Jagan Liquor Scam: మద్యం కాదు.. విషం అమ్మారు
ABN , Publish Date - Aug 12 , 2025 | 04:59 AM
వైసీపీ హయాంలో ఊరూ పేరూ లేని నాసిరకం బ్రాండ్లు విచ్చలవిడిగా అమ్మారు. పాపులర్ బ్రాండ్లను రాష్ట్రం నుంచి తరిమేసి ప్రభుత్వ మద్యం షాపుల ద్వారా జే బ్రాండ్లను అధిక ధరలకు బలవంతంగా అమ్మించారు.
ప్రాణాలు తోడేశారు
జనం ప్రాణాలతో జగన్ సర్కారు చెలగాటం
కాసుల కక్కుర్తికి ఎందరో పేదలు బలి
పీల్చి పిప్పిచేసిన నాసిరకం జే బ్రాండ్లు
నడి వయసులోనే ఎందరో మృత్యువాత
అనారోగ్యంతో మరికొందరు ఆస్పత్రుల పాలు
శుద్ధిచేయని స్పిరిట్ వాడటం వల్లే
ఇందులో మలినాలు, ప్రమాదకర పదార్థాలు
మరోవైపు అధిక రేట్లతో జేబులకూ చిల్లు
రోడ్డున పడ్డ ఎన్నో కుటుంబాలు
జేబులో డబ్బులే కాదు... ఒంట్లోని రక్త మాంసాలనూ పీల్చేశారు! ప్రభుత్వ దుకాణాల్లో మద్యం పేరుతో మెల్లగా ప్రాణాలను తోడేసే విషాన్ని విక్రయించారు! ఒకవైపు మాయదారి ‘బటన్’ నొక్కుతూ... మరోవైపుకిడ్నీ, కాలేయాలను గుల్ల చేశారు. సరిగా శుద్ధి చేయని నాసిరకం మందును అంటగట్టి... మనుషుల ప్రాణాలతో చెలగాటమాడారు. డబ్బు కోసం ఇంత నీచానికి ఒడిగట్టాలా? ముడుపుల కక్కుర్తికి బలహీనులను బలిచేయాలా? జగన్ హయాంలో జరిగిన ‘మద్యం స్కామ్’లో ఆర్థిక నేరం ఒక్కటే కనిపిస్తోంది. ఆ లెక్కలు ‘సిట్’ తవ్వి తీస్తోంది. మరి... వందల కుటుంబాల కన్నీళ్లకు జవాబు చెప్పేదెవరు? నాసిరకం మద్యానికి అవయవాలు దెబ్బతిని జీవచ్ఛవాలుగా బతుకుతున్న వారికి దిక్కెవరు? ఇది... కేవలం ఒక స్కామ్ కాదు! మానవ విషాదాన్ని సృష్టించిన మహా నేరం! జగన్ హయాంలో మద్యమనే ‘విషానికి’ బలైపోయిన కుటుంబాలు ఎన్నో! అవయవాలు దెబ్బతిని ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్న వారు ఎందరో! మనసులను కదిలించే... బండరాళ్లను సైతం కరిగించే వారి విషాద గాథలపై ‘ఆంధ్రజ్యోతి’ అందిస్తున్న ప్రత్యేక కథనం...
వైద్య ఆరోగ్య శాఖ సర్వే ప్రకారం.. మద్యం కారణంగా కాలేయం వ్యాధుల బారినపడిన వారు 2014-19 మధ్య 14,026 మంది ఉంటే, 2019-24 మధ్య ఆ సంఖ్య 29,369కి పెరిగింది. వారిలో 4,850 మంది మహిళలూ ఉన్నారు. నరాల బలహీనతతో నాడీ వ్యవస్థ దెబ్బతిన్నవారు 2014-19 మధ్య 1,276 మంది ఉండగా, 2019-24 మధ్య ఆ సంఖ్య ఏకంగా 12,663కు చేరింది. ఇక మద్యంతో కిడ్నీ వ్యాధుల బారినపడినవారు 2014-19 మధ్య 49,060 మంది ఉంటే, 2019-24 మధ్య ఆ సంఖ్య 90,385కు పెరిగింది.
