దీనిని ఈ డిసెంబరుకే పూర్తి చేస్తామని జలవనరుల శాఖ చెబుతున్నా.. కాంట్రాక్టు సంస్థ బావర్ మాత్రం వచ్చే ఏడాది మార్చికి పూర్తి చేస్తామని చెబుతోందని తెలిపింది. మొత్తంగా ప్రాజెక్టు ప్రధాన డ్యాం పనుల్లో నాణ్యతా ప్రమాణాలు బాగున్నాయని వెల్లడించింది. ఎర్త్ కం రాక్‌ఫిల్ (ఈసీఆర్‌ఎఫ్) డ్యాం నిర్మాణం కోసం సేకరిస్తున్న మెటీరియల్‌లో నాణ్యత ఉందని సం తృప్తి వ్యక్తం చేసింది. ఈ మేరకు పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ)కి గత వారం (2న) నివేదిక సమర్పించింది. జగన్ 2019లో అధికారంలోకి వచ్చాక పోలవరం పనులను నిలిపివేయడం.. కేం ద్రం వద్దన్నా కాంట్రాక్టు సంస్థను తొలగించడం..
రివర్స్ టెండరింగ్ పేరిట దాదాపు ఏడాదిన్నర పాటు పనులు చేపట్టకపోవడం.. 2020లో గోదావరి నదికి వచ్చిన వరదకు డయాఫ్రం వాల్ దెబ్బతినడం, ఆ తర్వాత గైడ్‌బండ్ కుంగిపోవడం, కాఫర్ డ్యాంలో సీపేజీ తదితర నష్టాల నేపథ్యంలో ప్రాజెక్టు భవితవ్యంపై కేంద్ర జలశక్తిశాఖ తీవ్ర ఆందోళన చెందింది. భవిష్యత్ నిర్మాణాలను చేపట్టేందుకు తగిన సలహాలు ఇవ్వడానికి వీలుగా పీపీఏ సూచనల మేరకు అంతర్జాతీయ సాగునీటి ప్రాజెక్టుల నిపుణులు డేవిడ్ బి.పాల్, జియాస్ ఫ్రాంకో డి సిస్కో (అమెరికా), రిచర్డ్ డొనెల్లీ, ఎస్.హించ్‌బెర్గర్ (కెనడా)లతో కూడిన అంతర్జాతీయ నిపుణుల ప్యానెల్‌ను కేంద్ర జలశక్తి శాఖ నియమించింది. ఈ బృందం ఇప్పటికి ఐదు సార్లు ప్రాజెక్టు ప్రాంతంలో పర్యటించింది. చివరిగా ఈ ఏడాది ఆగస్టు నెలాఖరులో వచ్చినప్పుడు.. కొత్త డయాఫ్రం వాల్, ఇతర పనులను అధ్యయనం చేసింది. దానిపై తమ అభిప్రాయాలతో పీపీఏకి రిపోర్టు అందజేసింది. 2027 డిసెంబరు నాటికి ప్రధాన ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తామని నిర్మాణ సంస్థలు ధీమా వ్యక్తం చేస్తున్నాయని.. అయి తే ఇది జరగాలంటే ఆయా పనులను సాంకేతికంగా నిత్యం పరిశీలించాలని సూచించింది. మరోసారి ప్రాజెక్టు ప్రాంతంలో పర్యటించేందుకు సంసిద్ధత వ్యక్తంచేసింది. నవంబరులో 1, 15 తేదీల్లో, డిసెంబరులోనూ 1, 15 తేదీల్లో అందుబాటులో ఉంటామని పీపీఏకి తెలియజేసింది.
నిపుణుల కీలక సూచనలివీ..
కొత్త డయాఫ్రం వాల్ పూర్తయ్యాక.. దెబ్బతిన్న పాత డయాఫ్రం వాల్‌ను తొలగించాలి. ఇందుకోసం ఒక వర్క్‌షాపు నిర్వహించాలి. వాల్ నిర్మాణ పనుల ప్రగతి సంతృప్తికరంగా ఉంది. కేంద్ర జలశక్తి శా ఖ వినియోగిస్తున్న ‘ప్రైమావీరా’ సాఫ్ట్‌వేర్ ద్వారా డయాఫ్రం వాల్ పనులను రోజువారీగా పరిశీలించాలి.
దెబ్బతిన్న గైడ్‌బండ్ స్థానంలో కొత్తది నిర్మించాలి.
సీపేజీ ఉన్న దిగువ కాఫర్ డ్యాంను కూడా రోజువారీ పరిశీలన చేయాలి. సీపేజీ నివారణకు చర్యలు చేపట్టాలి.
స్పిల్‌వే సంబంధిత పనులన్నీ 2027 డిసెంబరుకు పూర్తి చేయాలి.
గ్యాప్-2 ఈసీఆర్‌ఎఫ్ డ్యాం కార్యాచరణను నవంబరు నాటికి సిద్ధం చేయాలి.