Jagan: రప్పా రప్పా నరుకుతానంటే మంచిదే కదా
ABN , Publish Date - Jun 20 , 2025 | 03:59 AM
మన అభిమానాస్తుడై... నెక్స్ట్ టీడీపీ ప్రభుత్వంలో టీడీపీ వాళ్లను రప్పా రప్పా.. ఏం జాతరమ్మా అది, ఆ గంగమ్మ జాతరలో! ఏంటమ్మా అది, పొట్టేలు తల నరికినట్టు.. రప్పారప్పా నరుకుతానన్నాడు! మంచిదే కదా! అని వైసీపీ అధ్యక్షుడు, వైఎస్ జగన్ హర్షం, సంతృప్తి వ్యక్తం చేశారు
టీడీపీ నుంచి మారి మన అభిమానస్తుడయ్యాడు.. టీడీపీ వాళ్ల తల నరుకుతానంటున్నాడు
‘పుష్ప’ సినిమా డైలాగ్ చెప్పినా తప్పేనా!.. మనం ఏ ప్రపంచంలో ఉన్నాం సామీ!
‘నరుకుడు భాష’కు జగన్ సమర్థన.. పదేపదే అదే చెప్పించుకుని, చెప్పి ఆనందం
అమరావతి, జూన్ 19 (ఆంధ్రజ్యోతి): ‘‘మన అభిమానాస్తుడై... నెక్స్ట్ టీడీపీ ప్రభుత్వంలో టీడీపీ వాళ్లను రప్పా రప్పా.. ఏం జాతరమ్మా అది, ఆ గంగమ్మ జాతరలో! ఏంటమ్మా అది, పొట్టేలు తల నరికినట్టు.. రప్పారప్పా నరుకుతానన్నాడు! మంచిదే కదా!’’ అని వైసీపీ అధ్యక్షుడు, వైఎస్ జగన్ హర్షం, సంతృప్తి వ్యక్తం చేశారు. గురువారం ఆయన తాడేపల్లి నివాస ప్రాంగణంలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఎప్పట్లాగే ఎంపిక చేసుకున్న మీడియా ప్రతినిధులతో సుదీర్ఘంగా మాట్లాడారు. తన సత్తెనపల్లి పర్యటనలో వైసీపీ కార్యకర్త ఒకరు ‘2029లో వైసీపీ వచ్చిన వెంటనే గంగమ్మ జాతరలో పొట్టేలు తల నరికినట్లుగా రప్పారప్పా నరుకుతాం ఒక్కొక్కడిని’ అని ప్లకార్డులు ప్రదర్శించడంపై అడిగిన ప్రశ్నకు జగన్ తనదైన శైలిలో స్పందించారు. ‘అత్యుత్సాహంతోనో, ఆవేశంతోనో అలాంటి ప్లకార్డులు ప్రదర్శించి ఉండొచ్చు. ఈ ధోరణి సరికాదు’ అని జగన్ అంటారేమో అని భావించిన వాళ్లకు షాక్ ఇచ్చారు. అదే మాటను పదేపదే చెప్పించుకుని, ఆసక్తిగా విని, ఆనందంగా ఆస్వాదిస్తూ, ‘మంచిదే’గా అని ముక్తాయించారు.
మళ్లీ చెప్పమ్మా... మళ్లీ!
‘రప్పా.. రప్పా నరికేస్తాం’ అని ప్లకార్డులు పెట్టారంటూ ఒక మహిళా జర్నలిస్టు ప్రస్తావించినప్పుడు... ‘ఆ డైలాగ్ మళ్లీ చెప్పమ్మా! ఆ పూర్తి డైలాగ్ చెప్పు!’ అని జగన్ రెట్టించారు. మరో మీడియా ప్రతినిధి కల్పించుకుని ‘‘గంగమ్మ జాతరలో పొట్టేలు తల’’ అని అంటుండగానే... ‘‘ఆ మళ్లా చెప్పు. గట్టిగా చెప్పు. వినపడటం లేదు. మైకు తీసుకుని చెప్పు బాగా అర్థమవుతుంది’’ అని మరీ చెప్పించుకున్నారు. అదేమాట మళ్లీ మళ్లీ విని... ‘‘గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తలకాయ కోసినట్లు రప్పారప్పా నరికేస్తాం’’ అని పోస్టరు ఉందా అని జగన్ అమాయకంగా ప్రశ్నించారు. ‘‘అదేదో సినిమా డైలాగ్ అనుకుంటా! యా సినిమా డైలాగ్ అది’’ అని ఆసక్తిగా అడిగారు. ‘పుష్ప-2’ అని మీడియా ప్రతినిధి చెప్పడంతో .. ‘‘పుష్ప సినిమా డైలాగులా అవి! నువ్వే చెబుతున్నావుకదయ్యా స్వామీ! సినిమా డైలాగులు పెట్టినా తప్పేనా? డెమోక్రసీలో ఉన్నామా? లేమా? అర్థం కావడం లేదు. పుష్ప సినిమా డైలాగులు పెట్టినా తప్పేనా? పుష్ప ఫొటోలు పెట్టినా తప్పేనా? గడ్డం ఇట్లన్నా తప్పేనా.. గడ్డం అట్లన్నా తప్పేనా? ఏంది సామీ ఇది.. ఏ ప్రపంచంలో ఉన్నాం సామీ?’’ అని జగన్ నాటకీయత ప్రదర్శించారు.