(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్)
వైసీపీ హయాంలో ఊరూ పేరూ లేని నాసిరకం బ్రాండ్లు విచ్చలవిడిగా అమ్మారు. పాపులర్ బ్రాండ్లను రాష్ట్రం నుంచి తరిమేసి ప్రభుత్వ మద్యం షాపుల ద్వారా జే బ్రాండ్లను అధిక ధరలకు బలవంతంగా అమ్మించారు. ఫలితంగా పేదలు ఇల్లు, ఒళ్లు.. రెండూ గుల్ల చేసుకున్నారు.
అనారోగ్య సమస్యలతో ఎందరో ఆస్పత్రుల పాలయ్యారు. ఐదు పదులు కూడా దాటకనే మరణించారు.గత ఐదేళ్లలో కాలేయం, నరాలు, కిడ్నీ వ్యాధులు రెట్టింపయ్యాయి. వేలాది కుటుంబాలు ఆర్థికంగా, అనారోగ్యపరంగా చితికిపోయాయి. అందులోనూ కుటుంబ బాధ్యత మోసే మధ్య వయస్కులే ఎక్కువ మంది ఈ వ్యాధుల బారిన పడ్డారు. దీంతో ఆ కుటుంబాలు ఛిన్నాభిన్నమయ్యాయి. మద్యం తయారీలో ఉపయోగించిన ఎక్స్‌ట్రా న్యూట్రల్ ఆల్కాహాల్(ఈఎన్‌ఏ) నాసిరకంగా ఉండటమే వినియోగదారులు రోగాల బారిన పడటానికి ప్రధాన కారణం. సుదీర్ఘకాలం నుంచి మార్కెట్‌లో ఉన్న అంతర్జాతీయ, జాతీయ పాపులర్ బ్రాండ్లు నాణ్యత విషయంలో రాజీపడవు. ఎందుకంటే.. ఆ బ్రాండ్లు క్రెడిబిలిటీ ఆధారంగా మద్యం వ్యాపారంలో ఉన్నాయి. కానీ వైసీపీ హయాంలో తీసుకొచ్చిన జే బ్రాండ్లు ఇవేం పట్టించుకోలేదు. తక్కువ ఖర్చుతో ఎక్కువ సొమ్ము రాబట్టుకోవాలనే కక్కుర్తితో ‘నాణ్యత’ను పూర్తిగా మరిచిపోయాయి. జే బ్రాండ్లలో ఈఎన్‌ఏ స్థాయి వరకు శుద్ధిచేయని స్పిరిట్‌తోనే మద్యం తయారు చేశారు. దానివల్ల ఆ స్పిరిట్‌లో మలినాలు, ఇతర ప్రమాదకర పదార్థాలు మిగిలిపోయి, తాగినవారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపింది. ఇదే విషయాన్ని అప్పట్లో చెన్నైలోని ఎస్‌జీఎస్ ల్యాబ్ ధ్రువీకరించింది. కానీ అధికార బలంతో ఆ నివేదికను అప్పట్లో తొక్కిపెట్టి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడారు. మద్యపాన నిషేధం చేస్తామని అధికారంలోకి వచ్చిన జగన్ దోపిడీ వనరుగా మార్చారు. మద్యం ధరలను రెట్టింపు చేసి పేదలు, దినసరి కూలీలు, సామాన్యుల నుంచి వేలకోట్లు దోచుకున్నారు. గత ప్రభుత్వంలో మద్యం స్కామ్‌లో 3500 కోట్లు దోచుకున్నట్టు సిట్ తేల్చిన సంగతి తెలిసిందే. ఇందులో జగన్‌కు వాటాలు వెళ్లినట్టు చార్జిషీట్‌లో పేర్కొంది. మద్యం స్కామ్‌పై సిట్ విచారణ జరుపుతోంది. నాడు ముడుపుల కోసం నాసిరకం మద్యం విక్రయించి ఎందరో జీవితాలను నాశానం చేశారు.
