Share News

PCC Chief Sharmila: జగన్‌ ముసుగు మళ్లీ తొలగింది

ABN , Publish Date - Aug 23 , 2025 | 05:53 AM

ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్‌డీఏకు మద్దతు ఇవ్వడం ద్వారా వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ ముసుగు మళ్లీ తొలగిందని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల వ్యాఖ్యానించారు.

PCC Chief Sharmila: జగన్‌ ముసుగు మళ్లీ తొలగింది

  • దోచుకున్నది దాచుకోవడానికే మోదీకి మద్దతు

  • బీజేపీ అంటే బాబు... జగన్‌... పవన్‌ అని మళ్లీ నిరూపించారు: పీసీసీ చీఫ్‌ షర్మిల

అమరావతి, ఆగస్టు 22(ఆంధ్రజ్యోతి): ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్‌డీఏకు మద్దతు ఇవ్వడం ద్వారా వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ ముసుగు మళ్లీ తొలగిందని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల వ్యాఖ్యానించారు. బీజేపీకి బీ-టీమ్‌ అని వైసీపీ ప్రకటించుకున్నట్లు అయిందని ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. ప్రధాని మోదీకి జగన్‌ దత్తపుత్రుడని మరోసారి రుజువైందన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షం ముసుగులో మోదీ పక్షమే ఉందని తేటతెల్లమై పోయిందని ఆమె తెలిపారు. అందుకే.. బీజేపీ అంటే.. బాబు, జగన్‌.. పవన్‌ అని స్పష్టమైపోయిందని పేర్కొన్నారు. బీజేపీతో టీడీపీ జనసేనది తెరబయట పొత్తయితే.. వైసీపీది తెరవెనుక అక్రమ పొత్తని షర్మిల విమర్శించారు. రాష్ట్రంలో అధికార విపక్షాల కుస్తీ.. కేంద్రంలో బీజేపీతో దోస్తీ అన్నట్లుందని.. ఢిల్లీలో మతపిచ్చి బీజేపీతో జగన్‌ దోస్తీ చేస్తున్నారని మండిపడ్డారు. అవినీతి, కేసులకు భయపడి బీజేపీకి జగన్‌ మళ్లీ దాసోహం అన్నారని, ఐదేళ్లపాటు దోచుకున్నది దాచుకోడానికే బీజేపీకి జగన్‌ జై కొట్టారని పేర్కొన్నారు. మోదీ అక్రమాలను నిర్భయంగా బయట పెడుతున్న ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీపై జగన్‌ ఒంటి కాలిపై లేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలోని ప్రతిపక్షాలన్నీ కలసి రాజకీయాలతో సంబంధం లేని ఒక తెలుగు బిడ్డను, న్యాయ నిపుణుడిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెడితే... ఆయనకు కాకుండా బీజేపీ అభ్యర్థికి ఎలా మద్దతిస్తారని జగన్‌ను ప్రశ్నించారు.

Updated Date - Aug 23 , 2025 | 05:54 AM