అయితే మంచిదేకదా...
పోస్టర్ పట్టుకున్న కుర్రాడు టీడీపీ కార్యకర్త అని, టీడీపీ సభ్యత్వం కూడా ఉందని ఒక పాత్రికేయుడు అన్నారు. దీనిపై జగన్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ... ‘‘ఓ టీడీపీ సభ్యుడు కూడానా! మెంబర్ షిప్ కూడా ఉందా?’’ అని అన్నారు. జగన్ మీడియా జర్నలిస్టు సెల్‌ఫోన్‌లో ఆ వ్యక్తి ఫొటోను చూపించారు. ‘‘ఓహోహో బాగా చూడండబ్బా! సభ్యత్వం కూడా ఉందంట! ఏమైనా(పార్టీ) మారినాడబ్బా.. మన దగ్గరికి వచ్చాడు’’ అని జగన్ వ్యాఖ్యానించారు. ‘‘టీడీపీ కార్యకర్త అయికూడా చంద్రబాబు మీద కోపంతో మారినాడని సంతోషపడదాం! నిజంగానే బాధుంటుందేమో కదా వాళ్లకు కూడా! అన్ని పథకాలూ ఎగరగొడుతున్నాడు. టీడీపీ యాక్టివ్ మెంబరైనా.. వైసీపీలో చేరి టీడీపీ వాళ్లమీద ఆక్రోశం చూపిస్తూ... గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తలలు నరికినట్లుగా రప్పారప్పా అన్నాడు. టీడీపీ సింపథైజర్ కూడా వైసీపీలో చేరి టీడీపీవాళ్లనే నరికేస్తామని అంటే మంచిదేకదా’’ అని జగన్ వ్యాఖ్యానించారు.
మరి వీటి మాటేమిటి?
రప్పారప్పా... అనేది పుష్ప సినిమా డైలాగ్, అది చెప్పినా తప్పేనా అని జగన్ ప్రశ్నిస్తున్నారు. మరి... జగన్ పర్యటనల్లో ‘ఎవడైనా రానీ తొక్కి పడేస్తాం! అన్న వస్తాడు, అంతు చూస్తాడు. నా కొడకల్లారా. పల్నాడు జిల్లా నుంచే రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తాం’... వంటి ప్లకార్డులూ ప్రదర్శించారు. జగన్ వాటినెలా సమర్థిస్తారో?? ఏం చెప్పాలని మనసులో అనుకున్నారో కానీ... బయటికి మాత్రం ‘నెక్ట్స్ టీడీపీ ప్రభుత్వంలో’ అనేశారు.
ఉన్మాది రవితేజకు టీడీపీతో సంబంధం లేదు
పల్నాడు జిల్లా ఉపాధ్యక్షుడు నలజాల సదాశివరావు
క్రోసూరు: గంగమ్మ జాతరలో నరికినట్లుగా తలలను నరుకుతామంటూ ఫ్లెక్సీ ప్రదర్శించిన బొల్లెద్దు రవితేజకు టీడీపీతో ఎటువంటి సంబంధం లేదని ఆ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు నలజాల సదాశివరావు స్పష్టం చేశారు. ‘2024 ఎన్నికలకు ముందు రవితేజ తండ్రి ఏలియా టీడీపీలో చేరినా క్రియాశీలంగా లేరు. తండ్రిని తీవ్రంగా వ్యతిరేకించిన రవితేజ... వైసీపీలో కొనసాగుతున్నాడు. కరుడుకట్టిన వైసీపీ ఉన్మాదిలా వ్యవహరిస్తున్నాడు. గతంలో జగన్ తాళ్లూరుకు వచ్చినప్పుడు కూడా అలాగే ప్రవర్తించాడు. అతను మా పార్టీకి చెందిన వాడిగా నిరూపిస్తే ఎటువంటి సవాల్‌కైనా సిద్ధం. రవితేజ లాంటి ఉన్మానదులను కఠినంగా శిక్షించాలి’ అని సదాశివరావు కోరారు.