కుటుంబం ఛిన్నాభిన్నం
పశ్చిమగోదావరి జిల్లా తణుకు సమీపంలోని రేలంగి గ్రామంలో ప్రకాశం దంపతులు కష్టపడి కుటుంబాన్ని పోషించుకునేవారు. ఇద్దరు పిల్లలను చదివించుకునేవారు. కరోనా సమయంలో నాసిరకం మద్యాన్ని సేవించిన ప్రకాశం ఆరోగ్యం క్షీణించింది. పక్షవాతం వచ్చినట్టుగా ఒక వైపు కాళ్లు, చేతులు పనిచేయడం లేదు. ఇప్పుడు మంచానికే ప్రకాశం పరిమితమయ్యాడు. అంతకుముందు ఆయన ఓ రైసు మిల్లు కార్మికుడిగా పనిచేసేవాడు. ఇప్పుడు కుటుంట పోషణ భారంగా మారడంతో ప్రకాశం భార్య సునీత దుబాయ్ వెళ్లింది. గల్ఫ్ దేశంలో కష్టపడుతూ సొంతూరులో ఉన్న భర్తను పోషించుకుంటోంది. ఇద్దరు కుమారుల్లో ఒకబ్బాయి ప్రభుత్వ స్కూల్‌కు వెళుతున్నాడు. మరో కొడుకు కూలి పనులకు వెళుతూ తండ్రిని చూసుకుంటున్నాడు.
రక్తం అంతా నీరు
పల్నాడు జిల్లా పిడుగురాళ్లకు చెందిన దేవళ్ల వెంకటేశ్వర్లు కొన్నేళ్లుగా మద్యం తాగేవాడు. గత ప్రభుత్వ హయాంలో జే బ్రాండ్లు తాగి తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. ఏడాది క్రితం కదలలేని స్థితిలో ఉన్న వెంకటేశ్వర్లును గుంటూరు జీజీహెచ్‌కి తీసుకెళ్లగా.. కిడ్నీ, లివర్ పాడయ్యాయని వైద్యులు గుర్తించారు. దేహంలో రక్తం బదులు చెడునీరు నిండటంతో కాళ్లు సన్నబడి నిలబడలేని స్థితిలో ఉన్నాడు. ప్రస్తుతం మంచానికే పరిమితం కావడంతో భార్య, పిల్లలు సపర్యలు చేస్తున్నారు.

భర్తను పోగొట్టుకున్నా
‘కుటుంబ సభ్యులు, బంధువులు, తెలిసినవాళ్లు నాసిరకం మద్యం తాగొద్దని ఎంత చెప్పినా నా భర్త వినలేదు. అనారోగ్యం పాలై మరణించాడు. నాసిరకం మద్యం కారణంగానే నా భర్తను పోగొట్టుకున్నా’ అని తిరుపతి జిల్లా రేణిగుంట మండలం కరకంబాడి పంచాయతీ గొల్లపల్లికి చెందిన సుజాత ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె భర్త మునిచంద్ర (46) గతంలో టైలర్‌గా పనిచేసేవాడు. కుమార్తె, కుమారుడు ఉన్నారు. టైలరింగ్‌లో గిరాకీలు తగ్గిపోవడంతో కూలి పనులకు వెళ్లేవాడు. ఆ క్రమంలో మద్యానికి అలవాటు పడ్డాడు. రెండేళ్ల కిందట ఆరోగ్యం దెబ్బతింది. ఆస్పత్రిలో చూపిస్తే లివర్ పాడైందని చెప్పారు. అప్పులు చేసి రూ.6 లక్షల వరకు ఖర్చు పెట్టి వైద్యం చేయించినా ఫలితం లేకుండాపోయింది. ఈ ఏడాది జూన్ 2న మృతిచెందాడు. ఇప్పుడు అప్పులు మిగిలాయి. కూతురిని, కొడుకును బంధువులు చదివిస్తున్నారు. ఇటీవలి దాకా ఉపాధి పనులకు వెళ్లిన సుజాత తాజాగా ఓ ఆస్పత్రిలో హౌస్ కీపింగ్ పనికి కుదిరింది. అప్పులకు వడ్డీలు కట్టడమే కష్టంగా ఉందని వాపోయింది.

