Share News

Jagan Threats: మళ్లీ జగన్‌ బెదిరింపులు

ABN , Publish Date - Aug 06 , 2025 | 05:09 AM

వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి మరోసారి అధికారులను బెదిరించారు. వైసీపీ నేతలను జైళ్లలో పెడుతున్నారని.. తమ పార్టీవారిని ఇబ్బందిపెట్టే అధికారులపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Jagan Threats: మళ్లీ జగన్‌ బెదిరింపులు

  • తానొస్తే అధికారులపై చర్యలుంటాయని హెచ్చరిక

  • వైసీపీ లీగల్‌ సెల్‌ న్యాయవాదులతో భేటీ

  • యథావిధిగా అమరావతిపై అవినీతి ఆరోపణలు

  • కష్టపెట్టే అధికారుల పేర్లను యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలని లాయర్లకు సూచన

అమరావతి, ఆగస్టు 5(ఆంధ్రజ్యోతి): వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి మరోసారి అధికారులను బెదిరించారు. వైసీపీ నేతలను జైళ్లలో పెడుతున్నారని.. తమ పార్టీవారిని ఇబ్బందిపెట్టే అధికారులపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మంగళవారం తాడేపల్లి ప్యాలె్‌సలో వైసీపీ లీగల్‌ సెల్‌కు చెందిన ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల న్యాయవాదులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజధాని అమరావతి నిర్మాణంలో అవినీతి జరుగుతోందని యథావిధిగా ఆరోపించారు. మద్యం విక్రయాలు, మట్టి తవ్వకాల్లో అక్రమాల దందా జరిగిపోతోందన్నారు. మట్టి తవ్వాలన్నా.. మద్యం అమ్మాలన్నా పోలీసుల సమక్షంలో అవినీతి దందా, సెటిల్‌మెంట్లు జరుగుతున్నాయని ఆరోపించారు. అమరావతి నిర్మాణ పనుల్లో మొబిలైజేషన్‌ అడ్వాన్సులు నడుస్తున్నాయని.. పది శాతం అడ్వాన్సుల్లో ఎనిమిది శాతం స్థానిక ఎమ్మెల్యేలకు, నేతలకు ఇస్తున్నారని ఆరోపించారు. మట్టి తవ్వాలన్నా, పరిశ్రమలు పెట్టాలన్నా అధికారపక్షం వాళ్లకు డబ్బులు ఇవ్వాల్సిందేనన్నారు. రాష్ట్రంలో కలియుగ రాజకీయం నడుస్తోందని.. తప్పుడు కేసులతో వైసీపీ నేతలను జైల్లో పెట్టి పరువు తీస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. పార్టీ న్యాయవాదుల డేటాను నిక్షిప్తం చేస్తున్నామని, మళ్లీ అధికారంలోకి వచ్చాక వారికి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. త్వరలోనే పార్టీ యాప్‌ను ప్రారంభిస్తానన్నారు. కూటమి వల్ల ఇబ్బందులు పడిన వారందరూ.. ఏయే అధికారులు తమను కష్టాలకు గురిచేశారోవారి పేర్లను అందులో అప్‌లోడ్‌ చేయాలని సూచించారు. వైసీపీ 2.0 వచ్చాక వారిపై చర్యలు ఉంటాయన్నారు.

Updated Date - Aug 06 , 2025 | 05:10 AM