భార్య కూలి పనులకు...
అన్నమయ్య జిల్లా నిమ్మనపల్లె మండలానికి చెందిన ఈయన పేరు పసుపులేటి సుబ్రమణ్యం(50). గత వైసీపీ ప్రభుత్వంలో నాసిరకం మద్యం తాగి అనారోగ్యానికి గురయ్యాడు. లివర్ పాడైపోయి, కళ్లు కనిపించకుండా పోవడం, కాలు సమస్యలు వంటివి వచ్చాయి. ఉన్న ఆస్తి అమ్మి దాదాపు రూ.10 లక్షలు వైద్యానికి ఖర్చు చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అయినా అతని ఆరోగ్యం బాగుకాలేదు. ఎటువంటి పని చేయలేని పరిస్థితి. ప్రస్తుతం అతని భార్య సుభాషిణి కూలి పనులకు వెళ్తూ భర్తను పోషిస్తోంది.

ఇంటి పెద్దను కోల్పోయి...
విజయనగరం జిల్లా గజపతినగరం పట్టణానికి చెందిన అప్పలస్వామి అనే వ్యక్తి తాపీపని చేస్తూ జీవనం సాగించేవాడు. ఇతనికి మద్యం సేవించే అలవాటు ఉండేది. నాసిరకం మద్యం తాగొద్దని భార్య కుమారి ఎంత చెప్పినా వినలేదు. దీంతో అప్పలస్వామి అనారోగ్యం పాలయ్యాడు. విజయనగరంలోని ఓ ఆసుపత్రికి తీసుకురాగా... అప్పలస్వామి లివర్ డ్యామేజి అయినట్లు వైద్యులు చెప్పారు. ఆరు నెలలు గడిచిన తరువాత 2024 ఆగస్టులో అప్పలస్వామి మృతి చెందాడు. అప్పలస్వామికి ఓ కూతురు ఉంది. ఇంటి పెద్దను కోల్పోవటంతో ఆ కుటుంబం రోడ్డున పడింది.
అవయవాలన్నీ పాడైపోయి..
విశాఖపట్నంలో రుషికొండ బీచ్‌కు వెళ్లే మార్గంలో ఓ గ్రామానికి చెందిన 35 ఏళ్ల టాక్సీ డ్రైవర్ మద్యం కారణంగా అవయవాలన్నీ డ్యామేజీ అయి చనిపోయాడు. ఆయనకు భార్య ఉంది. పిల్లలు లేరు. ట్రావెల్స్‌లో డ్రైవర్‌గా పనిచేసేవాడు. నాసిరకం మద్యం తాగి రెండేళ్లు బాగా ఇబ్బంది పడ్డాడు. ఆస్పత్రిలో చేర్చగా మొదట లివర్, ఆ తరువాత కిడ్నీలు.. ఇలా ఒక్కో అవయవం పాడై ఏడాది క్రితం మరణించాడు. మాయదారి మందే తన భర్త ప్రాణాలు తీసిందని, ఏ దిక్కు లేకుండా పోయిందని భార్య వాపోతోంది.
మందు కాదు.. విషం..
చీప్ లిక్కర్ కొత్తేమీ కాదు.. అయితే జగన్ సర్కారులో ప్రమాదకరమైన నాసిరకం మద్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. మలినాలు, ప్రమాదకర పదార్థాలున్న స్పిరిట్‌తో నాసిరకం జేబ్రాండ్లు తయారు చేసి అమ్మించారు. ఈ మద్యం స్లో పాయిజన్ లాంటిది. నాడు ప్రభుత్వ పెద్దలు వేల కోట్లు దోచుకోవడానికి వేలాదిమంది పేదలను బలి చేశారు. నాసిరకం మద్యంతో చనిపోయినవారి కుటుంబ సభ్యులు చాలా మంది పరువు పోతుందని బయటకు చెప్పడానికి ఇష్టపడటం లేదు.
వైసీపీ ప్రభుత్వం పొట్టన పెట్టుకుంది
వైసీపీ పాలనలో నాణ్యత లేని మద్యం తాగి మా కుమారుడు భక్తుల హరి చనిపోయాడు. మాకు ఒక కుమారుడు, ఇద్దరు కూతుళ్లు. కుమారుడు హరి (37) తాడిపత్రి ట్రాన్స్‌కో కార్యాలయంలో కాంట్రాక్టు పద్ధతిలో లైన్‌మన్‌గా పనిచేసేవాడు. మమ్మల్ని పోషిస్తాడని ఆశలు పెట్టుకున్నాం. పెళ్లి చేయాలని సంబంధాలు చూసే సమయంలో లివర్ వ్యాధికి గురై చనిపోయాడు. ఇందుకు నాణ్యతలేని మద్యమే కారణం. గత వైసీపీ ప్రభుత్వం మా కుమారుడిని పొట్టన పెట్టుకుంది. మేం తాడిపత్రి ప్రభుత్వ ఆస్పత్రి ఎదురుగా టీ స్టాల్, టిఫిన్ సెంటర్‌ను నడుపుకొంటూ జీవనం సాగిస్తున్నాం. కూటమి ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి.
- భక్తుల రమణ, రమాదేవి, తాడిపత్రి
ఏ పనీ చేయలేకపోతున్నా..
నేను ఆటో డ్రైవర్‌ను. నాకు పదేళ్ల నుంచి మద్యం తాగే అలవాటు ఉంది. 2022లో అకస్మాత్తుగా తీవ్రంగా కడుపునొప్పి వచ్చింది. జంగారెడ్డిగూడెంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలకు తీసుకెళ్లారు. పెద్దపేగుకు పాంక్రియాస్ వ్యాధి సోకిందని తేల్చారు. అప్పటి నుంచి ఆరోగ్యంలో తేడా వచ్చింది. ఏలూరు, గుంటూరు, విజయవాడలో చూపించుకున్నా ప్రయోజనం లేదు. వైద్య ఖర్చుల కోసం రూ.3 లక్షల వరకు అప్పులు చేశాం. రెండు ఆటోలను ఫైనాన్స్ వ్యాపారులు తీసేసుకున్నారు. ఐదేళ్ల నుంచి ఏ పనీ చేయలేకపోతున్నాను. అమ్మ నాగమణి, భార్య సత్యవతి కూలి పనులకు వెళ్లి రెక్కలు, ముక్కలు చేసుకుని అప్పులు తీరుస్తున్నారు. వారే నా కుటుంబానికి జీవనాఽధారం. మాకు ముగ్గురు చిన్న పిల్లలున్నారు. మందులేసుకుంటే గానీ అడుగు తీసి అడుగు వేయలేకపోతున్నాను. నాసిరకం మద్యం తాగడం వల్ల నా ఆరోగ్యం పూర్తిగా చెడిపోయింది.
- జల్లా సురేశ్, పుట్లగట్లగూడెం,
జంగారెడ్డిగూడెం మండలం, ఏలూరు జిల్లా
అప్పులే మిగిలాయి
నా భర్త మాదన్న (43) గత పదేళ్లుగా ఆటో నడుపుతూ జీవనం సాగించేవాడు. అప్పుడప్పుడు మద్యం తాగేవాడు. మూడేళ్లుగా నాసిరకం మద్యం తాగి అనారోగ్యంతో గత ఏడాది ఏప్రిల్ నెలలో మృతి చెందాడు. అర ఎకరా పొలం ఉంది. ఇంటి వద్ద చిన్నపాటి కిరాణా దుకాణం నడుపుతూ ఇద్దరు కుమారులను చదివించుకుంటున్నాను. రూ.5 లక్షలకు పైగా అప్పు ఉంది. ఎలా తీర్చాలో అర్థం కావడం లేదు.
- నామాల గాయత్రి, తెర్నేకల్,
దేవనకొండ మండలం, కర్నూలు జిల్లా
పేగులు కాలిపోయాయి
వైసీపీ ప్రభుత్వంలో కొత్త రకం మద్యం తాగి అనారోగ్యానికి గురవుతూ వచ్చాను. ఏడాదిగా మద్యం బంద్ చేశాను. మూడు నెలల క్రితం రక్తపు వాంతులయ్యాయి. మలమూత్రాలకు వెళ్లినపుడు రక్తం పడేది. మా కుటుంబ సభ్యులు కర్నూలు ఆస్పత్రిలో చేర్పించారు. మద్యం తాగడం వల్ల పేగులు పాడయ్యాయని, కిడ్నీలు, లివర్ చెడిపోయాయని వైద్యులు చెప్పారు. రెండు సార్లు ఆపరేషన్ చేసి పాడైన పేగులుతొలగించారు. నేటికీ కర్నూలు ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నాను. ఇప్పటి వరకు రూ.8 లక్షలు ఖర్చయింది. అప్పు తెచ్చి వైద్యంచేయించుకుంటున్నాను. ఎకరా పొలం ఉంది. దానిని అమ్మినా అప్పు తీరదు.

- రాజు, ఆటోడ్రైవర్, దిబ్బనకల్లు గ్రామం,
ఆదోని మండలం, కర్నూలు జిల్లా
సగం మంది మద్యం బాధితులే
గుంటూరు జీజీహెచ్‌లోని గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఓపీ విభాగానికి చికిత్స కోసం వస్తున్న రోగుల్లో సగం మంది ఆల్కహాల్ బాధితులే ఉంటున్నారు. గతంలో మద్యపాన వ్యసనంతో చికిత్సలకు వచ్చే వారిలో 40-45 ఏళ్ల వయసు వారు కనిపించేవారు. ఇప్పుడు 20-25 ఏళ్ల యువకులూ రావడం ఆందోళన కలిగిస్తోంది. ఈ రోగుల్లో ఎక్కువగా కడుపు నొప్పి, పేగుపూత, ఎక్యూట్, క్రానిక్ పాంక్రియాటైటిస్, లివర్ వాపు, లివర్ సిర్రోసిస్, ఫ్యాటీ లివర్, హెపటైటిస్, మల్టీ ఆర్గాన్ డిస్‌ఫంక్షన్ సిండ్రోమ్ వంటి జబ్బులు వేధిస్తున్నాయి. ఇటీవల మద్యపానం చేసే వారిలో పెద్ద పేగు కేన్సర్, యూరిన్ బ్లాడర్ కేన్సర్ కేసులు కనిపిస్తున్నాయి. చీప్ లిక్కర్, కల్లుతో పాటు ఆల్కహాల్ పర్సెంటేజీ అధికంగా ఉండే విస్కీ, రమ్ వంటివి తీసుకొనేవారిలో ఈ దుష్ఫలితాలు అధికంగా కనిపిస్తున్నాయి. చిన్న వయసులోనే లివర్ సిర్రోసిస్ కేసులు పెరుగుతున్నాయి. గత నాలుగేళ్లుగా ఈ తరహా కేసులు బాగా పెరిగాయి.

- డాక్టర్ షేక్ నాగూర్ బాషా, అసిస్టెంట్ ప్రొఫెసర్, మెడికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, గుంటూరు జీజీహెచ్
భర్త, కొడుకును కోల్పోయా..
గత ప్రభుత్వంలో మద్యం తాగి నా భర్త, ఉన్న ఒక్క కొడుకూ చనిపోయారు. గత ఏడాది మే నెలలో నా భర్త పైబావి చిన్న ఆంజనేయ (55) కాలేయం, మూత్రపిండాలు దెబ్బతిని మరణించాడు. ఈ ఏడాది మే 6న నా కుమారుడు నర్సిరెడ్డి(31) లివర్ దెబ్బతిని మృతి చెందాడు. నేను చిన్న టీకొట్టు పెట్టుకుని ఒంటరిగా జీవనం సాగిస్తున్నాను. భూమి ఏమీ లేదు. ఇంత వరకు పింఛన్ రాలేదు. కూటమి ప్రభుత్వం నన్ను ఆదుకోవాలి.
- నరసమ్మ, మాధవరం గ్రామం,
మంత్రాలయం మండలం, కర్నూలు జిల్లా